జగన్ నియంతృత్వ పోకడ: నారా లోకేశ్

అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని నారా లోకేశ్ విమర్శించారు

  • By: Somu    latest    Jan 22, 2024 12:26 PM IST
జగన్ నియంతృత్వ పోకడ: నారా లోకేశ్
  • అంగన్వాడీల తొలగింపు ఉత్తర్వులే నిదర్శనం
  • టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్


విధాత: అంగన్వాడీలను ఉద్యోగాల నుంచి తొలగిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడం.. సీఎం జగన్ నియంతృత్వ పోకడలకు అద్దంపడుతోందని టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ విమర్శించారు. ఈమేరకు సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేసిన ఆయన.. అంగన్వాడీల సమ్మెకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నట్లు స్పష్టం చేశారు. జగన్ ప్రభుత్వం తొలగించే అంగన్వాడీలను టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఎటువంటి సర్వీసు అంతరాయం లేకుండా తిరిగి ఉద్యోగాల్లోకి తీసుకొస్తామని హామీ ఇచ్చారు.


జగన్ వదిలిన బాణంగా చెప్పుకొచ్చిన షర్మిల తిరిగి తనవైపే దూసుకురావడం.. సొంత పార్టీ ఎమ్మెల్యేల తిరుగుబాటులో జగన్ కు మతిభ్రమించి ఇలాంటి పోకడలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. తాటాకు చప్పుళ్లకు లొంగని అంగన్వాడీలు ‘చలో విజయవాడ’కు పిలుపునివ్వడంతో తాడేపల్లి ప్యాలెస్ లో ప్రకంపనలు చెలరేగుతున్నాయని లోకేశ్ అన్నారు. జగన్ ప్రభుత్వం ఇప్పటికైనా దిగిరావాలని, అంగన్వాడీల న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని కోరారు.


అంగన్వాడీల ఆందోళనలతో వైసీపీలో వణుకు : అచ్చెన్నాయుడు


ఆంధ్రప్రదేశ్ లో సుమారు 42 రోజులుగా సమ్మె బాటపట్టిన అంగన్వాడీల ఆందోళనలతో తాడేపల్లి ప్యాలెస్ లో వణుకు మొదలైందని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. సోమవారం మీడియాతో మాట్లాడిన ఆయన.. అంగన్వాడీల తొలగింపు ఉత్తర్వులను ఖండించారు. ఏపీలో ప్రజాస్వామ్యాన్ని జగన్ రెడ్డి పాతరేశారని విమర్శలు చేశారు.


రాష్ట్రాన్ని తన సొంత జాగీరులా జగన్ భావిస్తున్నారని, ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయడమూ నేరమా అంటూ ప్రశ్నించారు. అంగన్వాడీలపై జగన్ తీరు దుర్మార్గమని మండిపడ్డారు. వారిని ఉద్యోగాల నుంచి తొలగించే అధికారం జగన్ కు ఎవరిచ్చారని నిలదీశారు. అంగన్వాడీల కన్నీటిలో వైసీపీ ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు.