పరీక్షలను కాదు.. కేసీఆర్ సర్కారుని రద్దు చేయాలి: రేవంత్ రెడ్డి

- పారదర్శక నియామకాలకు కాంగ్రెస్ రావాలి
- నిరుద్యోగుల చేతిలో కేసీఆర్‌కు శిక్ష తప్పదు
- సీఎం కేసీఆర్‌కు రేవంత్ రెడ్డి లేఖ
విధాత, హైదరాబాద్: సీఎం కేసీఆర్ అన్యాయమైన, దుర్మార్గామైన పాలనకు విద్యార్ధులు, నిర్యుదోగుల చేతిలో శిక్ష తప్పదన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. గ్రూప్-1 (ప్రిలిమినరీ) పరీక్ష రద్దు విషయంపై ముఖ్యమంత్రికి ఆయన బహిరంగ లేఖ రాశారు. అసలు పరీక్షలు రద్దు కాదు. కేసీఆర్ సర్కారునే రద్దు చేస్తేనే ఉద్యోగాల భర్తీ పారదర్శకంగా జరుగుతుందన్నారు. తెలంగాణలో న్యాయంగా ఉద్యోగ నియామకాలు జరగాలంటే కేసీఆర్ సర్కారును రద్దు చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ఏకైక మార్గమన్నారు. పరీక్షను మరోసారి నిర్వహించమని హైకోర్టు ఇచ్చిన తీర్పు మీ ప్రభుత్వానికి చెంపపెట్టు అని లేఖలో పేర్కొన్నారు. మీ పాలనలో వ్యవస్థల విధ్వంస ప్రతిఫలిమే ఈ దుస్థితి అని తెలిపారు.
తెలంగాణ ఉద్యమం మొదలైనప్పటి నుంచి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కాకతీయ యూనివర్సిటీ వరకు విద్యార్ధులు, యువత తెలంగాణ ఉద్యమానికి అలంబనగా నిలిచి ఆ ఉద్యమం చల్లారకుండా తెలంగాణ రాష్ట్ర అవశ్యకతను సజీవంగా ఉండేలా చేశారన్నారు. 1952 ముల్కీ, నాన్ ముల్కీ ఉద్యమం, 1969 మొదటి దశ ఉద్యమం నుంచి 2014 వరకు జరిగిన మలి దశ వరకు జరిగిన తెలంగాణ ఉద్యమంలో యువత, విద్యార్ధులు కీలక పాత్ర పోషించారన్నారు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి యువత, విద్యార్ధులకు అడుగడునా పరాభావం ఎదురవుతూనే ఉందని వెల్లడించారు.
ఇంటర్మీడియెట్ పేపర్ల మూల్యాంకనంలో దొర్లిన తప్పులతో 27 మంది విద్యార్ధుల ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2015లో సింగరేణి మొదలు, ఎంసెట్ పేపర్ లీకేజీ, విద్యుత్ సంస్థ నియామక పరీక్ష పేపర్ లీక్, పదో తరగతి పేపర్ లీకు, అక్కడి నుంచి టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీతో మీ మోసం పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు. ఇంత జరిగిన మీ ప్రభుత్వంలో చలనం లేదు. ఒక్క సమీక్ష సమావేశం నిర్వహించిన పాపాన పోలేదన్నారు.
నీళ్లు..నిధులు..నియామకాలు నినాదంతో తెలంగాణ యువతను ఆకర్షించి అధికారంలోకి వచ్చిన మీరు గడిచిన 9 ఏళ్లలో ఉద్యోగాల భర్తీ విషయంలో పదే పదే మోసం చేస్తూనే ఉన్నారు. రాష్ట్రంలో 1.92 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని బిస్వాల్ కమిటీ నివేదిక స్పష్టంగా పేర్కొన్నప్పటికీ ఆ ఖాళీలను భర్తీ చేయాలన్నా ఆలోచన చేయ లేదన్నారు. సునీల్ నాయక్, భాషా లాంటి వందలాది మంది యువత నిరాశ నిస్పృహలకు లోనై ఆత్మహత్యలు చేసుకున్న కూడా పట్టించుకోకుండా దారుణంగా వ్యవహరించారని విమర్శించారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు రూ. 3,106 భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని మోసం చేశారన్నారు. ఉద్యోగాలను భర్తీ చేస్తారనే ఆశతో 30 లక్షల మంది యువత నిద్రాహారాలు మాని పరీక్షలకు సిద్ధమవుతున్నారన్నారని, తల్లిదండ్రులు పంపించే చాలిచాలనీ డబ్బులతో హాస్టళ్లలో ఉండి కోచింగ్ సెంటర్లకు డబ్బులు కట్టి పరీక్షలకు ప్రిపేరవుతున్నారని, అయినప్పటికీ ప్రభుత్వంలో సోయి లేదని విమర్శించారు. మీ నిర్లక్ష్యంతో గతేడాది అక్టోబర్ 22న నిర్వహించిన గ్రూప్-1 (ప్రిలిమినరీ)కు పరీక్షను రద్దు చేయాల్సి వచ్చింది.
దీంతో 2 లక్షల 80 వేల మంది విద్యార్ధుల జీవితం ఆగమ్యగోచరంగా తయారైందన్నారు. ఇంత జరిగిన పేపర్ లీకేజీపై సరైన చర్యలు తీసుకోకుండా అందుకు కారణమైన వారిని శిక్షించకుండా ఈ ఏడాది జూన్ 11న మరోసారి గ్రూప్-1(ప్రిలిమినరీ) పరీక్ష నిర్వహించారు. తప్పులు దిద్దుకొని గత అనుభవం నుంచి ఈ సారైనా పడక్బందీగా పరీక్ష నిర్వహిస్తారానుకుంటే, మీ వక్రబుద్ధితో పరీక్ష నిర్వహణలో డొల్లతనాన్ని బయట పెట్టుకున్నారన్నారు.
బయోమెట్రిక్ వ్యవస్థను ఏర్పాటు చేయడం, హాల్ టికెట్ నెంబర్ తో ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం కనీస బాధ్యత. కానీ ఘనత వహించిన పాలనలో ఇవేమీ పట్టించుకోకుండా బయోమెట్రిక్ తీసుకోకపోవడం, హాల్ టికెట్ నెంబర్ లేకుండా ఓఎంఆర్ షీట్లు ఇవ్వడం వంటి దారుణమైన తప్పులకు పాల్పడ్డారు. నీవు చేసిన దుర్మార్గాలపై విద్యార్ధులు మా పార్టీ విద్యార్ధి విభాగం ఎన్ఎస్ యూఐని ఆశ్రయించారు. వారి తరపున ఎన్ఎస్ యూఐ న్యాయం పోరాటం చేసింది.
ఫలితంగా గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షను తిరిగి నిర్వహించమని హైకోర్టు ఇచ్చిన తీర్పు నీకు చెంప పెట్టు అని తెలిపారు. మూడు నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుందని, విద్యార్థులు, నిరుద్యోగులు నిరాశపడవద్దని, ఇప్పటికే యువత, విద్యార్ధి కోసం యూత్ డిక్లరేషన్ ప్రకటించామన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం. ప్రతి ఒక్క నిరుద్యోగికి నెలకు రూ. 4 వేల నిరుద్యోగ భృతి అందజేస్తాం. జాబ్ కాలెండర్ ప్రకటించి నిర్ణీత సమయంలోగా పారదర్శకంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.