బీజేపీ పార్లమెంట్ పొలిటికల్‌ ఇన్‌చార్జ్‌ల నియామకం.. జాబితాలో వీరే

మెదక్ పార్లమెంట్ బీజేపీ ఇంచార్జిగా సిర్పూర్ కాగజ్ నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ ను బీజేపీ అధిష్టానం నియమించింది

బీజేపీ పార్లమెంట్ పొలిటికల్‌ ఇన్‌చార్జ్‌ల నియామకం.. జాబితాలో వీరే

విధాత, మెదక్ ప్రత్యేక ప్రతినిధి: లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధమయ్యే దిశగా బీజేపీ వివిధ లోక్‌సభ స్థానాలకు పొలిటికల్‌ ఇన్‌చార్జులను సోమవారం ప్రకటించింది. వీరిలో హైదరాబాద్‌ నుంచి గోషామహల్‌ ఎమ్మెల్యే రాజాసింగ్‌ను ప్రకటించడం విశేషం. సికింద్రాబాద్‌కు కే లక్ష్మణ్‌, చేవెళ్లకు వెంకట్ నారాయణ రెడ్డి, మల్కాజిగిరికి పైడి రాకేష్ రెడ్డి, ఆదిలాబాద్‌కు పాయల్ శంకర్, పెద్దపల్లికి రామారావు పటేల్‌, కరీంనగర్‌ ఇన్‌చార్జ్‌గా ధన్ పాల్ సూర్యనారాయణ నియమితులయ్యారు. ఇక నిజామాబాద్‌కు ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించారు. జహీరాబాద్‌కు వెంకటరమణ రెడ్డి, మహబూబ్ నగర్‌కు రామచందర్ రావును నియమించారు. నాగర్‌కర్నూలు పొలిటికల్‌ ఇన్‌చార్జ్‌గా మాగం రంగారెడ్డి వ్యవహరిస్తారు. నల్లగొండకు చింతల రామచంద్రారెడ్డి, భువనగిరికి ఎన్‌వీఎస్ఎస్ ప్రభాకర్‌ను నియమించారు. వరంగల్‌ బాధ్యతలను మర్రి శశిధర్‌రెడ్డికి, మహబూబాబాద్‌ బాధ్యతలు గరికపాటి మోహన్‌రావుకు ఇచ్చారు.


ఖమ్మం ఇన్‌చార్జ్‌గా పొంగులేటి సుధాకర్ రెడ్డిని నియమించారు. మెదక్‌కు పాల్వాయి హరీశ్‌ను నియమించారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని 7 శాసనసభా నియోజకవర్గాలకు గాను, ఇటీవల జరిగిన ఎన్నికల్లో 6 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. మెదక్‌లో మాత్రం కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. గజ్వేల్ లో మినహా బీజేపీ అభ్యర్థుల డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఈ క్రమంలో మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో పట్టు సాధించేందుకు ఆ పార్టీ దృష్టి సారించింది. అందులో భాగంగా మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ ఇంచార్జిగా ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కు బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది.