PM Modi | ముగింపు దశకు నరేంద్ర మోదీ శకం

PM Modi ఉన్నమాట: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శకం అంతిమ ఘట్టానికి చేరింది. మోదీ అవినీతికి అతీతుడు అన్నది అబద్ధం అని తేలిపోయింది. సంక్షేమ పథకాలపై ఆయనది రెండు నాల్కల ధోరణి. దేశమంతటా ప్రభుత్వ వ్యతిరేకత, ప్రత్యేకించి మోదీ వ్యతిరేకత బలంగా వీస్తున్నది. 2019 ఎన్నికలనాటి మోదీ అనుకూల పవనాలు ఇప్పుడు లేవు. నరేంద్ర మోదీ ఇప్పుడు ఆఖరి ఆట ఆడుతున్నారు. ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న, జరుగనున్న రాష్ట్రాలలో పరిస్థితులు తలకిందులు చేసైనా […]

  • By: Somu    latest    May 04, 2023 10:14 AM IST
PM Modi | ముగింపు దశకు నరేంద్ర మోదీ శకం

PM Modi

ఉన్నమాట: ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) శకం అంతిమ ఘట్టానికి చేరింది. మోదీ అవినీతికి అతీతుడు అన్నది అబద్ధం అని తేలిపోయింది. సంక్షేమ పథకాలపై ఆయనది రెండు నాల్కల ధోరణి. దేశమంతటా ప్రభుత్వ వ్యతిరేకత, ప్రత్యేకించి మోదీ వ్యతిరేకత బలంగా వీస్తున్నది. 2019 ఎన్నికలనాటి మోదీ అనుకూల పవనాలు ఇప్పుడు లేవు. నరేంద్ర మోదీ ఇప్పుడు ఆఖరి ఆట ఆడుతున్నారు.

ఈ ఏడాది ఎన్నికలు జరుగుతున్న, జరుగనున్న రాష్ట్రాలలో పరిస్థితులు తలకిందులు చేసైనా గెలవాలని ఆయన తిరుగుతున్నారు. కర్ణాటక ఎన్నికలలో అడ్డగోలు మాటలు, అడ్డగోలు ప్రచారాలకు దిగుతున్నారు. గతంలో ఏ ప్రధానీ ఏ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్నిసార్లు ఇంత డబ్బు ఖర్చు చేసి ఎన్నికల ప్రచారం చేసిన దాఖలాలు లేవు.

ఒక రాష్ట్ర ఎన్నికలకోసం ఇంత ఆపసోపాలు పడుతున్నాడంటేనే ఆయన శకం ముగింపు దశకు వచ్చిందని అర్థమవుతున్నది. బెంగాల్‌లో ఇలాగే ప్రచారం చేశారు. అక్కడి ప్రజలు మోదీని తిప్పికొట్టారు. బీహార్‌లో ఇంతే దారుణంగా ప్రచారం చేశారు. అక్కడ చావుతప్పి కన్నులొట్టపోయింది. అస్సాం ప్రజలు తిరస్కరించారు. మధ్యప్రదేశ్‌లో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి అధికారం చేజిక్కించుకున్నారు.

రాజస్థాన్‌లో కూడా ఇప్పుడు అటువంటి ప్రయత్నమే చేస్తున్నారు. మహరాష్ట్ర కూడా దక్కదని అర్థం అయ్యి శిండే శివసేనకు చెయ్యిచ్చి.. పవార్‌ ఎన్సీపీకి అధికారాన్ని కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. బీజేపీకి ఒక్క ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌లో తప్ప ఏ రాష్ట్రంలోనూ పరిస్థితి బాగలేదు. ఉత్తరప్రదేశ్‌లో కూడా ప్రతిపక్షాలు ఒక్కటయితే ఈ సారి బీజేపీ సగం సీట్లు గెలవడం కూడా కష్టమే.

మోదీ పేదలను, మధ్య తరగతిని దోచి, కార్పొరేట్‌ కంపెనీలకు పెడుతున్నారన్న భావన ప్రజల్లో బాగా బలపడుతున్నది. అధిక ధరలు, బ్యాంకు ఈఎంఐల పెంపుదల మధ్యతరగతికి మోయరాని భారమైంది. ఆర్థిక వ్యవస్థ నుంచి కార్పొరేట్‌ కంపెనీలు లక్షలు, వేలకోట్ల రూపాయలు కొల్లగొడితే ప్రజల రుణాలకు సంబంధించిన ఈఎంఐలు పెంచి బ్యాంకుల ఖజానాలు ఎందుకు నింపాలన్న వాదన బలపడుతున్నది.

‘నరేంద్ర మోదీ ఒక ఆషాఢభూతి. చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండదు. పైకి సాధువులా మాట్లాడతారు, చేసే పనులుమాత్రం పరమ కంటకంగా ఉంటాయి. పైకి ఎప్పుడూ నీతులు చెప్పే ఈ పెద్దమనిషి అధికారంకోసం ఎంతటి ఘోరానికయినా పాల్పడతాడు’ అని ఒక రాజకీయ విశ్లేషకుడు అభిప్రాయపడ్డారు.

నరేంద్రమోదీ ఒక్క ముస్లింలకు మాత్రమే వ్యతిరేకి కాదు. దళితులు, బీసీలు, పేదలు, కార్మికులు, రైతులు, సామాజిక ఉద్యమ శక్తులు అన్ని వర్గాలకూ వ్యతిరేకి. ఈ వర్గాలలో కొందరిని మతం అనే మత్తులో ముంచి దేశాన్ని మధ్యయుగాలకు మళ్లించడానికి ప్రయత్నిస్తున్నారు. వందల మంది అమాయకులపై మతంపేరిట, కులం పేరిట దాడులు, హత్యాకాండ కొనసాగిస్తున్నారు.

సామాజిక ఉద్యమ కార్యకర్తలు, మేధావులు, రచయితలు గోవింద్‌ పన్సారే, నరేంద్ర ధబోల్కర్‌, ఎంఎం కలబురిగి, గౌరీ లంకేశ్‌ వంటి అనేక మందిని దుర్మార్గంగా కాల్చి చంపిన దుండగులూ నిక్షేపంగా తిరుగుతున్నారు. రుజువు కాని ఆధారాలతో అనేక మంది మేధావులను విద్యార్థులను జైల్లలో కుక్కిన మోదీ ప్రభుత్వం నరహంతకులు, రేపిస్టులకు మాత్రం క్షమాభిక్ష పెట్టి వదిలేస్తున్నది.ఒకప్పుడు ఆయనను అభిమానించిన వాళ్లే ఇప్పుడు ఆయన నిజస్వరూపం గురించి బాహాటంగా మాట్లాడుతున్నారు.

ఒకప్పుడు బీజేపీకి గొప్ప మేధావులుగా వ్యవహరించిన యశ్వంత సిన్హా, సత్యపాల్‌ మాలిక్‌, సుబ్రమణ్యస్వామి, అరుణ్‌ శౌరి, రాంజెత్మలాని, శతృఘ్నసిన్హా, అజయ్‌ అగర్వాల్‌ వంటివారు మోదీ ఎటువంటి వారో వివరిస్తున్నారు. మోదీ, అమిత్‌ షా వంచకులని రామ్‌జెత్మలాని విమర్శించారు. బీజేపీలో కూడా అంతర్గతంగా చర్చ మొదలయింది.

గత లోక్‌సభ ఎన్నికల తర్వాత పదమూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగితే సగం రాష్ట్రాలు ఓడిపోయారు. నరేంద్రమోదీ, అమిత్‌ షా వందల కోట్లు ఖర్చు పెట్టి, పంచాయతీ ఎన్నికలకంటే ఘోరంగా ప్రచారం చేశారు. అయినా ఢిల్లీ, బెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌, అసోం, హిమాచల్‌ప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాల్లో ఓడిపోయారు.

ఈశాన్య రాష్ట్రాల్లో త్రిపుర, అసోం తప్ప తక్కిన రాష్ట్రాలు గెలవలేకపోయారు. అనేక రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి ప్రభుత్వాలను తారుమారు చేసే కుట్రలకు దిగారు. గత లోక్‌సభ ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో కలిపి బీజేపీ ఇతర పార్టీల నుంచి 175 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసినట్టు రికార్డులు ఉన్నాయి. ఎమ్మెల్యేల కొనుగోళ్లలో అవినీతి సొమ్ము కీలక పాత్ర పోషించిందనేది అందరికీ తెలిసిన విషయమే.

– హితవాది