PM MODI | మోడీకి మూడిందా? దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలులు

PM MODI | గుజరాత్‌, యూపీలోనే గట్టిపట్టు దక్షిణాదిలో ఐదు మించితే గొప్ప మధ్య భారతంలో ఎదురీత తప్పదు మండుతున్న ఈశాన్యంపై ఆశే లేదు బలం కోసమే మహారాష్ట్రలో చిచ్చు బీహార్‌లో ఏకాకిగా కాషాయ పార్టీ యూపీలో పుంజుకోనున్న ఎస్పీ రాజకీయ విశ్లేషకులు అంచనాలు (విధాత, ప్రత్యేక ప్రతినిధి) భార‌తీయ జ‌న‌తా పార్టీ.. మునుపెన్నడూ లేనంత గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నదా? భారతదేశాన్ని రాజకీయంగా ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాలుగా విభజిస్తే.. ఏ ప్రాంతంలోనూ […]

  • By: Somu    latest    Jul 26, 2023 12:57 AM IST
PM MODI | మోడీకి మూడిందా? దేశవ్యాప్తంగా బీజేపీకి ఎదురుగాలులు

PM MODI |

  • గుజరాత్‌, యూపీలోనే గట్టిపట్టు
  • దక్షిణాదిలో ఐదు మించితే గొప్ప
  • మధ్య భారతంలో ఎదురీత తప్పదు
  • మండుతున్న ఈశాన్యంపై ఆశే లేదు
  • బలం కోసమే మహారాష్ట్రలో చిచ్చు
  • బీహార్‌లో ఏకాకిగా కాషాయ పార్టీ
  • యూపీలో పుంజుకోనున్న ఎస్పీ
  • రాజకీయ విశ్లేషకులు అంచనాలు

(విధాత, ప్రత్యేక ప్రతినిధి)

భార‌తీయ జ‌న‌తా పార్టీ.. మునుపెన్నడూ లేనంత గ‌డ్డు ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నదా? భారతదేశాన్ని రాజకీయంగా ఉత్తర, దక్షిణ, పశ్చిమ, తూర్పు, మధ్య, ఈశాన్య ప్రాంతాలుగా విభజిస్తే.. ఏ ప్రాంతంలోనూ గన్‌షాట్‌గా సీట్లు తెచ్చుకునే పరిస్థితి కనిపించడం లేదా? రాజకీయంగా గట్టి పట్టున్న యూపీ, గుజరాత్‌ మినహా ఇతర రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితేనా? అంటే.. అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

గత కొద్ది నెలలుగా ఆయా ప్రాంతాల్లో క్షేత్రస్థాయి పర్యటనలు చేసి, నిశితంగా పరిశీలిస్తున్న ఒక రాజకీయ విశ్లేషకుడు పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. పశ్చిమ భారత్‌లో గుజరాత్‌లో, మధ్యభారతంలో ఉత్తరప్రదేశ్‌లో మినహా గట్టిగా సీట్లు తెచ్చుకునే రాష్ట్రాలు కనిపించడం లేదని, దక్షిణాదిలో ఉన్నవి పోగా.. నాలుగైదు సీట్లతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి రావచ్చని ఆయన తెలిపారు. మోదీ

దక్షిణభారతంలో నాలుగైదే కష్టం!

ద‌క్షిణ భారతదేశంలో మొత్తం 131 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా 2019 ఎన్నిక‌ల్లో బీజేపీ.. క‌ర్ణాట‌క‌లో 25 స్థానాలు, తెలంగాణ‌లో 4 స్థానాలు గెల్చుకుంది. కానీ.. ప్రస్తుత పరిస్థితుల్లో ఈసారి నాలుగైదు స్థానాల‌కు మించి రావ‌ని ఆయ‌న చెప్పారు. దేశ‌వ్యాప్తంగా కూడా ఇదే ప‌రిస్థితి ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. దేశంలోని వివిధ రాష్ట్రాల‌ను సంద‌ర్శించి రాజ‌కీయ ప‌రిస్థితిని ఆయ‌న వాక‌బు చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా వివిధ పార్టీల రాజ‌కీయ నాయ‌కుల‌ను, జ‌ర్న‌లిస్టుల‌ను, మేధావుల‌ను సంప్ర‌దిస్తున్నారు.

దక్షిణాదిలో వచ్చే నాలుగు స్థానాలూ కర్ణాటకలోనివేనని, తెలంగాణలో ఒక్కటి కూడా దక్కే అవకాశం లేదని ఆయన అంచనా వేశారు. ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త అన్న‌ది రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తోపాటు కేంద్ర ప్ర‌భుత్వంపై కూడా బాగా ఏర్ప‌డింద‌ని ఆయ‌న విశ్లేషించారు. న‌రేంద్ర మోదీ స్వ‌యంగా స్థానిక నాయ‌కుల‌కంటే ఎక్కువ‌గా క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప్ర‌చారం చేశార‌ని, ప్ర‌జ‌లు మాత్రం ఆయనను నిర్ద్వంద్వంగా తిర‌స్క‌రించార‌ని ఆయ‌న గుర్తు చేశారు.

మహారాష్ట్రలో అందుకు చిచ్చు

ప‌శ్చిమ భార‌త్‌లో మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్, రాజ‌స్థాన్‌ల‌లో ఒక్క గుజ‌రాత్‌లో మాత్ర‌మే ఇప్ప‌టికీ బీజేపీ గ‌ణ‌నీయమైన సీట్లు గెలిచే అవ‌కాశం ఉంద‌ని ఆయన చెప్పారు. మ‌హారాష్ట్ర‌, రాజ‌స్థాన్‌ల‌లో కాంగ్రెస్, దాని మిత్ర ప‌క్షాలే ఎక్కువ స్థానాలు గెలుస్తాయ‌ని అన్నారు. 2019 ఎన్నిక‌ల్లో ఈ రాష్ట్రాల్లో 109 స్థానాల‌కు గాను బీజేపీ 73 స్థానాల‌ను గెల్చుకుంది. గుజ‌రాత్‌, రాజ‌స్థాన్‌ల‌లో నూటికి నూరు శాతం స్థానాల‌ను గెల్చుకుంది. ఈసారి అటువంటి ప‌రిస్థితి లేదు.

ప‌శ్చిమ భార‌త్‌లో 109 స్థానాలు ఉండ‌గా ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌ర్వాత ఎక్కువ లోక్‌స‌భ స్థానాలు క‌లిగిన మ‌హారాష్ట్ర ఈసారి కీల‌క పాత్ర పోషించ‌నుంద‌ని ఆయ‌న అన్నారు. అందుకే మ‌హారాష్ట్ర రాజ‌కీయాల‌ను వీలైనంత ధ్వంసం చేసి, త‌న‌కు అనుకూలంగా మార్చుకోవాల‌ని బీజేపీ చూస్తున్న‌ద‌ని వ్యాఖ్యానించారు. ఎంత చేసినా ఇప్ప‌టికీ బీజేపీకి అనుకూల వాతావ‌ర‌ణం ఏర్ప‌డ‌లేద‌ని, పార్టీల‌ను చీల్చిన ప‌ద్ధ‌తిపై ప్ర‌జ‌ల్లో తీవ్ర నిర‌స‌న ఉంద‌ని అన్నారు.

మధ్యభారత్‌లో ఎదురీత తప్పదా?

ఇక 54 స్థానాలు క‌లిగిన మ‌ధ్య భార‌త రాష్ట్రాలు మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఛత్తీస్‌గఢ్‌, జార్ఖండ్‌లలో బీజేపీ ఎదురీదుతున్న‌ద‌ని, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో మాత్ర‌మే కొన్ని స్థానాలు గెల్చుకునే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆయ‌న చెప్పారు. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ ఈ రాష్ట్రాల్లో 48 స్థానాల‌ను గెల్చుకుంది.

ఉత్తరాదిలో పలు చోట్ల సింగిల్‌ డిజిట్లే

అదే విధంగా ఉత్త‌ర‌భార‌త రాష్ట్రాల్లో మొత్తం 40 స్థానాలు ఉండ‌గా గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీకి 24 స్థానాలు ల‌భించాయి. ఢిల్లీ, హిమాచ‌ల్‌, హ‌ర్యానా, చండీగ‌ఢ్‌ల‌ను స్వీప్ చేసింది. పంజాబ్‌లో కూడా రెండు స్థానాలు వ‌చ్చాయి. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లో ఈ రాష్ట్రాల్లో బీజేపీ సింగిల్ డిజిట్ దాట‌ద‌ని ఆయ‌న అంచ‌నా వేశారు. కశ్మీర్‌లో రెండు ప్రధాన పార్టీలు ‘ఇండియా’ కూటమిలోనే ఉన్నాయి. ఇక ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌, బీహార్‌ల‌లో మొత్తం 125 స్థానాలు ఉండ‌గా బీజేపీ గ‌త ఎన్నిక‌ల్లో 79 స్థానాల‌ను గెల్చుకుంది. ఈసారి రెండు రాష్ట్రాల్లో క‌లిపి 40-50 స్థానాల‌కు మించ‌వ‌ని ఆయ‌న విశ్లేషించారు.

బీహార్‌లో బీజేపీ ఏకాకి అయింద‌ని, బ‌ల‌మైన ప్ర‌త్య‌ర్థి రాజ‌కీయ ప‌క్షాల‌న్నీ ఏక‌మ‌య్యాయ‌ని, అక్క‌డ చిల్లుపోయి గెల‌వ‌డం త‌ప్ప ఎక్కువ సంఖ్య‌లో సీట్లు లభించే అవ‌కాశాలు లేవ‌ని ఆయ‌న అన్నారు. ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోనే ఇంకా ప్ర‌తిప‌క్షాల మ‌ధ్య రాజ‌కీయ ఏక‌త ఏర్ప‌డ‌లేద‌ని, ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త ఉన్న‌ప్ప‌టికీ యోగీ ఆదిత్య‌నాథ్ నాయ‌క‌త్వంలో బీజేపీ ఓటు బ్యాంకు ఇంకా బ‌లంగానే ఉంద‌ని ఆయ‌న చెప్పారు.

అయిన‌ప్ప‌టికీ గ‌త ఎన్నిక‌ల్లో వ‌చ్చిన 62 స్థానాలు ఈసారి వ‌చ్చే అవ‌కాశం లేద‌ని, స‌మాజ్‌వాది పార్టీ గ‌ణ‌నీయంగా బ‌లం పెంచుకుంటుద‌ని ఆయ‌న అంచనా వేశారు. తూర్పు భార‌త రాష్ట్రాల‌యిన బెంగాల్, ఒడిశాలలో మొత్తం 63 స్థానాలు ఉండ‌గా గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ 26 స్థానాల‌ను గెల్చుకుంది. బెంగాల్‌లోనే 18 సీట్లు గెలుపొందింది. అక్క‌డ ప్ర‌తిప‌క్షాలు ఒకే అభ్య‌ర్థి నినాదానికి క‌ట్టుబ‌డి పోటీ చేస్తే బీజేపీకి ఆ స్థానాలు కూడా ద‌క్కే అవ‌కాశం లేదు.

ఆశ పోయిన ఈశాన్యం

ఈశాన్య భార‌తంలో మొత్తం 25 స్థానాలు ఉండ‌గా ఒక్క అస్సాంలోనే 14 స్థానాలు ఉన్నాయి. మ‌ణిపూర్‌, మేఘాల‌య‌ల‌లో జ‌రుగుతున్న ప‌రిణామాలు బీజేపీ ప్ర‌తిష్ఠ‌కు భంగ‌క‌రంగా మారుతున్నాయి. అస్సాం, త్రిపుర‌, మేఘాల‌య‌లో ప్ర‌తిప‌క్షాలు ఏక‌మై పోటీచేస్తే బీజేపీ బాగా దెబ్బ‌తినే అవ‌కాశం ఉంది. తృణ‌మూల్ కాంగ్రెస్, కాంగ్రెస్, వామ‌ప‌క్షాలు అవ‌గాహ‌న‌తో పోటీ చేస్తే ఈశాన్య భార‌తంలో ఇండియా కూట‌మికి స‌గం కంటే ఎక్కువ స్థానాలు ల‌భించే అవ‌కాశం ఉంది.