ఆకట్టుకుంటున్న అయోధ్య బాలరాముడి విగ్రహం.. ఫోటోలు విడుదల
అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం సమీపిస్తుండటంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి

అయోధ్య : అయోధ్య రామమందిరంలో బాలరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠకు సమయం సమీపిస్తుండటంతో పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే విగ్రహాన్ని వేద మంత్రోచ్ఛరణల మధ్య గురువారం మధ్యాహ్నం ఆలయ గర్భగుడిలోకి చేర్చారు. ఇక బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు బయటకు వచ్చాయి. ఈ ఫోటోలను బీజేపీ సీనియర్ నాయకులు ప్రకాశ్ జవదేకర్ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.
51 అంగుళాల పొడవు ఉన్న బాలరాముడి విగ్రహాం కళ్లకు గంతలు కట్టి ఉన్నాయి. రాముడు నిల్చున్న రూపంలో దర్శనమిస్తున్నారు. బాలరాముడి విగ్రహానికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
బాలరాముడి విగ్రహానికి జనవరి 22న ప్రాణప్రతిష్ఠ జరగనుంది. తొలుత ప్రధాని మోదీ విగ్రహానికి ఉన్న కళ్లకు గంతలు విప్పి దర్శనం చేసుకోనున్నారు. అనంతరం హారతి ఇవ్వనున్నారు. ఇక బాలరాముడి విగ్రహ రూపురేఖలు ఎలా ఉంటాయో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ మీడియాకు వెల్లడించిన సంగతి తెలిసిందే. దైవత్వం ఉట్టిపడుతున్న విగ్రహం భక్తులను మంత్రముగ్ధుల్ని చేస్తుందని తెలిపారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం ప్రధాని మోదీ చేతుల మీదుగా వేద పండితులు, అర్చకులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.