అయోధ్య గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా విగ్రహం

అయోధ్య రామాలయంలో ఈ నెల 22న జరగనున్న విగ్రహ ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు కీలక ఘట్టం నిర్వహించారు

అయోధ్య గర్భగుడిలోకి చేరిన రామ్ లల్లా విగ్రహం

విధాత : అయోధ్య రామాలయంలో ఈ నెల 22న జరగనున్న విగ్రహ ‘ప్రాణప్రతిష్ఠాపన’ కార్యక్రమానికి ముందు కీలక ఘట్టం నిర్వహించారు. సుమారు 550 ఏళ్ల తర్వాత అయోధ్య రామాలయం గర్భగుడిలో ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. వేద మంత్రోచ్చారణ, జై శ్రీరామ్ నినాదాల మధ్య గురువారం ఈ కార్యక్రమం వైభవోపేతంగా జరిగింది. మైసూరుకు చెందిన శిల్పకళాకారుడు అరుణ్ యోగిరాజ్ చెక్కిన 51 ఇంచుల ‘రామ్ లల్లా’ విగ్రహాన్ని గుర్భగుడిలో ఉంచారు. కాగా గురువారం వేకువ జామున విగ్రహాన్ని ఆలయంలోకి తీసుకొచ్చారు. ఓ ట్రక్కు ద్వారా తరలించి ఆ తర్వాత క్రేన్ సాయంతో గర్భగుడిలోకి చేర్చారు. గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహానికి ఆచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.


మండప్ ప్రవేశ’ ఆచారాలను నిర్వహించి సింహాసనంపై విగ్రహాన్ని ప్రతిష్టించారు. గణేశాంబిక పూజ, ఆయుష్మంత్ర పారాయణం కూడా నిర్వహించారు. విగ్రహాన్ని సింహాసనంపై ఉంచే ముందు సింహాసనాన్ని పంచగవ్యతో శుద్ధి చేసి వాస్తు పూజ కూడా నిర్వహించారు. సాయంత్రం నూతన విగ్రహానికి ఆర్తి కార్యక్రమం నిర్వహించారు. జనవరి 22న రామ మందిరంలో సంప్రోక్షణ, రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్టాపనోత్సవం జరగనున్న నేపథ్యంలో ఆచారాలు నిర్వహిస్తున్నట్లుగా రామాలయం ట్రస్ట్ అధికారులు తెలిపారు. రామాలయం ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు ప్రారంభమై మధ్యాహ్నం 1 గంటలకు ముగియ్యనున్నది.