Heroine Meena: రాజకీయాల్లోకి సీనియర్ నటి మీనా!

విధాత : సీనియర్ నటి మీనా రాజకీయాల్లో చేరబోతున్నారు. మీనా బీజేపీతో తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించబోతున్నారు. తాజాగా మీనా ఉపరాష్ట్రపతి జగ్ దీప్ ధన్కఢ్ తో భేటీ అయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియాలో మీనా పంచుకున్నారు. ‘‘మిమ్మల్ని కలవడం గౌరవంగా ఉంది.. మీ నుంచి చాలా నేర్చుకున్నాను. నా భవిష్యత్ నమ్మకంగా నడిపించడంలో నాకు సహాయపడుతుందని భావిస్తున్నా. మీ సమయానికి ధన్యవాదాలు’’ అంటూ మీనా రాశారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రాబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వ్యూహాలు రచిస్తున్న బీజేపీ ఆ రాష్ట్రంలో ప్రత్యర్థి పార్టీలకు ధీటుగా సినీ గ్లామర్ బలం పెంచుకోవాలని చూస్తుంది. ఇప్పటికే ఖుష్బు బీజేపీలో ఉన్నారు. మరికొందరిని పార్టీలో చేర్చుకుంటే బలం చేకూరుతుందని ఆ పార్టీ భావిస్తోంది. ఈ క్రమంలో బీజేపీ పార్టీలోకి మీనాను తీసుకునే అంశంపై చర్చలు సాగుతున్నాయి. మీనా రాజకీయ ప్రవేశంపై త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఈ ఏడాది సంక్రాంతి సందర్భంగా ఢిల్లీలో కేంద్రమంత్రి ఎల్.మురుగన్ నివాసంలో జరిగిన పొంగల్ (తమిళ సంక్రాంతి) వేడుకలలో సైతం ప్రధాని నరేంద్ర మోదీ సహా మీనా కనిపించారు. అప్పటి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తో కలిసి నటి మీనా ఆ వేడుకలలో పాల్గొన్నారు. దీంతో మీనా కొన్నాళ్లుగా బీజేపీతో టచ్ లో ఉన్నారని భావిస్తున్నారు.
బాలనటిగా తెలుగు సినీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన మీనా స్టార్ హీరోయిన్ గా తెలుగు, తమిళ భాషల్లో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఇక కెరీర్ జోరుమీదుండగానే ఆమె సాగర్ అనే వ్యక్తిని వివాహమాడి సినిమలకు దూరమైంది. వారికి నైనీక అనే కూతురు కూడా ఉంది. ఆ చిన్నారి కూడా బాలనటిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన తేరి సినిమాలో విజయ్ కూతురుగా నైనీక నటించి మెప్పించింది. మీనా కూడా సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి సహాయనటిగా నటిస్తున్న క్రమంలో భర్త సాగర్ అనారోగ్యంతో కన్నుమూశారు. అప్పటి నుంచి సినిమాల్లో మరింత బిజీ కావడం ద్వారా భర్త మరణం నుంచి తేరుకునే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయాలపై కూడా ఫోకస్ పెట్టారు.