ప్రాణప్రతిష్ఠకు శరద్ పవార్ దూరం.. ఆ తర్వాతే వస్తానని లేఖ
అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి

ముంబై : అయోధ్యలో రామ మందిరం ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఇక దేశంలోని ప్రముఖులందరినీ ఈ కార్యక్రమానికి శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు ఆహ్వానిస్తున్నారు. ఈ క్రమంలోనే నేషనలిస్ట్ కాంగ్రెస్ చీఫ్ శరద్ పవార్‌కు కూడా ప్రాణప్రతిష్ఠకు రావాలని ఆహ్వానం అందింది. శరద్ పవార్ ఆ ఆహ్వానాన్ని సున్నితంగా తిరస్కరించారు.
ఈ మేరకు శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్‌కు లేఖ రాశారు. జనవరి 22న జరిగే ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి హాజరు కాలేను. ఆ తర్వాత దర్శనానికి వస్తాను. అంత వరకు ఆలయం నిర్మాణం కూడా పూర్తవుతుంది. అప్పుడు దర్శనం సులభంగా ఉంటుందని పవార్ తన లేఖలో పేర్కొన్నారు. విశ్వాసానికి, భక్తికి శ్రీరాముడు చిహ్నమని, ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఆయన్ను ఆరాధిస్తారని తెలిపారు. అయోధ్యలో జరగనున్న ప్రాణ ప్రతిష్ఠ పట్ల రామ భక్తుల్లో అత్యంత సంతోషం నెలకొన్నదని, ఈ చరిత్రాత్మక కార్యక్రమంలోని ఆనందం ఆ రామ భక్తుల నుంచి తనకు చేరుకుంటుందని పవార్ పేర్కొన్నారు.
ఇంతకుముందు కాంగ్రెస్ కూడా ఇదే విధంగా స్పందించింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధీర్ రంజన్ చౌదరికి కూడా ఆహ్వానం అందింది. కానీ ప్రారంభోత్సవానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. దానిని బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు చెందిన పొలిటికల్ ప్రాజెక్ట్ అని వారు వ్యాఖ్యానించారు.