నోట్ల రద్దును సమర్థించిన సుప్రీంకోర్టు.. పిటిషన్లు కొట్టివేత
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్థిక విధానం కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది. నోట్ల రద్దుకు ముందు కేంద్రం, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని సుప్రీంకోర్టు తెలిపింది. నోట్ల రద్దు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేవని పేర్కొంది. డీమోనిటైజేషన్‌ను […]

న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ కేంద్రం 2016లో తీసుకున్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. ఈ మేరకు నోట్ల రద్దును సవాల్ చేస్తూ దాఖలైన అన్ని పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎగ్జిక్యూటివ్ ఆర్థిక విధానం కాబట్టి నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేమని ఐదుగురు న్యాయమూర్తుల రాజ్యాంగ ధర్మాసనం స్పష్టం చేసింది.
నోట్ల రద్దుకు ముందు కేంద్రం, ఆర్బీఐ మధ్య సంప్రదింపులు జరిగాయని సుప్రీంకోర్టు తెలిపింది. నోట్ల రద్దు ప్రక్రియలో ఎలాంటి అవాంతరాలు లేవని పేర్కొంది. డీమోనిటైజేషన్‌ను తీసుకురావడానికి ఆర్‌బీఐకి ఎలాంటి స్వతంత్ర అధికారం లేదని.. కేంద్రం, ఆర్బీఐ మధ్య సంప్రదింపుల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది.
ఇంతకు ముందు డిసెంబర్ 7న సుప్రీంకోర్టు 2016లో తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయానికి సంబంధించిన అన్ని రికార్డులను అందజేయాలని కేంద్రం, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఆ తర్వాత తీర్పును రిజర్వ్ చేసింది. ఈ ధర్మాసనంలో న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్, జస్టిస్ బీవీ నాగరత్న ఉన్నారు.
ఐదుగురు సభ్యుల ధర్మాసనంలో నలుగురు న్యాయమూర్తులు ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థించగా.. జస్టిస్ బీవీ నాగరత్న వ్యతిరేకించారు. ప్రభుత్వం ద్వారా కాకుండా పార్లమెంట్ ద్వారా ఆ చర్య చేపడితే బాగుండేదని జస్టిస్ బీవీ నాగరత్న అభిప్రాయపడ్డారు.
సీనియర్ న్యాయవాదులు పీ చిదంబరం, శ్యామ్ దివాన్‌లతో పాటు ఆర్‌బీఐ తరపు న్యాయవాది, పిటిషనర్ల తరఫు న్యాయవాదులు, అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి వేర్వేరుగా వాదనలు వినిపించారు. నవంబర్ 8, 2016న కేంద్రం ప్రకటించిన నోట్ల రద్దును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో 58 పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై విచారణ సందర్భంగా సీనియర్ న్యాయవాది చిదంబరం రూ.500, రూ.1000 కరెన్సీ నోట్ల రద్దును తీవ్రంగా తప్పుబట్టారు.