రైతుల గోస పట్టని కాంగ్రెస్ సర్కార్
పంటలు ఎండిపోయి రైతులు భోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు

- నీళ్లు లేక ఎండిపోతున్న పంటపొలాలు
- దందాలు, అక్రమ వసూళ్లలో ప్రభుత్వం
- మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం
- అన్నపర్తిలో ఎండిన పొలాల పరిశీలన
సూర్యాపేట: పంటలు ఎండిపోయి రైతులు భోరున విలపిస్తున్నా అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జీ జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. నల్లగొండ మండలం అన్నపర్తి గ్రామంలో మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డితో కలిసి.. ఎండిన పంట పొలాలను, నిమ్మ తోటలను జగదీశ్‌రెడ్డి సోమవారం పరిశీలించారు. అన్నదాతలతో మాట్లాడి.. వారి బాధలను అడిగి తెలుసుకున్నారు. మూసీ ప్రాజెక్టు కింద నీరు అందించే అవకాశం ఉన్నా.. ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.
నాగార్జునసాగర్ ఆయకట్టులో కూడా ఎగువ ఉన్న నారాయణపుర, ఆల్మట్టి డ్యామ్‌ల నుంచి నీటిని తెప్పించి, రైతులకు సాగునీరు ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఏ గ్రామానికి వెళ్ళినా.. ఎండిన పంట పొలాలే దర్శనమిస్తున్నాయని, పెట్టుబడులన్నీ మట్టిలో కలిసిపోయి రైతులు విలపిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ఒక్క మంత్రి, ఎమ్మెల్యే, అధికారులు కూడా రైతుల వంక కన్నెత్తి చూడట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రులకు రాజకీయాలు, అక్రమ వసూళ్లు, దందాలు తప్ప రైతుల గోడు పట్టట్లేదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. జిల్లా మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్.. ఉత్తరకుమారులని, ప్రగల్భాలు పలకడం తప్ప దేనికీ పనికిరారని అన్నారు.
ఎంతసేపూ రాజకీయాలు చేయడం తప్ప రైతుల సంక్షేమం పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ నిర్లక్ష్య పూరిత వైఖరితో రైతులు మరింత అగాధంలోకి వెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి, కరువుపై సర్వే చేయించి, నష్టపోయిన రైతులకు పరిహారం అందించి ఆదుకోవాలని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు. లేదంటే రైతుల ఉసురు తగిలి కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం అవుతుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ సైదిరెడ్డి, బీఆరెస్ నాయకులు చెరుకు సుధాకర్, పంకజ్ యాదవ్, దీప వెంకట్ రెడ్డి, యాదయ్య గౌడ్, నాగరాజు, దేవేందర్, లింగుస్వామి, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.