Congress | ఆ ఐదుగురు BJP నేతలు.. కాంగ్రెస్‌ టచ్‌లో! రహస్య మంతనాల్లో నాయకులు

Congress | మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు! అన్ని అనుకూలిస్తే బీజేపీకి బైబై విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ బలపడే పరిస్థితి కనిపించడం లేదు.. ఇదే సమయంలో బీఆరెస్‌, బీజేపీ మధ్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం బలపడుతున్న నేపథ్యంలో రోజు రోజుకూ బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది. ఇటీవల పలువురు నేతలు నిర్వహించుకున్న సొంత సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైందని సమాచారం. దీంతో గత ఎన్నికలలో మాదిరిగానే బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఉందన్న చర్చ […]

  • Publish Date - August 31, 2023 / 01:14 AM IST

Congress |

  • మాజీ ఎంపీ, నలుగురు మాజీ ఎమ్మెల్యేలు!
  • అన్ని అనుకూలిస్తే బీజేపీకి బైబై

విధాత, హైదరాబాద్: రాష్ట్రంలో బీజేపీ బలపడే పరిస్థితి కనిపించడం లేదు.. ఇదే సమయంలో బీఆరెస్‌, బీజేపీ మధ్య అవగాహన కుదిరిందన్న అభిప్రాయం బలపడుతున్న నేపథ్యంలో రోజు రోజుకూ బీజేపీ గ్రాఫ్ పడిపోతున్నది. ఇటీవల పలువురు నేతలు నిర్వహించుకున్న సొంత సర్వేలో కూడా ఇదే విషయం స్పష్టమైందని సమాచారం. దీంతో గత ఎన్నికలలో మాదిరిగానే బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతున్నది. రాష్ట్రంలో బీఆరెస్‌కు ప్రత్యామ్నాయం అవుతుందనుకున్న పార్టీ కనీసం ఓటు బ్యాంకును కూడా కాపాడుకోలేని పరిస్థితిలో ఉందన్న అభిప్రాయం వెలువడుతున్నది.

బీఆరెస్‌ ఓటమే లక్ష్యంగా కాంగ్రెస్‌, బీఆరెస్‌ పార్టీలను వీడి బీజేపీలో చేరిన నేతలు తీవ్ర అసహనంతో ఉన్నారు. రాష్ట్రంలో బీఆరెస్‌కు ప్రత్యామ్నాయంగా నిలబడిన కాంగ్రెస్‌లో చేరడమే మేలన్న తీరుగా పలువురు నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ పరిస్థితిపై గత కొంత కాలంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న పలువురు నేతలు పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నట్లు సమాచారం. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ నేతలు పార్టీని వీడటానికి సిద్ధం అవుతున్నట్లు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో కాంగ్రెస్‌ పార్టీని వీడిన మాజీ ఎంపీతో పాటు మరో నలుగురు మాజీ ఎమ్మెల్యేలు పార్టీ మారనున్నట్లు గట్టిగా ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు సదరు నేతలు కాంగ్రెస్‌ నేతల టచ్‌లోకి వెళ్లి రహస్యంగా చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ హామీపై పట్టబడుతున్నట్లు తెలిసింది. మాజీ ఎంపీ గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు హాజరు కాకుండా దూరం పాటిస్తున్నారని పార్టీ నేత ఒకరు అన్నారు.

అమిత్‌షా సభకు, కానీ బీజేపీ కేంద్ర నాయకులు హాజరయ్యే సభలకు సదరు నేత హాజరు కాకపోవడానికి ఇదే కారణమన్న చర్చ జరుగుతోంది. సదరు నగర శివారు పార్లమెంటు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎంపీ కావాలనే మౌనంగా ఉంటున్నారన్న చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు నిజామాబాద్‌, మహబూబ్‌ నగర్‌కు చెందిన నేతలు కూడా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. అసంతృప్తి వర్గానికి చెందిన నేత ఒకరు కాంగ్రెస్‌తో తాము జరుపుతున్న చర్చలు ప్రాథమిక దశలోనే ఉన్నాయని, కాంగ్రెస్‌ పార్టీ ఖచ్చితమైన హామీ ఇస్తేనే నిర్ణయం తీసుకొని ముందుకు వెళతామని అన్నట్లు సమాచారం.

సదరు మాజీ ఎంపీ ఈమధ్య కాలంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు కాంగ్రెస్‌ పార్టీ జాతీయ నాయకత్వాన్ని రహస్యంగా కలిసినట్లు సమాచారం. ఆ సమయంలో కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ సీఎంతో పాటు ప్రస్తుత కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ ఒకరు, ఏఐసీసీ సీనియర్‌ నాయకుడు మరొకరు ఉన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ముందు పార్టీలో చేరండి, సీట్ల కేటాయింపు పై సోనియా, రాహుల్‌, మల్లికార్జున ఖర్గేలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు సదరు నేతలు సెప్టెంబర్‌ నేలలో కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. సోనియా గాంధీ సమక్షంలో ఈ నేతలు పార్టీలో చేరడానికి సన్నహాలు చేసుకుంటున్నట్లు సమాచారం. అయితే మాజీ ఎంపీతో పాటు పలువురు నేతల వ్యవహారం తెలుసుకున్న ఒక సీనియర్‌ బీజేపీ నేత హైకమాండ్‌ను అలర్ట్‌ చేసినట్లు సమాచారం.

దీంతో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా ఖమ్మం వచ్చిన సందర్భంగా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని నాయకులు, కార్యకర్తలు తొందర పడి ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఓపికతో ఉండాలని కోరినట్లు తెలిసింది. అయితే అసంతృప్త నేతలు మాత్రం తాము ఇక ఎంతో బీజేపీలో కొనసాగలేమని అభిప్రాయపడుతున్నట్లు సమాచారం.

Latest News