Thug Life Movie: థగ్ లైఫ్ కర్ణాటకలో విడుదల చేయాలి : సుప్రీంకోర్టు ఆదేశాలు

నటుడు కమల్ హసన్ కు..చిత్ర బృందానికి ఊరట
క్షమాపణలు అడగొద్దని హైకోర్టుకు సూచన
న్యూఢిల్లీ : థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలోనూ విడుదల చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. కన్నడ భాషపై నటుడు కమలహాసన్ చేసిన వ్యాఖ్యల వివాదం నేపథ్యంలో థగ్ లైఫ్ సినిమాను కర్ణాటకలో నిషేధించారు. అయితే దీనిపై చిత్రబృంద సుప్రీంకోర్టును ఆశ్రయించగా..సినిమాను కర్ణాటకలో విడుదల చేయాలని ఆదేశించింది. మూవీ రిలీజ్ కు అనుమతి ఇచ్చేందుకు కర్ణాటక ప్రభుత్వానికి ఒక్క రోజు గడువు ఇచ్చింది. అలాగే కన్నడ భాష పై కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పాలని కర్ణాటక హైకోర్టు ఆదేశాలను సైతం సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కమలహాసన్ ను క్షమాపణ అడగొద్దని హైకోర్టుకు సుప్రీమ్ కోర్టు సూచించింది. సుప్రీంకోర్టు తాజా ఆదేశాలతో అటు థగ్ లైస్ చిత్ర బృందానికి, ఇటు కమల్ హాసన్ కు ఊరట దక్కినట్లయ్యింది.
కమల్‌హాసన్ చేసిన వ్యాఖ్యల వల్ల థగ్ లైఫ్ సినిమాను నిలిపివేయాలంటూ బెదిరించిన సంఘాలపై ఈ సందర్భంగా సుప్రీంకోర్టు మండిపడింది. అలాంటి బెదిరింపులు చట్టబద్ధం కాదని స్పష్టం చేసింది. ఒక సినిమాకు సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత దాన్ని విడుదల చేయాల్సిందేనని సుప్రీం ఆదేశించింది. దాన్ని చూడాలా, వద్దా అనే అధికారం పూర్తిగా ప్రజలకు ఉంటుందని.. బెదిరింపుల ఆధారంగా సినిమాను ఆపకూడదని స్పష్టంచేసింది. థియేటర్లలో ఏది ప్రదర్శించాలో నిర్ణయించే అధికారం ఆ సంఘాలకు లేదని స్పష్టం చేసింది. ఎవరైనా ఒక ప్రకటన చేసినప్పుడు దాన్ని విబేధించే స్వేచ్ఛ ఉంది కానీ.. థియేటర్లు తగలబెడతామని బెదిరించే అధికారం ఎవరికీ ఉండదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కర్ణాటక ప్రజలు కమల్‌హాసన్‌తో విభేదించే స్వేచ్ఛను కలిగి ఉన్నారని.. అదే సమయంలో ప్రాథమిక హక్కులను కూడా కాపాడాలని కోర్టు పేర్కొంది.