వొక్కలిగ ఓట్లు.. అన్నామలైపై ఆశలు! కర్ణాటక, తమిళనాడులో బీజేపీ రాజకీయం

  • By: krs    latest    Sep 27, 2023 1:33 PM IST
వొక్కలిగ ఓట్లు.. అన్నామలైపై ఆశలు! కర్ణాటక, తమిళనాడులో బీజేపీ రాజకీయం
  • ఉభయ లాభం కోసం జేడీఎస్‌-బీజేపీ పొత్తు
  • ఒంటరిగా ఎదిగేందుకే తమిళనాట ఎత్తు?
  • కర్ణాటక, తమిళనాడులో బీజేపీ రాజకీయం

విధాత: సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి గడ్డు పరిస్థితులు ఎదురవుతున్నాయి. ఈ సందర్భంగా రెండు దక్షిణాది రాష్ట్రాల్లో మారుతున్న రాజకీయ పరిణామాలు చర్చనీయాంశమవుతున్నాయి. ఇందులో మొదటిది కర్ణాటకలో జేడీఎస్‌ ఎన్డీఏతో జత కట్టడం. 2024 లోక్‌సభ ఎన్నికలతో పాటు భవిష్యత్తులో జరిగే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని ప్రకటించడం. ఇది జరిగిన 24 గంటల్లోనే తమిళనాడులో ఏఐడీఎంకే బీజేపీతో తెగతెంపులు చేసుకున్నది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై వ్యవహారశైలినే ఈ నిర్ణయం తీసుకోవడానికి కారణమని అన్నాడీఎంకే తెలిపింది.


ఈ రెండు పరిణామాల్లో బీజేపీ-జేడీఎస్‌ కలిసిపోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. నాలుగు నెలల కిందట జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు ఘోరంగా దెబ్బతిన్నాయి. ప్రాబల్యం కోల్పోతున్న జేడీఎస్‌ తిరిగి తన అస్తిత్వాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి ముఖ్యంగా మారితే.. తనకు బలం ఉన్న ప్రాంతాల్లో తిరిగి పుంజుకోవడం బీజేపీకి ముఖ్యం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో ఆ రాష్ట్రంలోని 28 స్థానాల్లో బీజేపీ 25 సీట్లలో గెలిచింది. వీటిని తిరిగి నిలబెట్టుకోవడం కష్టం. ఆ నష్టాన్ని పూడ్చుకోవాలంటే జేడీఎస్‌ అందించే సహాయం ముఖ్యమని బీజేపీ భావిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.

ఆసక్తికరంగా తమిళ రాజకీయం

కర్ణాటక రాజకీయాల కంటే తమిళనాడు రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. సుదీర్ఘ కాలం ఎన్డీఏలో భాగస్వామిగా ఉన్న అన్నాడీఎంకే బైటికి వెళ్లగొట్టానికి బీజేపీ పెద్ద వ్యూహాన్నే రచించినట్లు కనిపిస్తున్నది. అన్నామలైని అన్నాడీఎంకేకు వ్యతిరేకంగా కావాలనే మాట్లాడించిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 2024 లోక్‌సభ ఎన్నికలు, ఆ తర్వాత వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి అన్నాడీఎంకే సహాయం లేకుండా రాష్ట్రంలో సొంతంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని ఆ పార్టీ అధిష్ఠానం ప్రణాళికలో భాగమే ఇదంతా అని అంటున్నారు.


2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, అన్నాడీఎంకే కలిసి మొదటిసారి పోటీ చేశాయి. వారి ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకే, మిత్రపక్షాలు మొత్తం 38 స్థానాల్లో 37 చోట్ల గెలుపొందాయి. ఆ తర్వాత మరో సీటులో కూడా డీఎంకే మిత్రపక్షం విజయం సాధించింది. అక్కడ బీజేపీ నాలుగుచోట్ల పోటీ చేసినా ఒక్క సీటు కూడా గెలువలేకపోయింది.


బీజేపీ గేమ్‌ ప్లాన్‌?

బీజేపీ అధిష్ఠానం తమిళనాడు ఎన్నికల గురించి ఇప్పుడే ఆలోచించడం లేదని, దానికి ఇంకా సమయం ఉన్నదని ఆ పార్టీ సినియర్‌ నేతలు అంటున్నారు. అన్నామలై కూడా ఈ మధ్య కాలంలో అన్నాడీఎంకేను రెచ్చగొట్టే ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదని గుర్తు చేస్తున్నారు. కూటమి యథాతథంగా కొనసాగించడానికే జాతీయ నాయకత్వం మొగ్గు చూపుతున్నట్లు కనిపించినా.. అన్నాడీఎంకే దైవసమానులుగా భావించే అన్నాదురై, జయలలితలపై బీజేపీ నేతలు మాటల దాడి చేయడం ద్వారా ఆ పార్టీల మధ్య దూరం పెరిగిన సంగతి తెలిసిందే. ఒకవేళ అన్నామలైకి పార్టీ మద్దతు ఉన్నదని, ఇది పెద్ద గేమ్‌ ప్లాన్‌ భాగమే అయినప్పటికీ రాష్ట్రం పట్ల జాతీయపార్టీ అనుకూలంగా లేదు. దీంతో దీనికి బీజేపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది.


అన్నాడీఎంకే తో ఉన్న చిన్న మిత్రపక్షాలు కూడా బీజేపీతో పొత్తును వదులుకోవాలని ఒత్తిడి తెస్తున్నాయి. అన్నామలై దూకుడు వైఖరి, రాజకీయ ప్రసంగాలను బీజేపీ సజీవంగా ఉంచిందని పరిశీలకులు అంటున్నారు. అన్నాడీఎంకే నుంచి దూరం కావడం వల్ల బీజేపీ స్వతంత్రంగా పార్టీని పటిష్టపరుచుకోవచ్చనే వాదన కూడా ఉన్నది. ఓట్ల దగ్గరికి వచ్చే సరికి ఈ రాష్ట్రంలో ప్రధాని నరేంద్రమోదీ ప్రజాదరణ సరిపోదు. అందుకే బీజేపీ ఇక్కడ బలోపేతమవ్వాలంటే అంతకంటే ఎక్కువకావాలి.


సనాతన ధర్మంపై డీఎంకే నేతలు ప్రశ్నించినందుకు వారిని అన్నామలై హిందూ వ్యతిరేకులుగా చిత్రీకరిస్తున్నప్పుడు అది ఉత్తరాదిలో బీజపీకి ఫలితాలు అందించవచ్చు. కానీ ఇక్కడ మాత్రం సందేహాస్పాదమే. ఇక్కడి రాజకీయాలు సామాజిక న్యాయం చుట్టూ, కుల, మతాలకు వ్యతిరేకంగా ఉన్నాయని ఓ బీజేపీ నేత తెలిపారు. కూటమి బంధాన్ని చక్కదిద్దడానికి జాతీయ నాయకత్వం ముందుకు వస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. లోక్‌సభ ఎన్నికల నాటికి రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు మారవచ్చని అంటున్నారు.

కర్ణాటకతో పోలిస్తే తమిళనాడులో చీలిక స్పష్టంగా కనిపిస్తున్నది. కర్ణాటకలో జేడీఎస్‌తో కలిసి నడవడానికి ఆ పార్టీకి అనుకూలంగా బీజేపీ చాలా దూరం వెళ్లింది. మే నెలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఎస్‌ అవిర్భావం తర్వాత అతి దారుణమైన వైఫల్యాన్ని కనబరిచింది. అయితే ఈ రెండు పార్టీల మధ్య పొత్తు గేమ్‌ చేంజర్‌గా అంచనా వేస్తున్నప్పటికీ వొక్కలిగ సామాజిక వర్గానికి చెందిన ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ వంటి ప్రభావంతమైన నాయకుడు ఉండగా జేడీఎస్‌కు ఎన్ని వొక్కలిగ సీట్లు వస్తాయో స్పష్టంగా చెప్పలేమంటున్నారు.



అంతేకాదు ఈ రెండుపార్టీల మధ్య పొత్తుపై జేడీఎస్‌లోని ముస్లిం నాయకులు బహిరంగంగా వ్యక్తం చేసిన భయాందోళనలను బీజేపీ నాయకులు ఎత్తి చూపుతున్నారు. మరో నాయకుడి అభిప్రాయం ప్రకారం.. పొత్తుకు సంబంధించి గొప్పగా కనిపిస్తున్నప్పటికీ 2019 లో బీజేపీ గెలుచుకున్న 25 సీట్లను మోదీ ప్రజాదరణ, పార్టీ నాయకత్వ బలంతో తిరిగి దక్కించుకోగలమన్న విశ్వాసం ఆ పార్టీకి లేదు. ఈ క్రమంలోనే అన్నామలై వంటివారి మాటల దూకుడుతో గట్టెక్కాలనే ఆలోచన ఉన్నదని పరిశీలకులు అంటున్నారు.