ఢిల్లీపై చలి పంజా.. దట్టంగా కమ్మేసిన పొగమంచు..

దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసురుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి

ఢిల్లీపై చలి పంజా.. దట్టంగా కమ్మేసిన పొగమంచు..

Weather | దేశ రాజధాని ఢిల్లీపై చలి పంజా విసురుతున్నది. కనిష్ఠ ఉష్ణోగ్రతలు విపరీతంగా పడిపోతున్నాయి. చలికి తోడు పొగమంచు సైతం దట్టంగా కమ్ముకుంటున్నది. దీంతో రోడ్లపై వాహనాదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. విజిబిలిటీ భారీగా తగ్గడంతో ఇందిరా గాంధీ విమానాశ్రయంలో విమానాల రాకపోకలు ఆలస్యమయ్యాయి. మరికొన్నింటిని సంస్థలు రద్దు చేశాయి. మరో వైపు ఢిల్లీ నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు నడిచే 18 ఆలస్యంగా నడిచాయి. ఇందులో తెలుగు రాష్ట్రాల మీదుగా నడిచే పలు రైళ్లు సైతం ఉన్నాయి. ఇక గురువారం ఉష్ణోగ్రతలు 5 డిగ్రీలకు పడిపోగా.. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 18 డిగ్రీలకు చేరవచ్చని ప్రాంతీయ వాతావరణ శాఖ అంచనా వేసింది.


ఆకాశం నిర్మలంగా ఉంటుందని.. ఉదయం పొగమంచు భారీగా ఉంటుందని తెలిపారు. ఈ క్రమంలో గురు, శుక్రవారాలకు ఎల్లో అలెర్ట్‌ను జారీ చేసింది. పొద్దంతా పొగమంచు ఉండే అవకాశం ఉందని.. సూర్యరశ్మి కనిపించకపోవచ్చని చెప్పింది. బుధవారం రిజ్డ్‌లో కనీస ఉష్ణోగ్రత 5.2 డిగ్రీలుగా నమోదైంది. అయానగర్‌లో 5.4 డిగ్రీల సెల్సియస్, పాలం లో 5.5, లోధి రోడ్‌లో 5.8 డిగ్రీలుగా నమోదైంది. గరిష్ఠ ఉష్ణోగ్రతలు పిటాంపూరాలో 19.1 డిగ్రీలు, అయానగర్‌లో 18.8, రిడ్జ్‌లో 18.3, పుసాలో 18.0 డిగ్రీలుగా రికార్డయ్యింది.

ఢిల్లీతో పాటు ఉత్తరభారతం మొత్తం చలి విపరీతంగా ఉన్నది. పంజాబ్, హర్యానాలో వాతావరణశాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. ఇప్పటికే చలితో జనం వణికిపోతున్నారు. రాబోయే రెండురోజులు మరింత చలి ఉంటుందని వాతావరణశాఖ అంచనా వేసింది. గురువారం ఉదయం, రాత్రి పంజాబ్‌, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో దట్టంగా పొగమంచు పరుచుకుంటుందని స్కైమెట్‌ అంచనా వేసింది. బీహార్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కిం, వర్షం కురిసే అవకాశం పేర్కొంది.


ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తర మధ్యప్రదేశ్, బీహార్, నార్త్ రాజస్థాన్, జార్ఖండ్, సబ్-హిమాలయన్ పశ్చిమ బెంగాల్, సిక్కిం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపురలో దట్టంగా పొగమంచు ఉంటుందని తెలిపింది. అరుణాచల్‌ప్రదేశ్‌, అసోం, నాగాలాండ్‌, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, తమిళనాడు దక్షిణం ప్రాంతంలో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే రెండురోజుల్లో తూర్పు భారతంలో కనీస ఉష్ణోగ్రతలు పెరిగే ఛాన్స్‌ ఉందని వివరించింది.