Women’s Reservation Bill | అభ్యర్థులకు మహిళా కోటా గండం.. టికెట్లు కోల్పోనున్న ముఖ్య నాయకులు
Women's Reservation Bill | ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదిస్తే.. టికెట్లు కోల్పోనున్న ముఖ్య నాయకులు విధాత: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులలో గుబులు రేపుతున్నది. ఇప్పటికే బీఆరెస్ 119 సీట్లకుగాను 115సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖారారు ప్రక్రియ స్క్రీనింగ్ కమిటీ దశకు చేరింది. బీజేపీ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం […]

Women’s Reservation Bill |
- ప్రత్యేక సమావేశాల్లో బిల్లు ఆమోదిస్తే..
- టికెట్లు కోల్పోనున్న ముఖ్య నాయకులు
విధాత: పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మహిళా బిల్లుకు ఆమోదం లభిస్తుందన్న ప్రచారం తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్న అభ్యర్థులలో గుబులు రేపుతున్నది. ఇప్పటికే బీఆరెస్ 119 సీట్లకుగాను 115సీట్లలో అభ్యర్థులను ఖరారు చేసింది. కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా ఖారారు ప్రక్రియ స్క్రీనింగ్ కమిటీ దశకు చేరింది. బీజేపీ దరఖాస్తులను స్వీకరిస్తున్నది. ఈ క్రమంలో మహిళా రిజర్వేషన్ బిల్లు అంశం అన్ని పార్టీల అభ్యర్థులను టెన్షన్‌కు గురి చేస్తున్నది.
మహిళా రిజర్వేషన్ బిల్లును పార్లమెంటులో ఆమోదించాలని కోరుతూ బీఆరెస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇప్పటికే అన్ని పార్టీల నాయకులకు లేఖలు రాశారు. ప్రతేక సమావేశాల్లో బిల్లు ఆమోదం పొందితే.. లోక్‌సభ, శాసనసభలలో 33.3 శాతం సీట్లు మహిళలకు కేటాయించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లు కూడా అమలు చేయాల్సి ఉంటుంది.
అప్పుడు చాలమంది బడా నేతలు వేరే నియోజకవర్గాల నుంచి పోటీచేయాల్సి వస్తుంది. అయితే.. తమ బదులు తమ కుటుంబీకులకు టికెట్లు ఇప్పించుకునే అవకాశం ఉన్నా.. వారికి మాత్రం చట్టసభల్లో ప్రాతినిథ్యం దక్కదు. బీసీలకే తగిన సీట్ల కేటాయించడం లేదన్న పంచాయితీ మధ్య మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించబడి ఈ దఫా నుంచే అమలు చేయాల్సి వస్తే మాత్రం పార్టీలకు పెద్ద తలనొప్పిగానే మారనుంది.
తెలంగాణలో ఎస్సీ రిజర్వ్ స్థానాలు 18 ఉన్నాయి. వీటిలో ఐదు లేదా ఆరు స్థానాలను మహిళలకు కేటాయించాలి. అత్యధిక మహిళా జనాభా ఉన్న స్థానాలు వర్ధన్నపేట, జహీరాబాద్, చేవెళ్ల, సత్తుపల్లి, తుంగతుర్తి, స్టేషన్ ఘనపూర్ సీట్లు మహిళా కోటాలోకి వెళ్లే అవకాశం ఉన్నది. ఎస్టీ రిజర్వ్ స్థానాలు మొత్తం 12 ఉన్నాయి. వీటిలో 3 లేదా 4 స్థానాలు మహిళలకు కేటాయించాలి. మహబూబాబాద్, దేవరకొండ, ములుగు, ఇల్లెందుల పేర్లు ముందుంటాయి.
పార్లమెంటు నియోజకవర్గాల వారీగా చూస్తే ఆదిలాబాద్ పార్లమెంటులో అత్యధిక జనాభా ఉన్న నిర్మల్, ముథోల్ మహిళలకు దక్కవచ్చు. పెద్దపల్లి నియోజకవర్గంలో పెద్దపల్లి, మంచిర్యాల, మంథని సీట్లు మహిళలకు కేటాయించవచ్చు. కరీంనగర్ పరిధిలో సిరిసిల్ల, కరీనగర్, హుజూరాబాద్.. మహిళా కోటాలోకి వెళ్లవచ్చు. నిజామాబాద్‌లో నిజామాబాద్ అర్బన్, రూరల్ ఉన్నాయి. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో జహీరాబాద్, కామారెడ్డి, మెదక్ పార్లమెంటు పరిధిలో మెదక్, పటాన్ చెరువు, గజ్వేల్లు మహిళలకు రిజర్వ్ చేయవచ్చు.
మల్కాజిగిరి పార్లమెంటు పరిధిలో కుత్బుల్లాపూర్, మేడ్చల్, సికింద్రాబాద్ పార్లమెంటు పరిధిలో జూబ్లీహిల్స్, నాంపల్లి మహిళలకు కేటాయించే చాన్స్ ఉంది. హైదరాబాద్ పార్లమెంటు పరిధిలో కార్వాన్, యాకుత్‌పురా, చేవెళ్ల పార్లమెంటు పరిధిలో చేవెళ్ల, శేరిలింగంపల్లి, మహబూబ్‌నగర్ పార్లమెంటు పరిధిలో మహబూబ్‌నగర్, మక్తల్, నాగర్ కర్నూల్ పార్లమెంటు పరిధిలో వనపర్తి, గద్వాల్ ఉన్నాయి. నల్లగొండ పార్లమెంటు పరిధిలో హజూర్‌నగర్, దేవరకొండ, భువనగిరి పరిధిలో తుంగతుర్తి, మునుగోడు సీట్లు మహిళలకు కేటాయించవచ్చు.
వరంగల్ పరిధిలో వర్ధన్నపేట, స్టేషన్ ఘనపూర్, మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో ములుగు, పినపాక, మహబూబాబాద్, పినపాక స్థానాలు మహిళలకు వెళ్లే అవకాశం ఉన్నదంటున్నారు. ఖమ్మం పార్లమెంటు పరిధిలో సత్తుపల్లి, కొత్తగూడెం మహిళలకే ఇవ్వాల్సి ఉంటుంది. 2029లో జరిగే నియోజకవర్గాల పునర్విభజనలో (డీలిమిటేషన్) ప్రక్రియలో మళ్లీ ప్రస్తుత మహిళా రిజర్వేషన్ కోటా స్థానాల్లో మార్పు వస్తుందా లేక అప్పటి నుండే రిజర్వేషన్లు అమల్లోకి తెస్తారా అన్నది ప్రశ్నార్ధకంగా కనిపిస్తున్నది.