Ayodhya Land Rates | అయోధ్యలో భూముల సర్కిల్ రేట్ 200 శాతం పెంపు!
అయితే.. ఈ పెంపుదల తాము ఆశించినంత లేదని కొందరు రైతులు చెబుతున్నారు. రామజన్మభూమికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ 200 శాతానికి మించి పెంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనుల ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని దుర్గాయాదవ్ అనే వ్యక్తి చెప్పారు.

Ayodhya Land Rates | పుణ్యక్షేత్రాల్లో భూముల ధరలు సాధారణంగానే ఎక్కువ ఉంటాయి. అందులోనూ కొత్తగా అభివృద్ధి చెందిన ప్రాంతాలైతే ఉన్న పళాన పెరిగిపోతాయి. అయోధ్యలో కూడా అదే సీన్ రిపీట్ అయింది. ఏడాది క్రితమే ఇక్కడ రామ మందిరాన్ని ప్రారంభించి, ప్రాణప్రతిష్ఠ చేసిన విషయం తెలిసిందే. దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత భూముల సర్కిల్ రేట్లు సవరించారు. అయితే.. తమకు ప్రయోజనం కలిగించేంత స్థాయిలో ఈ పెంపుదల లేదని రైతులు అంటున్నారు. దీనిపై న్యాయపోరాటం చేస్తున్నారు. కొత్త సర్కిల్ రేట్లపై ఉత్తర్వులు శనివారమే జారీ అయినా.. సోమవారం నుంచి అమల్లోకి వచ్చాయి. గత ఏడాది ఆగస్ట్‌లో తాము సర్క్యులేట్ చేసిన ప్రతిపాదనలకు వచ్చిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకుని సర్కిల్ రేట్ పెంపుదల ప్రతిపాదనలను ఆమోదించామని జిల్లా మేజిస్ట్రేట్ (అయోధ్య) నిఖిల్ ఫుండే ఇండియన్ ఎక్స్‌ప్రెస్‌కు చెప్పారు. కొన్ని ఏరియాల్లో మేం ప్రతిపాదించిన దానికంటే ఎక్కువ పెంచాలని ప్రజల నుంచి డిమాండ్లు వచ్చాయని తెలిపారు. అయితే.. మార్కెట్ రేట్‌కు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నామని, దీనిపై ముందుగానే తాము సర్వే కూడా చేశామని ఫుండే వివరించారు.
సర్కిల్ రేట్ అనేది జిల్లా అధికార యంత్రాంగం తన పరిధిలో ఉండే భూముల విలువపై వేసే అంచనా. దీని ఆధారంగానే భూముల క్రయవిక్రయాలు, రైతులు, ఇతరుల నుంచి సేకరించే భూములకు విలువ కట్టడం వంటివి ఉంటాయి. అయోధ్య పట్టణంలో రామాలయ నిర్మాణానికి సుప్రీంకోర్టు అనుమతి ఇస్తూ 2019లో తీర్పు చెప్పింది. ఆ తర్వాత నుంచి భూముల మార్కెట్ ధరలు గణనీయంగా పెరిగిపోయాయి. అయినా.. గత ఏడు సంవత్సరాలుగా సర్కిల్ రేట్లను పెంచలేదు. ఈ నేపథ్యంలో సర్కిల్ రేటును ఆయా ప్రాంతాలు, భూమి స్వభావాలను బట్టి 200 శాతం వరకూ పెంచుతూ జిల్లా అధికార యంత్రాంగం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని 54 జిల్లాల్లో భూముల సర్కిల్ రేట్‌ను చివరిసారిగా 2017లో సవరించారదు. మరో 21 జిల్లాల్లో 2023లో సవరించారు. తాజాగా పెంచిన సర్కిల్ రేట్.. ప్రత్యేకించి రామజన్మభూమి ఏరియాలో భారీగా పెరిగింది. తిహురా మాంఝా వంటి గ్రామాల్లో 200 శాతం వరకూ ఈ పెంపుదల ఉన్నది. ఇక్కడ 2017 ఆగస్ట్ నుంచి హెక్టార్‌కు 11 లక్షల నుంచి 23 లక్షల వరకూ ఉండేది. ఇప్పుడు అది హెక్టార్‌కు 33 లక్షల నుంచి 69 లక్షలకు పెరిగింది. అభినందన్ లోధా హౌస్ ఇక్కడే భారీ స్థాయిలో భూములు కొనుగోలు చేసింది. ఇందులోనే సినీ నటుడు అమితాబ్ బచ్చన్ గతేడాది రెండు ప్లాట్లు కొనుగోలు చేశారు. ఎయిర్పోర్ట్ ఉన్న గంజా గ్రామం చుట్టుపక్కల పాత ధరలు హెక్టార్‌కు 28 లక్షల నుంచి 64 లక్షలు ఉండగా.. ఇప్పుడు అవి 35 లక్షల నుంచి 80 లక్షల వరకూ పెరిగాయి.
అయితే.. ఈ పెంపుదల తాము ఆశించినంత లేదని కొందరు రైతులు చెబుతున్నారు. రామజన్మభూమికి పది కిలోమీటర్ల పరిధిలో ఉన్న అన్ని గ్రామాల్లోనూ 200 శాతానికి మించి పెంచాల్సిందని అభిప్రాయపడుతున్నారు. అయోధ్యలో జరుగుతున్న అభివృద్ధి పనుల ద్వారా రైతులకు ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని దుర్గాయాదవ్ అనే వ్యక్తి చెప్పారు. సర్కిల్ రేట్ల పెంపు అంశంపై ఆయన అలహాబాద్ హైకోర్టులో న్యాయపోరాటం చేస్తున్నారు. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అయోధ్య ఉన్న ఫైజాబాద్ స్థానం నుంచి బీజేపీ సిటింగ్ ఎంపీని ఓడించి.. సమాజ్‌వాది పార్టీ అభ్యర్థి అవధేశ్ ప్రసాద్ విజయం సాధించిన విషయం తెలిసిందే.