మోడీ భవితవ్యాన్ని తేల్చేది జేడీయూ, టీడీపీలే
జేడీయూ, శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్) ఈ మూడు పార్టీలు పీఛేమూడ్ తీసుకున్నా ఎన్డీఏకు మెజారిటీ కష్టం అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా ఎన్డీఏ 296 సీట్లకే దిగువనే ఉన్నది

జేడీయూ, శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్) ఈ మూడు పార్టీలు పీఛేమూడ్ తీసుకున్నా ఎన్డీఏకు మెజారిటీ కష్టం అంటున్నారు. ఇప్పటివరకు వచ్చిన ఫలితాల ఆధారంగా ఎన్డీఏ 296 సీట్లకే దిగువనే ఉన్నది. బీజేపీ సొంతంగా గెలుచుకునే సీట్లు 240కి అటు ఇటూ ఉండొచ్చు. దీంతో ఎన్డీఏ బీజేపీ తర్వాత టీడీపీ 16, జేడీయూ 14లే అతి పెద్ద పార్టీలు. ఈ రెండు పార్టీల మద్దతే కీలకం కానున్నాయి. అందుకే ప్రధాని మోడీ చంద్రబాబు, నితీశ్‌లో ఫోన్లో మాట్లాడారు. విపక్ష ఇండియా తరఫున శరద్‌పవార్ ఈ ఇద్దరి నేతలతో మాట్లాడినట్లు సమాచారం. ఇప్పుడంతా నంబర్ గేమ్ నడుస్తున్నది.
నితీశ్‌కుమార్ మొన్నటివరకు ఇండియా కూటమిలోకి ప్రాంతీయ పార్టీలను తీసుకొచ్చేందుకు కృషి చేశారు. మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. శివసేన (శిండే), ఎన్సీపీ (అజిత్‌పవార్) పార్టీలతోనూ ఇండియా కూటమి నేతలు సంప్రదింపులు చేస్తున్నట్టు తెలుస్తోంది. జేడీయూ 14, శివసేన (శిండే) 6, ఎన్సీపీ (అజిత్‌పవార్) 1 సీటు గెలుచుకున్నాయి. ఇవన్నీ కలిపితే 21 అవుతాయి. ఇప్పటివరకు వెల్లడవుతున్న ఫలితాలే కాకుండా చాలాచోట్ల మొదటి స్థానంలో ఉన్న అభ్యర్థికి 10 వేల లోపే ఆధిక్యం కనిపిస్తున్నది. దీంతో రౌండ్ రౌండ్ పరిస్థితి మారుతున్నది. బీజేపీకి, ఎన్డీఏ కూటమికి 290కి పైగా సీట్ల ఆధిక్యం కొనసాగితేనే ఇబ్బంది ఏమీ ఉండదు. కానీ ఈ మూడు పార్టీల మద్దతు లేకుండా ప్రభుత్వ ఏర్పాటు చేయడం సాధ్యం కాదనే పరిస్థితి వస్తే ఏమౌతుంది అనే ప్రశ్న తలెత్తుతున్నది.
నితీశ్ కుమార్ మోడీ నాయత్వానికి మద్దతు ఇవ్వనని అని అంటే బీజేపీ అనివార్యంగా మరో ఆలోచన చేయాల్సి ఉంటుందంటున్నారు. ఆ కండీషన్ పెడితే దానికి అంగీకరించం అంటే ఆ కారణంతో బైటికి వచ్చే అవకాశాలనూ కొట్టిపారేయలేం అనే వాదన వినిపిస్తున్నది. బీజేపీ నేతలు ప్రస్తుతం వస్తున్న నంబర్లతో మోడీ 3.0 ఖాయమే నమ్మకంగానే ఉన్నారు. కానీ చంద్రబాబు, నితీశ్లలో ఎవరూ యూటర్న్ తీసుకున్నా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఏర్పడుతుందనే అనిశ్చితి కొనసాగే అవకాశం ఉన్నదంటున్నారు. ముఖ్యంగా నితీశ్ తీసుకునే రాజకీయ నిర్ణయాలను చూసే వాళ్లు ఆయన ఏం చేయబోతున్నారు? అనే చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. జేడీయూ, టీడీపీ లు లేకుండా ఎన్డీఏ ప్రభుత్వ ఏర్పాటు సాధ్యం కాదు. ఆ రెండు పార్టీల అధినేత నిర్ణయంపైనే అటు ఎన్డీఏ ఇటు ఇండియా కూటముల భవితవ్యం ఆధారపడి ఉన్నది.