ఢిల్లీ నివాసానికి మనీశ్ సిసోడియా
ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా శనివారం ఉదయం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమను పరామర్శించనున్నారు.

- తీవ్ర అనారోగ్యంతో ఉన్న భార్యను
- కలిసేందుకు అనుమతిచ్చి కోర్టు
- తీహార్ జైలు నుంచి రోడ్డు మార్గాన ఢిల్లీకి
విధాత: ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నేత మనీష్ సిసోడియా శనివారం ఉదయం ఢిల్లీలోని తన నివాసానికి చేరుకున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న తన భార్య సీమను పరామర్శించనున్నారు. భద్రతా సమక్షంలో ఉదయం 10 గంటల 5 గంటల మధ్య తన భార్యను కలిసేందుకు ఢిల్లీ కోర్టు శుక్రవారం అనుమతి ఇచ్చింది. ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో ఆయన ప్రస్తుతం తీహార్ జైలులో జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే. పోలీసు సిబ్బందితో కలిసి జైలు వ్యాన్‌లో రోడ్డు మార్గాన ఢిల్లీలో మధుర రోడ్డులోని తన ఇంటికి చేరుకున్నారు.
మల్టీఫుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నతన భార్య సీమను ఐదు రోజులపాటు చూసుకొనేందుకు అనుమతి ఇవ్వాలని ఆయన కోర్టుకు విజ్ఞప్తి చేశారు. కానీ, కేవలం ఏడు గంటలపాటు సమావేశానికి అనుమతిని ఢిల్లీ రూస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసింది. మీడియాతో మాట్లాడరాదని, ఎటువంటి రాజకీయ కార్యకలాపాలకు పాల్పడకుండా ఉండాలని సిసోడియాను కోర్టు ఆదేశించింది. సిసోడియా తన భార్యను జూన్‌లో కలవడానికి గతంలో కోర్టు అనుమతి పొందారు. కానీ, ఆమె పరిస్థితి అకస్మాత్తుగా క్షీణించి దవాఖానలో చేరడంతో ఆమెను కలవలేకపోయారు.