దేశ రాజ‌ధాని ట్రాఫిక్ అష్ట‌దిగ్బంధంలో చిక్కుకున్న‌ది. పంట‌ల‌కు క‌నీస మద్దతు ధర ప్ర‌క‌టించాల‌నే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీకి మంగ‌ళ‌వారం రైతులు చేప‌ట్ట‌నున్న ర్యాలీ నేప‌థ్యంలో న‌గ‌ర స‌రిహ‌ద్దును పోలీసులు మూసివేశారు

  • ఇదీ ఢిల్లీలో ట్రాఫిక్ ప‌రిస్థితి
  • రైతుల ర్యాలీ నేప‌థ్యంలో
  • ఎక్క‌డిక‌క్క‌డే వాహ‌నాలు

విధాత‌: దేశ రాజ‌ధాని ట్రాఫిక్ అష్ట‌దిగ్బంధంలో చిక్కుకున్న‌ది. పంట‌ల‌కు క‌నీస మద్దతు ధర ప్ర‌క‌టించాల‌నే ప్రధాన డిమాండ్‌తో ఢిల్లీకి మంగ‌ళ‌వారం రైతులు చేప‌ట్ట‌నున్న ర్యాలీ నేప‌థ్యంలో న‌గ‌ర స‌రిహ‌ద్దును పోలీసులు మూసివేశారు. అనేక చోట్ల దారుల‌ను మ‌ళ్లించారు. దాంతో ప్ర‌తి దారి వాహ‌నాల‌తో నిండిపోయింది. ఎక్క‌డిక‌క్క‌డ ట్రాఫిక్ నిలిచిపోయింది. వాహ‌నాలు బంప‌ర్ టు బంప‌ర్ క‌దులుతున్నాయి. ఒక్క కిలో మీట‌ర్ కారులో ప్ర‌యాణించ‌డానికి గంట స‌మ‌యం ప‌డుతున్న‌ది. ఢిల్లీని ఘజియాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాతో కలిపే ఘాజీపూర్, చిల్లా సరిహద్దుల్లోని హైవేల నిండుగా కార్ల పొడవైన క్యూలు కనిపించాయి.

డీఎన్‌డీ ఫ్లైఓవ‌ర్‌పై ఇరుకున్న ఓ ప్ర‌యాణికుడు మీడియాతో మాట్లాడుతూ.. "ఒక గంటకు పైగా ఒక కిలోమీటరు మాత్రమే ప్రయాణించగలనని" చెప్పాడు. "గత 30 నిమిషాలుగా ట్రాఫిక్ నిలిచిపోయింది. రోడ్డు పూర్తిగా మూసివేయబడలేదని పోలీసులు చెప్తున్నారు. కానీ, ముందున్న ఫెన్సింగ్ ప్రాంతంలో తనిఖీలు క్షుణ్ణంగా జరుగుతున్నాయి" అని ఆయన చెప్పారు. ఢిల్లీని గురుగ్రామ్‌తో కలిపే ఎన్‌హెచ్‌-48లో వాహ‌నాలు నెమ్మ‌దిగా క‌దులుతున్నాయి.

దేశ రాజధానిలోకి ప్రవేశించే ముందు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఘాజీపూర్, సింగు, టిక్రితో సహా పలు సరిహద్దు పాయింట్ల మీదుగా ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా పటిష్టంగా చ‌ర్య‌లు చేప‌ట్టారు. సరిహద్దు పాయింట్ల మీదుగా ట్రాక్టర్లు, ట్రాలీలు వెళ్లకుండా నిరోధించడానికి హైవేలపై కాంక్రీట్ బ్లాక్‌లు, బారికేట్లు ఏర్పాటు చేయబడ్డాయి. రోడ్లపై ముళ్ల తీగలు పెట్టారు. గత రాత్రి రైతులు ప్రభుత్వ ప్రతినిధి బృందంతో చర్చలు జరిపారు. అయితే కనీస మద్దతు ధర (MSP) హామీ చట్టంతో సహా వారి మూడు కీలక డిమాండ్లపై ఏకాభిప్రాయం కుద‌ర‌లేదు. గ్రేటర్ నోయిడా ఎక్స్‌ప్రెస్‌వే ద్వారా ఢిల్లీలోకి ప్రవేశించకుండా గూడ్స్ వాహనాల ప్రవేశాన్ని అధికారులు నిషేధించారు.

Somu

Somu

Next Story