అధికారంలోకి వస్తే అదానీపై విచారణ: రాహుల్ గాంధీ

- బొగ్గు దిగుమతుల్లో భారీ దోపిడీ
- ఆయన్ను రక్షిస్తున్న ప్రధాని మోదీ
- ప్రభుత్వాన్ని కూలగొట్టగల కథనం
- అయినా చర్యలకు మోదీ వెనుకంజ
- కాంగ్రెస్ ఎంపీ రాహుల్ విమర్శలు
న్యూఢిల్లీ : అదానీ వ్యవహారంపై వెలుగు చూస్తున్న అంశాల ప్రభావం కనిపిస్తున్నదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు. ‘ఆయనను రక్షించేందుకు ప్రయత్నిస్తున్న ఒకే వ్యక్తిగా ఉన్న ప్రధాని విశ్వసనీయతపై ఇప్పుడు సందేహాలు వ్యక్తమవుతున్నాయి’ అని చెప్పారు. తాము అధికారంలోకి వస్తే అదానీ గ్రూపు అవకతవకలపై విచారణ జరిపిస్తామని స్పష్టం చేశారు. ‘నేను ప్రధానికి సహాయం చేయాలనే అనుకుంటున్నాను. స్వచ్ఛంగా బయటపడండి. మీ విశ్వసనీయను కాపాడుకోండి అని చెబుతున్నారు.
కానీ.. ఆయన తనపై ఆరోపణలనుంచి బయటపడేందుకు ఇష్టపడటం లేదు’ అని వ్యాఖ్యానించారు. అదానీ కంపెనీ.. బొగ్గు దిగుమతుల ఇన్వాయిస్‌లను అమాంతం పెంచేసిన విషయంపై బ్రిటన్‌కు చెందిన ఫైనాన్షియల్ టైమ్స్ పత్రికలో వచ్చిన వార్తను ఆయన ప్రస్తావిస్తూ నేరుగా జరిగిన భారీ దోపిడీకి సంబంధించిన కథనంగా దానిని అభివర్ణించారు. ఈ ఉదంతంలో 32వేల కోట్ల రూపాయలు అదానీ దోచుకున్నారని ఆరోపించారు. ఫలితంగా దేశంలో విద్యుత్తు చార్జీలు పెరుగుతున్నాయని చెప్పారు.
LIVE: Congress party briefing by Shri @RahulGandhi at AICC HQ. https://t.co/RPhm9qNYxZ
— Congress (@INCIndia) October 18, 2023
ఇండోనేషియా నుంచి గౌతం అదానీ బొగ్గు కొనుగోలు చేసి.. దానిని భారత్‌కు తీసుకొచ్చేసరికి.. ధర అమాంతం రెట్టింపై పోయిందని వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చూపించారు. ఇవన్నీ దేశంలోని పేద ప్రజల జేబుల్లోంచి కొట్టేసినవేనని అన్నారు. తాము కర్ణాటకలో అధికారంలోకి రాగానే విద్యుత్తును సబ్సిడీపై ఇస్తున్నామని, మధ్యప్రదేశ్‌లో కూడా ఇదే విధానం అమలు చేస్తామని చెప్పారు. అదానీ మోసం వల్లే ప్రజలకు విద్యుత్తు చార్జీలు పెరుగుతున్న విషయాన్ని గుర్తించాలని కోరారు. అదానీ కుంభకోణాన్ని బ్రిటష్ పత్రికలు చర్చిస్తున్నా.. దేశంలో మాత్రం చర్చించడం లేదని అన్నారు. ఈ వార్త ఏ ప్రభుత్వాన్ని అయినా కూలదోగలిగిందని చెప్పారు.
మోదీ అండతోనే
ఇంత దోపిడీ చేస్తున్న అదానీని మోదీ పదే పదే కాపాడుతున్నారని రాహుల్ ఆరోపించారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ప్రజలకు విద్యుత్తు సబ్సిడీలు ఇస్తుంటే.. అదానీ గ్రూపు బొగ్గు దిగుమతుల సందర్భంగా ఇన్వాయిస్‌లలో ధరలు పెంచేసి, దేశ ప్రజలను నేరుగా దోచుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ అండలేనిదే ఇది సాధ్యం కాదని అన్నారు. అదానీ అక్రమాలపై విచారణ కేంద్రం విచారణ జరుపకపోవడానికి ప్రత్యేక కారణాలేమున్నాయని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
ఈ విషయంలో సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించేందుకు కేంద్రం తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. తమకు సంబంధిత పత్రాలు లభ్యం కావడం లేదని సెబీ చెప్పడాన్ని ఆయన తప్పుపట్టారు. సెబీకి దొరకని పత్రాలు ఫైనాన్షియల్ టైమ్స్‌కు దొరికాయని అన్నారు. అదానీని కేంద్ర ప్రభుత్వంలోని అత్యున్నత వ్యక్తి అయిన ప్రధాన మంత్రి రక్షిస్తున్నారని స్పష్టంగా అర్థమవుతున్నదని చెప్పారు. వారి వద్ద అన్ని పత్రాలూ ఉన్నా.. ఎలాంటి చర్య తీసుకోలేక పోతున్నారని విమర్శించారు. ‘మీరు ఇంట్లో లైట్ వేసుకున్నా, ఫ్యాన్ ఆన్ చేసుకున్నా.. అదానీకి డబ్బులు పోతున్నాయి.
అలాంటి అదానీని ఎవరు రక్షిస్తున్నారు? ఈ దేశ ప్రధాన మంత్రి. భారతదేశంలో అదానీ ఏమైనా చేయగలడు. కానీ.. ఆయనపై ఎలాంటి దర్యాప్తు జరుగదు’ అని రాహుల్ ఆరోపించారు. అదానీతో ఇటీవల ఎన్సీపీ చీఫ్ శరద్‌పవార్ సమావేశం కావడాన్ని, జేపీసీ ఏర్పాటుకు వ్యతిరేకించడాన్ని మీడియా ప్రశ్నించగా.. ఆయనేమీ ప్రధాని కాదని, ఆయన ప్రధాని అయి ఉంటే ఈ ప్రశ్నలు ఆయననే అడిగేవాళ్లమని రాహుల్ బదులిచ్చారు. హిండెన్‌బర్గ్ నివేదిక తర్వాత అదానీ కంపెనీ అక్రమాలను రుజువు చేస్తూ వచ్చిన తొలి కథనం ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించినదేనని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.