రాబోయే ఎన్నికలు మోదీ చెబుతున్నట్టు ఏకపక్షంగా ఏమీ లేవని తాజా పోల్ సర్వే స్పష్టం చేస్తున్నది.

పుంజుకోనున్న ఇండియా

ఓటు షేర్‌లో తేడా 2 శాత‌మే

ద‌క్షిణాదిలో క‌ర్ణాట‌క త‌ప్ప‌

ఎక్క‌డా బీజేపీకి చాన్స్ లేదు

ఈసారి మోదీని గ‌ట్టెక్కించేది

ఆయ‌న చేసిన అభివృద్ధి కాదు

అయోధ్య‌లో క‌ట్టిన ఆల‌య‌మే

మోదీ ప్ర‌భుత్వ అతిపెద్ద వైఫ‌ల్యం

ధ‌ర‌ల పెరుగుద‌ల‌న్న 25% మంది

మొత్తంగా 54% మందికి

ఏదో ఒక అంశంపై వ్య‌తిరేక‌త‌

ఇండియా టుడే - సీవోటర్

మూడ్ ఆఫ్ ది నేష‌న్ వెల్ల‌డి

న్యూఢిల్లీ : రాబోయే ఎన్నికలు మోదీ చెబుతున్నట్టు ఏకపక్షంగా ఏమీ లేవని తాజా పోల్ సర్వే స్పష్టం చేస్తున్నది. 2024 ఎన్నికల్లో బీజేపీ 300 సీట్లు సాధిస్తుందని, ఎన్డీయే కూటమికి మొత్తంగా 400 సీట్లు వస్తాయని ప్రధాని మోదీ ఇటీవల లోక్‌సభలో ప్రకటించుకున్న విషయం తెలిసిందే. అయితే.. ఇండియా టుడే - సీవోటర్ సర్వే వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందే కూటమిగా ఏర్పడినప్పటికీ.. ఇండియా కూటమి గణనీయంగా పుంజుకునే అవకాశాలు కనిపిస్తున్నట్టు సర్వే వివరాలు చూస్తే అర్థమవుతున్నది. ఈ సర్వేను 2023 డిసెంబర్‌- 2024 జనవరి మధ్య నిర్వహించారు. దీనితోపాటు తాజా రాజకీయ పరిణమాలను పరిగణనలోకి తీసుకుంటే గణాంకాల్లో మార్పులు ఉండవచ్చని సర్వే నిర్వాహకులు పేర్కొనడం విశేషం. దానితోపాటు.. ఆరోగ్య సూచన పేరుతో ఒపీనియన్ పోల్ అంచనాలు తప్పే అవకాశాలు కూడా ఉంటాయని పేర్కొన‌డం గమనార్హం. దేశ‌వ్యాప్తంగా ఉన్న 543 లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గాల్లో 96 కోట్ల మంది ఓట‌ర్లు ఉంటార‌ని అంచ‌నా. ఇందులో 35,801 మంది అభిప్రాయాలను తీసుకుని ఈ సర్వే అంచనాలు రూపొందించారు. దేశంలో మోదీ స‌ర్కారుకు అతిపెద్ద వైఫ‌ల్యం ధ‌ర‌ల పెరుగుద‌ల‌ని 25 శాతం మంది అభిప్రాయ‌ప‌డ్డార‌ని స‌ర్వే తెలిపింది. మ‌రో 17 శాతం మంది నిరుద్యోగాన్ని, మ‌రో 12 శాతం మంది ఆర్థిక వృద్ధిని ప్ర‌స్తావించారు. మొత్తంగా 54 శాతం మంది మోదీ ప్ర‌భుత్వంపై ఏదో ఒక అంశంపై వ్య‌తిరేక‌త‌తో ఉండ‌టం క‌నిపిస్తున్న‌ది. ఈసారి మోదీని గెలిపించేది ఆయ‌న చెబుతున్న‌ట్టుగా దేశాన్ని అభివృద్ధి ప‌థంలో న‌డిపిన తీరు కాద‌ని, అయోధ్య ఆల‌య‌మేన‌ని స‌ర్వే అభిప్రాయాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతున్న‌ది.

ఎన్డీయేకు 306.. బీజేపీకి

సర్వే నిర్వహించిన సమయంలో ఎన్నికలు జరిగి ఉంటే.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు గతంకంటే సీట్లు గణనీయంగా తగ్గుతాయని ఇండియా టుడే - సీవోటర్ పోల్ సర్వే అంచనా వేసింది. 306 సీట్లతో ఎన్డీయే విజయం సాధిస్తుందని, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 272 సీట్ల మెజార్టీని సులభంగా దాటుతుందని లెక్కగట్టింది. బీజేపీకి 287 సీట్లు వస్తాయని పేర్కొన్నది. ఇండియా కూటమి గణనీయంగా పుంజుకొని.. 193 సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. ఇతరులు 44 చోట్ల విజయం సాధిస్తారని పేర్కొన్నది. కాంగ్రెస్‌కు 74 సీట్లు వస్తాయని పేర్కొన్నది. కానీ.. ఓట్ల శాతానికి వస్తే.. ఎన్డీయే, ఇండియా కూటమి మధ్య తేడా రెండు శాతం మాత్రమే ఉండ‌టం గ‌మ‌నార్హం. ఈ నేపథ్యంలో రాబోయే లోక్‌సభ సమరం.. పోటాపోటీగానే సాగనున్నదని తేలిపోతున్నది. అయితే.. కాసేప‌టికి లెక్క‌ల‌ను స‌వ‌రిస్తూ.. బీజేపీకి 304 సీట్లు, ఇండియా కూట‌మికి 166 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొన్న‌ది. కాంగ్రెస్‌కు 71 సీట్లు వ‌స్తాయ‌ని పేర్కొన్న‌ది. ప్రాంతీయ పార్టీలు, స్వ‌తంత్రులు, ఇత‌రులు క‌లిపి 168 సీట్లు గెలుచుకుంటార‌ని తెలిపింది.


ఆ రాష్ట్రాల్లో ఇండియా కూట‌మి సేఫ్‌

ఇండియా కూటమి భాగస్వామ్య పక్షాలు అధికారంలో ఉన్న తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, పంజాబ్‌లో ఇండియా కూటమికి ఆధిక్యం ఉంటుందని తెలిపింది. తమిళనాడు, కేరళలో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని స్పష్టం చేసింది. తెలంగాణ, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌లో ఇండియా కూటమిదే అధిపత్యమని తేల్చింది. ప్రతిపక్ష డీఎంకే అధికారంలో ఉన్న తమిళనాడులో 39 సీట్లకు గాను అన్ని సీట్లూ ఇండియా కూటమికే దక్కుతాయని సర్వే తెలిపింది. సీపీఎం నేతృత్వంలోని వామపక్ష ప్రజాతంత్ర సంఘటన అధికారంలో ఉన్న కేరళలో ఇండియా కూటమి క్లీన్ స్వీప్ చేస్తుందని, అక్కడ 20కి 20 సీట్లూ ఇండియా కూటమికే దక్కుతాయని ఇండియా టుడే మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది. పంజాబ్‌లో ఆప్‌, కాంగ్రెస్ చెరి ఐదు స్థానాలు గెలుస్తాయని సర్వే అంచనా వేసింది. ఇక్కడ బీజేపీకి 2, శిరోమణి అకాలీదళ్‌ఒక స్థానంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. మహారాష్ట్రలో 48 సీట్లకుగాను ఎన్డీయే కూటమి 22 సీట్లు సాధిస్తుందని తెలిపింది. ఇక్కడ ఇండియా కూటమి 26 సీట్లు దక్కించుకుంటుందని పేర్కొన్నది. అంటే గత ఎన్నికల కంటే 21 సీట్లు అధికంగా సాధించే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. కాంగ్రెస్ 12 సీట్లలో, శివసేన (ఉద్ధవ్‌), ఎన్సీపీ (శరద్‌పవార్‌) 14 సీట్లలో గెలుస్తాయని అంచనా వేసింది. బెంగాల్‌లో తృణమూల్ కాంగ్రెస్‌కు 22, ఎన్డీయేకు 19 సీట్లు వస్తాయని తెలిపింది. తెలంగాణలో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ 10 సీట్లలో విజయం సాధించేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలకు గాను టీడీపీకి 17 సీట్లు లభిస్తాయని అంచనా వేసింది. మిగిలిన ఎనిమిది సీట్లలో వైసీపీ గెలుస్తుందని తెలిపింది.

అవి బీజేపీకి!

మధ్యప్రదేశ్‌లో 29 సీట్లకుగాను ఎన్డీయేకు 27 సీట్లు వస్తాయని మూడ్ ఆఫ్ ది నేషన్ అంచనా వేసింది. కాంగ్రెస్‌కు రెండు సీట్లు వస్తాయని పేర్కొన్నది. ఎన్డీయేకు 58%, ఇండియా కూటమికి 38.2% ఓట్లు వస్తాయని తెలిపింది. గుజరాత్‌లో మొత్తం 26 సీట్లను మూడోసారి కైవసం చేసుకోవడం ద్వారా బీజేపీ హ్యాట్రిక్ సాధిస్తుందని సర్వే తెలిపింది. రాజ‌స్థాన్‌లోని 25 సీట్ల‌నూ స్వీప్ చేస్తుంద‌ని పేర్కొన్న‌ది. కర్ణాటకలో 28 సీట్లకుగాను 24 సీట్లలో ఎన్డీయే గెలుస్తుందని సర్వే చెప్పడం విశేషం. ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయాన్ని చవి చూసినా.. మళ్లీ లోక్‌సభ ఎన్నికల్లో 24 సీట్లు గెలుస్తుందని, ఇండియా కూటమి 4 సీట్లతో సరిపెట్టుకుంటుందని సర్వే అంచనా వేయడం గమనార్హం. అలాగే రాష్ట్రాలు ఓడిపోయినా.. ఛ‌త్తీస్‌గ‌ఢ్‌, రాజ‌స్థాన్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకు ప‌దిలంగానే ఉన్న‌ప్ప‌టికీ.. తాజా స‌ర్వేలో ఎన్డీయే ఓటు షేరు పెరుగుతుంద‌ని పేర్కొన‌డంపై ప‌రిశీల‌కులు అనుమానాలు వ్య‌క్తం చేస్తున్నారు. పది స్థానాలు ఉన్న హర్యానాలో బీజేపీ 8 సీట్లు గెలుస్తుందని, అయితే ఓటు షేరు తగ్గుతుందని సర్వే అంచనా వేసింది. ఉత్తరాఖండ్‌లోని ఐదు సీట్లనూ ఎన్డీయే గెలుస్తుందని అంచనా వేసింది. ఈశాన్య రాష్ట్రాల్లో కీలకమైన అసోంలో ఎన్డీయే 12, ఇండియా 2 సీట్లు సాధిస్తాయని పేర్కొన్నది. ఉత్తరప్రదేశ్‌లో 80 సీట్లకుగాను బీజేపీ కూటమి 70 స్థానాల్లో విజయం సాధిస్తుందని సర్వే అంచనా వేసింది. జార్ఖండ్‌లో 14 సీట్లకు గాను 12 ఎన్డీయే గెలుస్తుందని, ఇండియా కూటమికి రెండు సీట్లు లభిస్తాయని లెక్కగట్టింది. ఇటీవల అనూహ్య రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్న బీహార్‌లో ఎన్డీయే కూటమి విజయం సాధిస్తుందని సర్వే తెలిపింది. గతం కంటే సీట్లు తగ్గినా.. మొత్తం 40 స్థానాలకు గాను 32 చోట్ల ఎన్డీయే గెలిచేందుకు అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నది. ఇండియా కూటమి 8 సీట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ఢిల్లీలోని ఏడు స్థానాలనూ బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలిపింది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌లలో ఎన్డీయే ఆధిక్యమే ఉంటుందని సర్వే అంచనా వేసింది. కాంగ్రెస్ పాలిత హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌లోనూ మూడు స్థానాల‌నూ బీజేపీయే గెలుస్తుంద‌ని పేర్కొన్న‌ది.

గ‌ట్టెక్కించేది అయోధ్యే

దేశాన్ని తాము అభివృద్ధి చేసిన తీరే త‌మ‌ను గెలిపిస్తుంద‌ని బీజేపీ ప్ర‌క‌టించుకుంటున్నా.. వాస్త‌వానికి బీజేపీ ఈ ఎన్నిక‌ల్లో గ‌ట్టెక్కితే దాని పూర్తి క్రెడిట్ అయోధ్య‌లోని రామ‌మందిరానికేన‌ని స‌ర్వే లెక్క‌లు పేర్కొంటున్నాయి. మోదీని ఏం విష‌యం మీరు గుర్తుంచుకుంటార‌న్న ప్ర‌శ్న‌కు 42 శాతం మంది అయోధ్య రామ మందిరం విష‌యంలోన‌ని బ‌దులివ్వ‌డం గ‌మ‌నార్హం. మ‌రో 12 శాతం మంది జ‌మ్ముక‌శ్మీర్‌లో ఆర్టిక‌ల్ 370 ర‌ద్దు విష‌యాన్ని ప్ర‌స్తావించారు. 9 శాతం మంది పాకిస్థాన్‌పై స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్‌ను పేర్కొన్నారు. బీజేపీ మ‌త‌ప‌రంగా ఓట‌ర్ల‌ను ఎంత‌గా ప్ర‌భావితం చేసింద‌నేది ఈ గ‌ణాంకాల‌ను బ‌ట్టి అర్థ‌మ‌వుతున్న‌ది.

Subbu

Subbu

Next Story