ఉపరాష్ట్రపతి ఎన్నిక..షెడ్యూల్ విడుదల

జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీయైన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఆగస్టు 7న ఉప రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడదల కానుండగా..సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు

ఉపరాష్ట్రపతి ఎన్నిక..షెడ్యూల్ విడుదల

న్యూఢిల్లీ: జగదీప్ ధన్కడ్ రాజీనామాతో ఖాళీయైన ఉప రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ జారీ చేసింది. ఆగస్టు 7న ఉప రాష్ట్రపతి ఎన్నిక నోటిఫికేషన్ విడదల కానుండగా..సెప్టెంబర్ 9న ఉపరాష్ట్రపతి ఎన్నిక నిర్వహించనున్నారు. నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ఆగస్టు 21తో ముగియ్యనుంది. 22న నామినేషన్ల పరిశీలన, 25న ఉపసంహరణ ప్రక్రియ ఉంటుంది. ఉప రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ సెప్టెంబర్ 9న జరుగనుంది. ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్..అదే రోజు లెక్కింపు, ఫలితాల వెల్లడి ఉండనుంది.

74 ఏళ్ల ధన్‌ఖడ్ 2022 ఆగస్టులో ఉప రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించారు. 2027 వరకు ఆయనకు పదవీ కాలం ఉన్నప్పటికీ జూలై 21వ తేదీన అనారోగ్య కారణాలతో పదవికి రాజీనామా చేశారు. రాజ్యాంగంలోని 63 నుంచి 71వ అధికరణాలతో పాటు ఉపరాష్ట్రపతి (ఎన్నికల) నియమాలు- 1974 ప్రకారం నూతన ఉప రాష్ట్రపతి ఎన్నిక ప్రక్రియ జరుగుతుంది. భారతదేశంలో ఉపరాష్ట్రపతి దేశంలో రెండవ అత్యున్నత రాజ్యాంగ పదవిగా కొనసాగుతుంది. పదవీకాలం అయిదేళ్లు. కానీ పదవీకాలం ముగిసిన తర్వాత కూడా, కొత్త ఉపరాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించే వరకు ఆ పదవిలో కొనసాగవచ్చు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 68లోని సెక్షన్ 2 ప్రకారం… ఉప రాష్ట్రపతి మరణం, రాజీనామా, తొలగింపు వంటివిగాని.. మరేదైనా కారణం వల్ల కానీ ఖాళీ ఏర్పడితే భర్తీ చేయడానికి వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించేలా నిబంధన ఉంది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 66 ప్రకారం.. పార్లమెంటు ఉభయ సభల (లోక్‌సభ, రాజ్యసభ) సభ్యులతో కూడిన ఎలక్టోరల్ కాలేజీ ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటుంది. దామాషా ప్రాతినిధ్యం ప్రకారం.. సింగిల్ ట్రాన్సఫరబుల్ ఓటింగ్ పద్ధతిలో ఉపరాష్ట్రపతిని ఎన్నుకుంటారు. ఈ ఓటింగ్ రహస్య బ్యాలెట్ విధానంలో జరుగుతుంది.