Revanth Reddy: దేశాన్ని దెబ్బతీయాలని చూస్తే.. నూకలు చెల్లినట్టే

  • By: sr    news    May 08, 2025 10:41 PM IST
Revanth Reddy: దేశాన్ని దెబ్బతీయాలని చూస్తే.. నూకలు చెల్లినట్టే
  • మేం శాంతికాముకులం.. చేతకాని వాళ్లం కాదు
  • మా దేశాన్ని దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్టే
  • సీఎం రేవంత్‌రెడ్డి
  • జవాన్లకు సంఘీభావంగా ర్యాలీ

హైద‌రాబాద్‌ (విధాత‌): దేశ సార్వభౌమత్వాన్ని ఎవరైనా దెబ్బతీయాలని చూస్తే వారికి నూకలు చెల్లినట్లే.. ఇది మా హెచ్చరిక అని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. దేశ రక్షణ విషయంలో రాజకీయాలకు అతీతంగా అన్నీ పార్టీల‌వాళ్లం ఒక్కటవుతామ‌న్నారు. మేము శాంతి కాముకులం.. అది మా చేతగానితనం అనుకుని మా ఆడబిడ్డల నుదిటి సిందూరం తుడిచేయాలనుకుంటే కుద‌ర‌ద‌ని స్ప‌ష్టం చేశారు.

ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో భారత సైన్యానికి సంఘీభావంగా గురువారం సాయంత్రం తెలంగాణ అంబేద్క‌ర్ స‌చివాల‌యం నుంచి నెక్లెస్ రోడ్డు జంక్ష‌న్ లోని ఇందిరాగాంధీ విగ్ర‌హం వ‌ర‌కు ర్యాలీ జ‌రిగింది. ఈ ర్యాలీలో రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు, స‌చివాల‌యం ఉద్యోగులు పాల్గొన్నారు.

పహల్గామ్ టెర్రరిస్టుల దాడిలో అమరులైన వారి చిత్రపటాలకు పుష్పాంజలి ఘటించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, దేశ రక్షణలో అందరం ఒక్కటేనని చాటుతూ తెలంగాణ గడ్డ నుంచి భారత జవాన్లకు స్ఫూర్తినిచ్చేందుకే ఈ సంఘీభావ ర్యాలీ నిర్వ‌హించామ‌న్నారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి భారత దేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీయాలని చూస్తే సహించేది లేదన్నారు. వారికి ఆపరేషన్ సిందూర్ తో సమాధానం చెబుతామ‌ని, ఉగ్రవాదాన్ని తుదముట్టించేందుకు భారత సైన్యానికి మద్దతుగా నిలుస్తామ‌ని ముఖ్య‌మంత్రి తెలిపారు.