Vijayasanthi: నాడు ఒప్పు ఎట్లా.. నేడు తప్పు ఎట్లా?: విజయశాంతి

  • By: sr    news    Apr 03, 2025 6:40 PM IST
Vijayasanthi: నాడు ఒప్పు ఎట్లా.. నేడు తప్పు ఎట్లా?: విజయశాంతి

విధాత : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిసరాల్లోని కంచ గచ్చిబౌలి 400ఎకరాల భూ వివాదంపై బీజేపీ పార్టీ ద్వంద్వ విధానాలు అనుసరిస్తుందని కాంగ్రెస్ ఎమ్మెల్సీ, సినీ నటి విజయశాంతి మండిపడ్డారు. కంచ గచ్చిబౌలి 400 ఎకరాల భూమిని బిల్లీరావుకు చెందిన ఐఎంజి సంస్థకు 2004లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు కేటాయించడం తెలంగాణ బీజేపీ దృష్టిలో అప్పుడ న్యాయం.. సహేతుకం ఎట్లా అయ్యిందని ప్రశ్నించారు. ఐఎంజి సంస్థ ఈ 400 ఎకరాల్లో క్రీడా ప్రాంగణం కట్టకుండా.. ఈ భూమిని కొట్టేయాలని ప్రయత్నం చేసినప్పుడు తెలంగాణ బీజేపీ నేతలకు అది అన్యాయం ఎందుకు అనిపించలేదని విజయశాంతి నిలదీశారు.

ఎందుకంటే 2004లో బీజేపీ కూటమిలో టీడీపీ ఉన్నప్పుడే ఐఎంజి సంస్థకు చంద్రబాబు ఈ 400 ఎకరాల స్థలాన్ని బదలాయించారని గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ నేతలు ఈ భూములపై కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రస్తావించే తప్పులన్నీ అప్పుడు వాళ్లకు అందుకే గుర్తు రాలేదని ఎద్దేవా చేశారు. . ప్రస్తుతం ఈ 400 ఎకరాలపై కాంగ్రెస్ ముఖ్యమంత్రులు కొట్లాడి , ఈ భూముల్ని కాపాడి, వాటిని అమ్మి ఆ డబ్బును ప్రభుత్వ ఖజానాలో జమ చేయడం నేరమంటూ తెలంగాణ బీజేపీ నేతలు నానా యాగి చేస్తున్నారన్నారు. మరి 2004లో ఐఎంజి సంస్థకు ఈ భూముల్ని అప్పచెప్పడం తెలంగాణ బీజేపీ నేతల దృష్టిలో నేరం అనిపించలేదా? అని విజయశాంతి నిగ్గదీశారు. అవకాశవాద రాజకీయాలు చేయకుండా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పాలని తెలంగాణ సమాజం బీజేపీ నేతలను నిలదీస్తుందని విజయశాంతి పేర్కొన్నారు.