పేదలను విస్మరించి కార్పొరేట్లకు సంపదను దోచిపెడుతున్న పాలకులు

విధాత వరంగల్ ప్రతినిధి: హనుమకొండ జిల్లా స్థానిక సమస్యలపై సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు సోమవారం మహా ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాకు ముఖ్య అతిధిగా హాజరైన సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు స్.వీరయ్య మాట్లాడుతూ జిల్లాలో ఇండ్లు లేని నిరుపేదలు ప్రభుత్వ స్థలాల్లో ఇండ్లు వేసుకొని ఏండ్ల తరబడి జీవనం కొనసాగిస్తున్నా పట్టాలు ఇవ్వకపోవడంతో ఇందిరమ్మ ఇండ్లకు అనర్హులుగా మారి పేదవాడి సొంత ఇంటి కళ నెరవేరే పరిస్థితి లేదన్నారు. అనిల్ అంబానీ, అదానీ లాంటి బడా కార్పొరేట్ శక్తులు లక్షల కోట్లతో ఇండ్లు నిర్మించుకుంటున్నారని ఈ సంపదంతా ప్రజల నుండి దోచుకున్నదేనని విమర్శించారు. వీరికి పాలకులు వత్తాసు పలుకుతున్నారని విమర్శించారు.
10 ఏండ్ల బిఆర్ ఎస్ పాలనలో ఇండ్లు, ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్ రూములు రాలేదని విమర్శించారు. కార్మికులు, రైతు కూలీలు ఎదుర్కున్న ఏ ఒక్క సమస్యను పరిష్కరించలేనిదని విమర్శించారు. ఈ ప్రజా వ్యతిరేకతను సొమ్ము చేసుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీల పేరుతొ కాలం వెళ్లబుచ్చింది తప్ప సమస్యల పరిష్కారం చేయడం లేదన్నారు. 7వ గ్యారంటీ పేరుతొ ప్రజాస్వామ్య హక్కులను కాపాడుతానని చెప్పిన రేవంత్ రెడ్డి పేదలు తమ నిరసన తెలపడానికి కలెక్టర్ ఆఫిస్ ముందు టెంట్లు వేసుకోవడానికి అవకాశం ఇవ్వకపోవడం దారుణమన్నారు. రాష్ట్రంలో 8 పార్లమెంట్ సీట్లు గెలిచిన బిజెపి రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ విషయంలో కానీ, తెలంగాణ విభజన హామీలను కానీ ఇవ్వడములో విఫలమైందన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు యం .చుక్కయ్య, బోట్ల చక్రపాణి, రాగుల రమేష్, గొడుగు వెంకట్, వాంకుడోతు వీరన్న, జి.రాములు, డి.తిరుపతి, కె.లింగయ్య, డి.భాను నాయక్ మండల కార్యదర్శులు ఓరుగంటి సాంబయ్య, గాదె రమేష్, నాయకులు టి.ఉప్పలయ్య, మంద సంపత్, నోముల కిషోర్, పెండ్యాల రవి, మంద సుచందర్, కంచెర్ల కుమార్, ఎం.రమాదేవి, వల్లెపు రాజు, రమేష్, పుల్ల అశోక్, అంబాలా స్వరూప, లోకిని స్వరూప, రాజు, విజేందర్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.