Warangal: టాస్క్ ఫోర్స్ దాడులు.. కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ ప‌ట్టివేత‌

  • By: sr    news    Mar 07, 2025 6:18 PM IST
Warangal: టాస్క్ ఫోర్స్ దాడులు.. కాలం చెల్లిన  కూల్ డ్రింక్స్ ప‌ట్టివేత‌

విధాత, వరంగల్: కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ విక్రయిస్తున్న డిస్టిబ్యూటర్ పై టాస్క్ ఫోర్సు పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. వరంగల్ కరీమాబాదులోని సాయిబాబా కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూటర్ పై దాడి చేసి కాలం చెల్లిన రూ.77,935 వేల విలువైన 21 రకాల కూట్ డ్రింక్స్ స్వాధీనం చేసుకున్నారు. వివ‌రాల్లోకి వెళితే.. వరంగల్ నగరంలో ఫుడ్ సేఫ్టీ విషయంలో నాణ్యతతో పాటు పరిశుభ్రతా ప్రమాణాలు పాటించకుండా ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న వ్యాపారస్తుల విష‌యంలో కఠినంగా వ్యవహరించాలని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశించారు.

దీంతో టాస్క్ ఫోర్స్ ఏసీపీ మధుసూదన్ ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం. రంజిత్ కుమార్ తన సిబ్బంది, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో సాయిబాబా కూల్ డ్రింక్స్ డిస్ట్రిబ్యూషన్ షాపుపై సంయుక్తంగా దాడి చేసి అమ్మకానికి సిద్ధంగా ఉన్న కాలం చెల్లిన కూల్ డ్రింక్స్ సుమారు రూ.77,935వేలు విలువ గల 21 రకాల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నారు. అనంత‌రం దుకాణ యజమాని కొత్తిమీర కారు శైలజ భర్త రాజు ను విచారణ నిమిత్తం మిల్స్ కాలనీ పోలీసులకు అప్పగించారు.

ఈ సందర్భంగా పోలీసులు ఆహార భద్రత విషయంలో అపరిశుభ్రంగా, కాలం చెల్లిన ఆహార పదార్థాలు విక్రయించినా, నిబంధనలు ఉల్లంఘించినా సంబంధిత వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ప్రముఖ బ్రాండ్‌లను మార్పు చేసి విక్రయాలు చేస్తున్న నకిలీ వస్తువులపై నిఘా ఉంచామన్నారు. గడువు ముగిసిన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ యాక్ట్ 2006, 2011 రూల్స్, రెగ్యులేషన్స్ ప్రకారం నిబంధనలు పాటించని వ్యాపారులపై ఫుడ్ సేఫ్టీ శాఖ సహాయంతో చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దాడిలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ ఎం రంజిత్ కుమార్, ఎస్ ఐ వడ్డే దిలీప్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ కృష్ణమూర్తి , మరియు టాస్క్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు.