Telangana: ఉద్యోగాలపై మాట ఇచ్చాం.. నిలుపుకున్నాం: డిప్యూటీ సీఎం భట్టి

విధాత: యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ప్రారంభోత్సవం సందర్భంగా నిర్వాసితులకు సీఎం రేవంత్ రెడ్డి, నేను ఇచ్చిన మాట ప్రకారం నేడు ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి మాట నిలబెట్టుకున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు. నాడు ఇచ్చిన మాట ప్రకారం అర్హత కలిగిన 112 మందికి జూనియర్ అసిస్టెంట్, జూనియర్ ప్లాంట్ అటెండెన్స్, ఆఫీస్ సబ్ ఆర్డినేట్, హౌస్ కీపర్స్ తో పాటు యాదాద్రి పవర్ ప్లాంట్ లో ఉద్యోగ నియామక పత్రాలను భట్టి శుక్రవారం అందించారు. అదేవిధంగా టీజీపీఎస్సీ ద్వారా ఆర్థిక శాఖలో నూతనంగా ఎంపికైన 51 మందికి డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్స్ నియామక పత్రాలను అందచేశారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్వాసితులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన గత పాలకులు చాలా సంవత్సరాలుగా ఇవ్వకపోవడంతో చాలా మందికి వారి వయసు కూడా దాటిపోయిందన్నారు.
గత ప్రభుత్వం నిర్లక్ష్యంగా వదిలేసిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ లో ప్రొడక్షన్ అందుబాటులోకి తీసుకురావడానికి ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ కు ప్రజాభిప్రాయ సేకరణ చేయించి, అనుమతులు తీసుకొచ్చి పనులు మొదలుపెట్టి పూర్తి చేశామన్నారు. నిర్థిష్ట కాలపరిమితితో పవర్ ప్లాంట్ పనులు పూర్తి చేసి సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్లాంటును ప్రారంభించడం జరిగిందని గుర్తు చేశారు. ఆనాడు నిర్వాసితులకు ఇచ్చిన హామీ మేరకు నేడు ఉద్యోగ నియామక పత్రాలు అందించామని తెలిపారు. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో 59,000 మంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగ నియామక పత్రాలు అందించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించామని తెలిపారు. రాష్ట్ర ఆవిర్భావం కోసం ఆశించి పోరాడిన యువతకు ఉద్యోగాలు కల్పిస్తేనే రాష్ట్రం తెచ్చుకున్న దానికి అర్థం పరమార్థం ఉంటుందని ఆలోచనతో ప్రజా ప్రభుత్వం ముందుకు వెళ్తున్నదని స్పష్టం చేశారు.
9వేలతో.. రాజీవ్ యువ వికాసం చారిత్రాత్మకం
ఉద్యోగ అవకాశాలు పొందలేని నిరుద్యోగ యువతీ యువకుల కోసం 9,000 కోట్ల రూపాయలతో స్వయం ఉపాధి పథకాలు అందించడానికి రాజీవ్ యువ వికాస పథకాన్ని ప్రారంభించామని భట్టి చెప్పారు. నా రాజకీయ జీవితంలో, తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఇప్పటి వరకు ఒకే సంవత్సరం స్వయం ఉపాధి పథకాల కోసం 9,000 కోట్ల రూపాయలు కేటాయించిన చరిత్ర ఏ ప్రభుత్వానికి లేదన్నారు. గత ప్రభుత్వం మాదిరిగా ప్రకటన చేసి వదిలేయడం లాంటి పని చేయకుండా రాజీవ్ యువ వికాస పథకం ప్రకటనకు ముందే దరఖాస్తుల ప్రక్రియ, లబ్ధిదారుల ఎంపిక, సాంక్షన్, గ్రౌడింగ్ చేసేంత వరకు క్యాలెండర్ ముందుగానే ప్రకటించామని చెప్పుకొచ్చారు. లక్షల మంది యువతీ యువకులకు ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు కల్పించడానికి హైదరాబాద్ నగరంలో ఐటీ సెక్టర్, నాలెడ్జ్ వ్యవస్థలను ప్రజా ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నదన్నారు. నాడు కొండలు గుట్టలు ఖాళీ ప్రదేశాలుగా ఉన్న హైటెక్ సిటీ ప్రాంతంలో ఐటి సెక్టార్ నెలకొల్పడానికి ఆనాటి కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి పునాదులు వేశారన్నారు. ఆ తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులు కూడా ఐటి సెక్టార్ ను అభివృద్ధి చేయడంతో ఈరోజు హైదరాబాద్ గ్లోబల్ సిటీగా మారడం వల్ల ప్రపంచంలో పేరు ప్రఖ్యాతులు ఉన్న సంస్థలు ఇక్కడికి వచ్చి కంపెనీలు పెట్టడం వల్ల లక్షలాదిమంది నిరుద్యోగ యువతీ యువకులకు ఉద్యోగాలు వచ్చాయన్నారు.
ప్రపంచ స్థాయి సంస్థల స్థాపనకు కృషి
హైదరాబాద్ నగరాన్ని విస్తరించి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతి పొందిన సంస్థలను తీసుకురావడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ కు వెళ్లి లక్ష 84 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఎంవోయూ చేసుకున్నారన్నారు. హైదరాబాద్ నగరాన్ని విస్తరించడంలో భాంగానే ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నారని.. అందులో స్కిల్ యూనివర్సిటీ,స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ నగర అభివృద్ధికి మౌలిక వసతులు కల్పనకు ప్రజా ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. అవుటర్ రింగ్ రోడ్- రీజినల్ రింగ్ రోడ్ మధ్యన చేయాల్సిన అభివృద్ధి పట్ల ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. ప్రజా ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రగతి నిరోధకులు చేస్తున్న కుట్రల పట్ల అప్రమత్తంగా ఉంటూ నిరుద్యోగ యువతీ యువకులు అభివృద్ధి వైపు ముందుకు వెళ్లాలని సూచించారు. అభివృద్ధిలో తెలంగాణ రాష్ట్రం దేశం, ప్రపంచంతో పోటీపడాలని అందుకు తగ్గట్టుగా ప్రణాళికలు తయారు చేసుకొని ప్రజా ప్రభుత్వం ముందుకు వెళుతున్నదన్నారు.