Hyderabad Auto Parking Hub | హైదరాబాద్ ఘనతగా ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్!

హైదరాబాద్ నాంపల్లిలో జర్మన్ టెక్నాలజీతో 15 అంతస్తుల ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్, ఒక్క నిమిషంలో వాహన పార్కింగ్ సదుపాయం అందుబాటులోకి.

Hyderabad Auto Parking Hub | హైదరాబాద్ ఘనతగా ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్!

Hyderabad Auto Parking Hub | విధాత, హైదరాబాద్ : దేశంలోనే జర్మన్ టెక్నాలజీతో రూపుదిద్దుకుంటున్న తొలి ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ కాంప్లెక్స్ హైదరాబాద్ లో అందుబాటులోకి రాబోతుంది. నాంపల్లిలో హైదరాబాద్‌ మెట్రోరైల్‌ నిర్మించిన ప్రతిష్టాత్మకమైన ఆటోమేటెడ్‌ బహుళ అంతస్తుల పార్కింగ్‌ కాంప్లెక్‌ ప్రారంభానికి తుది మెరుగులు దిద్దుకుంటోంది. ట్రయల్స్ కూడా చేపట్టారు. వివిధ ప్రభుత్వ శాఖల నుంచి అనుమతులు రాగానే ప్రజలకు అందుబాటులోకి తెస్తామని మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. నగరంలో పార్కింగ్‌ కష్టాలను తీర్చే ఒక అద్భుతమైన ప్రాజెక్టుకుగా ఇది వినియోగంలోకి రానుందని.. ప్రపంచంలోనే ఇలాంటి పూర్తిస్థాయి ఆటోమేటెడ్‌ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లు అరుదని వెల్లడించారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును అత్యంత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నట్లు తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకనుగుణంగా ఈ ప్రాజెక్టును నిర్మించామన్నారు. ఇది అందుబాటులోకి వస్తే నాంపల్లి ప్రాంతంలో టూవీలర్, ఫోర్ వీలర్ పార్కింగ్ ఇక్కట్లు తప్పనున్నాయి. ముఖ్యంగా నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగే నుమాయిష్​ లాంటి కార్యక్రమాలకు వచ్చే సందర్శకులు పార్కింగ్ కోసం పడుతున్న ఇబ్బందులకు పరిష్కారం లభించనుంది.

ఆటో మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రత్యేకతలివే
ఆటోమేటెడ్ మల్టీ లెవెల్ పార్కింగ్ ప్రాజెక్టును హైదరాబాద్‌ మెట్రోరైల్‌ పబ్లిక్‌ ప్రైవేట్‌ భాగస్వామ్య (పీపీపీ) పద్ధతిలో నిర్మిస్తున్నారు. ‘నోవమ్‌’ అనే సంస్థ జర్మనీకి చెందిన అత్యాధునిక ‘పాలిస్‌‘ సాంకేతికతతో పూర్తి ఆటోమేటెడ్‌ పార్కింగ్ ప్రాజెక్టును నిర్మిస్తుంది.. ఈ ప్రాజెక్టు కోసం హెచ్‌ఎంఆర్‌ఎల్‌ 2000 చదరపు గజాల స్థలాన్ని 50 సంవత్సరాల కన్సెషన్‌కు ఇచ్చింది. ఈ ప్రాజెక్టు డెవలపర్లు డాక్టర్‌ హరికిషన్‌ రెడ్డి, భావనారెడ్డిలు రూ.102 కోట్లతో నిర్మించారని ఎన్వీఎస్‌ తెలిపారు.

ఈ కాంప్లెక్స్‌లో మొత్తం 15 అంతస్తులు ఉంటాయి. ఇందులో 3 బేస్‌మెంట్లు, 7 పైఅంతస్తులు కలిపి మొత్తం 10 అంతస్తుల్లో పార్కింగ్‌ సదుపాయం ఉంటుంది. మరో 5 అంతస్తులను వాణిజ్య కార్యకలాపాలకు కేటాయించారు. ఈ పార్కింగ్‌ కాంప్లెక్స్‌లో అన్నిరకాల సదుపాయాలు కలిగిన రెండు సినీ థియేటర్లను కూడా ఏర్పాటు చేశారు. 11వ అంతస్తులో నగర వీక్షణ కోసం గ్యాలరీని ఏర్పాటు చేశారు. మొత్తం 10 పార్కింగ్‌ అంతస్తుల్లో 250 కార్లు, 200 ద్విచక్ర వాహనాలను పార్కింగ్‌ చేయవచ్చని, ఈ ప్రాజెక్టు ద్వారా నగర ప్రజలకు ప్రపంచ స్థాయి పార్కింగ్‌ అనుభవం అందించనున్నామని ఎన్వీఎస్‌ రెడ్డి వెల్లడించారు. చార్జీలు కారుకు గంటకు రూ. 30, బైకుకు గంటకు రూ. 10 చొప్పున వసూలు చేయనున్నట్టు సమాచారం. అయితే, ముంబై, ఇతర పలు ప్రధాన నగరాల్లోనూ మల్లీ లెవల్ పార్కింగ్ లు ఉన్నా.. అక్కడ తరచూ సమస్యలు వస్తుండటం గమనార్హం.

నిమిషంలోనే పార్కింగ్..
మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ లో బీ1, బీ2, బీ3 అండర్ గ్రౌండ్ అంతస్తులతోపాటు 5 నుంచి 11 అంతస్తుల వరకు పార్కింగ్ కోసం కేటాయించారు. మూడో అంతస్తులో రెండు స్క్రీన్​లతో ఒక థియేటర్, రెస్టారెంట్లు ఇతర కమర్షియల్ నిర్మాణాలు చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్​లో పార్కింగ్ కు సంబంధించి నాలుగు ఎంట్రీ, ఎగ్జిట్ టెర్మినల్స్ ఉంటాయి. ఆ టెర్మినల్స్ వద్ద ఉన్న టర్న్ టేబుల్స్ పై వాహనాలను వదిలితే.. లిఫ్టుల ద్వారా నిర్ణీత అంతస్తులోకి చేరుకుంటాయి. సైజును బట్టి తగిన స్లాట్లలో పార్కింగ్ చేస్తారు. పార్కింగ్ ప్రక్రియకు కేవలం ఒక్క నిమిషం మాత్రమే పట్టనుంది. కార్లను తిరిగి తీసుకోవడానికి టర్న్ టేబుల్స్ వద్దనున్న కార్డు రీడర్ల వద్ద స్మార్ట్ కార్డును స్వైప్ చేస్తే.. కారు నిర్ణీత టర్న్ టేబుల్ వద్దకు చేరుకుంటుంది. టర్న్​టేబుల్ పై ఉన్న కారును రివర్స్ చేసే బాధ లేకుండా టర్న్ టేబుల్స్ వాహనాన్ని కావాల్సిన దిక్కుకు రొటేట్ చేస్తాయి. దీంతో పార్కింగ్ నుంచి కారును రెండు నిమిషాల్లోనే బయటకు తీసేందుకు వీలుకానుంది. ఇక పార్కింగ్ చార్జీలు చెల్లించేందుకు స్మార్ట్ కార్డులను ఉపయోగించాల్సి ఉంటుంది. రెగ్యులర్ గా పార్కింగ్ చేసేవారికి ఆర్ఎఫ్ఐడీ స్మార్ట్ కార్డులను జారీ చేస్తారు.

ఇవి కూడా చదవండి..

బికినీలేసుకుని.. సబ్బు రుద్దుకుంటూ.. కెనడా బీచ్‌లో ‘భారతీయుల’ స్నానంపై ట్రోలింగ్‌

మూసీ పునరుజ్జీవనం! పేదలకు ఓ న్యాయం.. పెద్దలకు మరోటి?