అభ్యర్థులకు రె”బెల్స్” ఫికర్.. ఉపసంహరణకు రేపు ఆఖరు..!!
వారికి తోడు ఇండిపెండెంట్‌లు వాళ్లు బరిలో ఉంటే ఓట్ల చీలికే గజ్వేల్‌లో భారీగా నామినేషన్లు కామారెడ్డి, మేడ్చ్‌ల్‌లోనూ అదే సీన్ బుజ్జగింపుల్లో ప్రధాన పార్టీలు

విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణకు బుధవారం ఆఖరి రోజు కావడంతో పోటీలో ఉన్న సొంత పార్టీ రెబల్ అభ్యర్థులను, తమపై కోపంతో నామినేషన్లు వేసిన ఇండిపెండెంట్‌లను ఉపసంహరింపచేసేందుకు ప్రధాన పార్టీలన్నీ బుజ్జగింపులలో నిమగ్నమయ్యాయి. గత రెండు ఎన్నికల కంటే భిన్నంగా.. చాలా చోట్ల నువ్వానేనా అన్నట్లుగా బీఆరెస్, కాంగ్రెస్ మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని చోట్ల త్రిముఖ పోటీలు సాగుతున్నాయి. ఈ పరిస్థితుల్లో సొంత పార్టీ అభ్యర్థులు పోటీలో ఉంటే ఓట్లు చీలి పార్టీ అభ్యర్థులకు నష్టదాయకంగా మారుతుందన్న ఆందోళన ప్రధాన పార్టీల్లో వ్యక్తమవుతున్నది.
119 నియోజకవర్గాల్లో దాఖలైన 4,798 నామినేషన్లలో 608 నామినేషన్లు తిరస్కరణకు గురవ్వగా, 2,898మంది పోటీలో ఉన్నారు. సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న గజ్వేల్‌లో అత్యధికంగా 114 మంది, మేడ్చల్‌లో 67 మంది, సీఎం కేసీఆర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి పోటీ పడుతున్న కామారెడ్డిలో 58 మంది, ఎల్భీనగర్‌లో 50 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. కొడంగల్‌లో 15మంది, నారాయణ పేటలో ఏడుగురు, బాల్కండలో తొమ్మిది మంది బరిలో ఉన్నారు. గజ్వేల్, కామారెడ్డిలలో అంతమంది బరిలో ఉండటం తమకు నష్టదాయకమన్న ఆలోచనతో బీఆరెస్ పార్టీ నాయకులు ఆ స్థానంల్లో రెబల్స్‌ను, ఇండిపెండెంట్‌లను నామినేషన్లను ఉపసంహరించుకోవాలని బుజ్జగిస్తున్నారు.
బుజ్జగింపుల పర్వంలో తలమునకలు
పార్టీ అభ్యర్థులకు పోటీగా నామినేషన్లు వేసిన రెబల్స్‌ను, ఇండిపెండెంట్‌లను పోటీ నుంచి తప్పించేందుకు అభ్యర్థులు, పార్టీల నాయకత్వాలు బుజ్జగింపులు చేస్తున్నాయి. అయితే వారిలో ఎంత మంది బుజ్జగింపులకు తలొగ్గి తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటారన్నది నేడు తేలిపోనుంది. వచ్చే ఎన్నికల్లో డిలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ల కారణంగా అనేక నియోజకవర్గాల భౌగోళిక స్వరూపాలు, రిజర్వేషన్లు మారనున్నాయి.
ఈ కారణంతో పాటు ఇన్నాళ్లుగా టికెట్ వస్తుందన్న ఆశతో ఎంతో ఖర్చు పెట్టుకుని నియోజకవర్గాల్లో కార్యకలాపాలు సాగించారు. తీరా తమకు టికెట్ దక్కకపోవడంతో ఇంతకాలం తాము పెట్టుకున్న ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరైందన్న ఆలోచనతో టికెట్ ఆశావహులు రెబల్స్‌గా పోటీలో ఉన్నారు. రెబెల్స్, ఇండిపెండెంట్‌లు తమ నామినేషన్లు ఉపసంహరించుకోవాలంటే వారిని అన్ని రకాలుగా ప్రసన్నం చేసుకోవాల్సి వస్తుంది. వారికి భవిష్యత్తులో తగిన పదవులిస్తామని లేదా ఇప్పటిదాకా పెట్టుకున్న ఖర్చు మేరకు ఆర్ధిక సహాయం చేస్తామంటూ పలు రకాల హామీలు ఇస్తున్నారు.
గజ్వేల్, కామారెడ్డిలో రంగంలోకి స్థానిక నాయకత్వం
గజ్వేల్‌లో 114 మంది, కామారెడ్డిలో 58మంది పోటీలో ఉండటంతో వారి సంఖ్యను తగ్గించేందుకు నామినేషన్లను వేసిన వారితో చర్చించేందుకు బీఆరెస్ అధిష్ఠానం స్థానిక నాయకత్వాన్ని రంగంలోకి దింపింది. పెద్దపల్లిలో నల్ల మనోహర్‌రెడ్డి, స్వామి వివేక్ పటేల్, మధిరలో బమ్మెర రాంమూర్తి, వైరాలో బడావత్ హరిబాబు, ములుగులో పొరిక సోమానాయక్‌లు నామినేషన్లను ఉపసంహరింపచేయడం బీఆరెస్‌కు కీలకంగా మారింది. దీంతో వారితో ఆ పార్టీ నాయకత్వం సంప్రదింపులు , బుజ్జగింపులు చేస్తున్నది.
ఇక బీజేపీలో అసిఫాబాద్‌లో కోత్నాక్ విజయ్‌కుమార్, పెద్దపల్లిలో గొట్టిముక్కల వివేక్‌రెడ్డి, కందుల సదానందం, కొలిపాక శ్రీనివాస్, బెల్లింపల్లిలో వెంకటకృష్ణ, చెన్నూరులో అందుగుల శ్రీనివాస్ నామినేషన్ దాఖలు చేశారు. సంగారెడ్డిలో రెబల్‌గా ఉన్న రాజేశ్వర్ దేశ్‌పాండేను, పటాన్ చెరులో శ్రీకాంత్, నర్సాపూర్‌లో గోపీలను నామినేషన్లు ఉపసంహరించుకోవాలని బుజ్జగిస్తున్నారు. ఇందుకు బండి సంజయ్ సహా ఆ పార్టీ ముఖ్యనేతలు చర్చలు జరుపుతున్నారు.
కాంగ్రెస్ నుంచి రెబల్స్‌ను బుజ్జగించి నామినేషన్లు ఉపసంహరింప చేసేందుకు ఆ పార్టీ తెలంగాణ ఇన్‌చార్జ్ మాణిక్‌రావు ఠాక్రే, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్ చర్చలు జరుపుతున్నారు. ఇల్లెందులో ఏకంగా ఆరుగురు.. గుగులోత్ రవినాయక్, చీమల వెంకటేశ్వర్లు, మంగీలాల్ నాయక్, రామచంద్రనాయక్, ప్రవీణ్ నాయక్, నాగమణి పోటీలో ఉన్నారు. పినపాకలో విజయ్ గాంధీ, అశ్వారావుపేటలో సున్నం నాగమణి, చొప్పదండిలో నాగశేఖర్, డోర్నకల్‌లో నెహ్రునాయక్, భూపాల్ నాయక్‌లు, పాలేరులో రామసహాయం మాధవి, నర్సాపూర్‌లో గాలి అనిల్‌కుమార్‌లు పోటీలో ఉన్నారు. పాలకుర్తిలో జంగా రాఘవరెడ్డి, సుధాకర్‌గౌడ్‌లు రెబల్‌గా పోటీలో ఉన్నారు.
బోథ్‌లో వన్నెల అశోక్, నరేశ్ జాదవ్, జుక్కల్‌లో గంగారం, బాన్సువాడలో కాసుల బాలరాజు టికెట్ ఆశించి భంగపడి రెబల్‌గా పోటీలో ఉన్నారు. అదిలాబాద్‌లో సంజీవ్‌రెడ్డి రెబల్‌గా, సూర్యాపేటలో పటేల్ రమేశ్‌రెడ్డి ఫార్వర్డ్ బ్లాక్ అభ్యర్థిగా పోటీలో ఉన్నారు. వారిని బుజ్జగించేందుకు మాణిక్ రావు ఠాక్రే సహా పార్టీ ముఖ్య నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. వారిలో కొందిరిని హైద్రాబాద్‌కు పిలిపించుకుని చర్చించగా, మరికొందరితో ఫోన్‌లో, ఇంకొందరితో తమ నాయకుల ద్వారా సంప్రదింపులు, బుజ్జగింపులతో నచ్చచెప్పే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తున్నది. మరి వీరిలో ఎంతమంది నామినేషన్లు ఉపసంహరించుకుంటారో చూడాలి.