కబ్జాల భూములను విడిపించండి.. ఉచితంతో ఆర్టీసీ మనుగడ ప్రమాదం

పాలమూరులో గత పాలకుల చేతిలో కబ్జాకు గురైన భూములను ప్రభుత్వానికి స్వాధీన పరిచే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మిథున్ రెడ్డి, వీరబ్రహ్మ చారి డిమాండ్ చేశారు

కబ్జాల భూములను విడిపించండి.. ఉచితంతో ఆర్టీసీ మనుగడ ప్రమాదం
  • ప్రకటించిన హామీలు అమలుచేయాలి
  • ఉద్యమకారులపై కేసులు ఎత్తివేయాలి
  • లేదంటే బీజేపీ ఉద్యమ బాట
  • మీడియా సమావేశంలో బీజేపీ నేత మిథున్ రెడ్డి

విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి : పాలమూరులో గత పాలకుల చేతిలో కబ్జాకు గురైన భూములను ప్రభుత్వానికి స్వాధీన పరిచే విధంగా ప్రస్తుత ఎమ్మెల్యే చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతలు మిథున్ రెడ్డి, వీరబ్రహ్మ చారి డిమాండ్ చేశారు. ఆదివారం జిల్లా బీజేపీ కార్యాలయంలో వారు మీడియా సమావేశంలో మాట్లాడారు. పాలమూరు గత పాలకుల చేతిలో నలిగిపోయిందని, భూముల కబ్జాలు, ఎదిరించినవారిపై అక్రమ కేసులు లాంటి చర్యలు చేపట్టారని వాటన్నిటికీ బ్రేకులు వేసి మంచి స్వేచ్చ యుత వాతావరణంలో ప్రజలు జీవించే విధంగా మార్పు రావాలన్నారు. కాంగ్రెస్ పాలన ప్రారంభించిన మొదటి రోజునే దివ్యాంగురాలికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ఒప్పంద ఉద్యోగం ఇచ్చి అవమానించారన్నారు.


ప్రగతి భవన్ కంచెలు తీసేసి ప్రజల సమస్యలు తీరుస్తానని ఒక్క సమస్య కూడా పరిష్కరించ లేదని, ఆర్టీసి ఇప్పటికే నష్టాల్లో ఉండగా ఉచిత హామీ వల్ల రోజు కోట్లల్లో నష్టం భరించాల్సి వస్తుందని వారు పేర్కొన్నారు. గత ఓఎస్‌డీలు ఫైళ్లు ఎత్తుకెళ్తుంటే ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. ఉద్యమ సమయంలో బనాయిoచిన కేసులతో పాటు బీఆరెస్‌ నేతలను ప్రశ్నించిన వారిపై బనాయించిన అక్రమ కేసులు కూడా ఎత్తి వేయాలని వారు డిమాండ్ చేశారు. డబుల్ బెడ్ రూముల అక్రమాల విషయంలో ప్రత్యేక అధికారిని నియమించి విచారణ చేపట్టాలన్నారు. పాలమూరులో జరిగిన అక్రమాలపై ఇక్కడి ఎమ్మెల్యే వారం రోజుల్లో విచారణ చేయకుంటే బీజేపీ పోరుబాట పట్టాల్సి వస్తుందన్నారు.


గత ప్రభుత్వం ప్రజల్ని ఇబ్బంది పెట్టడం వల్లే మార్పు కోరుకున్నారన్నారు. ఆరుగ్యారంటీలను ఎలా అమలు పరుస్తారో ప్రజలకు స్పష్టం చేయాలని, ఆర్టీసీని సంరక్షణ ఎలా చేస్తారో ప్రజలకు వివరించాలన్నారు. బీజేపీ నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఉండి తప్పు చేస్తే ఖచ్చితంగా ప్రశ్నిస్తామని, మంచి చేస్తే ప్రశంసించే గుణం మా నేతలకు ఉందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు పద్మజా రెడ్డి, పడగల బాలరాజు, జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణవర్ధన్ రెడ్డి, సత్యం, బుచ్చిరెడ్డి, అంజయ్య, ప్రవీణ్ యాదవ్,కిరణ్ కుమార్ రెడ్డి, సతీష్ కుమార్, పట్టణ అధ్యక్షులు నారాయణ యాదవ్, రాజు గౌడ్, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.