Harish Rao | డీజీపీగా పంజాబీ వ్యక్తి ఎందుకు?.. అర్హత గల తెలంగాణ బిడ్డలు లేరా?

డీజీపీగా పంజాబీ వ్యక్తి ఎందుకు? అర్హత గల తెలంగాణ బిడ్డలు లేరా? అని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు

Harish Rao | డీజీపీగా పంజాబీ వ్యక్తి ఎందుకు?.. అర్హత గల తెలంగాణ బిడ్డలు లేరా?

ఇతర రాష్ట్రాల అధికారులకు నేను వ్యతిరేకం కాదు
స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో ఏకీభవించను
ఆంక్షలతో అమలు కాని రైతు రుణమాఫీ
కేంద్రం నిధులిచ్చినా.. పంచాయతీలకు ఇవ్వని రాష్ట్ర సర్కార్‌
మీడియా ఇష్టాగోష్ఠిలో మాజీ మంత్రి టీ హరీశ్‌రావు

విధాత, హైదరాబాద్ : డీజీపీగా పంజాబీ వ్యక్తి ఎందుకు? అర్హత గల తెలంగాణ బిడ్డలు లేరా? అని మాజీ మంత్రి టీ హరీశ్‌రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సోమవారం ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ఇతర రాష్ట్రాల అధికారులకు తాను వ్యతిరేకం కాదని, కానీ గతంలో ఐఏఎస్‌, ఐపీఎస్‌ల పోస్టింగ్‌ల విషయమై బీహార్ బ్యాచ్ అని విమర్శించిన రేవంత్ రెడ్డి మాటలనే తాను గుర్తు చేస్తున్నానన్నారు. రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయని హరీశ్‌ విమర్శించారు. మొద్దు నిద్ర పోతున్న ప్రభుత్వం బీఆరెస్‌ తట్టిలేపితే గానీ లేవట్లేదన్నారు. పంచాయతీల్లో పారిశుధ్యం గురించి తాను లేవనెత్తాకే కార్మికులకు జీతాలందాయని, అయినా పంచాయతీలకు నిధులు రాలేదని విమర్శించారు. కేసీఆర్ హయాంలో ప్రతి నెల పంచాయతీలకే 275 కోట్ల రూపాయలు ఠంచన్‌గా విడుదల చేసే వాళ్ళమని చెప్పారు. మార్చి కన్నా ముందు కేంద్రం 500 కోట్లు పంచాయతీల కోసం విడుదల చేసిందని, వాటినీ రాష్ట్రం విడుదల చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. ఎన్నికలు పెట్టకపోవడం వల్ల మరో 750 కోట్లు కేంద్రం విడుదల చేయలేదని తెలిపారు. రెండు నెలల ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని, తాను నిలదీశాకే ఒక నెల పెన్షన్ చెల్లించారని, మధ్యాహ్న భోజన పథకం సిబ్బందికి జీతాలు కూడా తాము ప్రభుత్వం దృష్టికి తెచ్చాకే కొంత చలనం వచ్చిందని చెప్పుకొచ్చారు.

మ్యాచింగ్‌ గ్రాంట్లు ఇవ్వకపోవడంతో అనేక పథకాలపై ప్రభావం

కేంద్రం నుంచి నిధులు వస్తున్నా రాష్ట్రం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోవడం వల్ల అనేక పథకాలపై ప్రభావం పడిందని హరీశ్‌రావు తెలిపారు. జాతీయ ఉపాధి హామీ పథకానికి 850 కోట్లు కేంద్రం ఇచ్చినా రాష్ట్రం 350 కోట్లు విడుదల చేయలేదన్నారు. బిల్లులు రాక చిన్న కాంట్రాక్టర్లు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి కింద బిల్లులు ఇవ్వక బాత్‌రూములు కూడా తెరవని పరిస్థితి నెలకొందన్నారు. ఉపాధి హామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లకు రెండు నెలలు జీతం రాలేదని, పంచాయతీ కార్యదర్శులు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టుకున్నారని చెప్పారు. ఇపుడు బదిలీలు చేస్తున్నారు.. వారికి డబ్బులు ఎవరు ఇవ్వాలి? అని ప్రశ్నించారు. సిద్దిపేటలో అమలు చేసిన కొన్ని వినూత్న కార్యక్రమాలకు కేంద్ర ఆర్థిక సర్వేలో చోటు లభించడం సంతోష దాయకమన్నారు. స్టీల్ బ్యాంకు కాన్సెప్ట్ ను ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా ప్రస్తావించారని తెలిపారు.

సమస్యలమయంగా విద్యుత్తు శాఖ

విద్యుత్తు శాఖ తీవ్ర సంక్షోభంలో ఉందని, కరెంటు కోతలకు విచిత్ర కారణాలు చెబుతున్నారని హరీశ్‌రావు విమర్శించారు. రైతులు డీడీలు కట్టినా ట్రాన్స్‌ఫార్మర్లు ఇవ్వడం లేదని, స్తంభాలు కూడా ఇవ్వడం లేదని విమర్శించారు. స్కూళ్లకు బిల్లులు కట్టకపోవడంతో కరెంట్ కట్ చేస్తున్నారని తెలిపారు. పోలీసులకు పెట్రోల్, డీజిల్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. పోలీసులు కొంత పర్సంటేజీ ఇస్తే తప్ప బిల్లులు రావడం లేదని విమర్శించారు.

ఆంక్షలతో అందరికీ అందని రుణమాఫీ

రైతు రుణ మాఫీకి రేషన్ కార్డు లింక్ లేదని సీఎం చెప్పినా అమలు కావడం లేదని హరీశ్‌రావు విమర్శించారు. పీఎం కిసాన్ యోజనకు రైతు రుణ మాఫీకి లింక్ పెడుతున్నారని ఆరోపించారు. తమ అధ్యయనం ప్రకారం లక్ష లోపు రుణ మాఫీకి అర్హులైన 30 నుంచి 40 శాతం మందికి మాఫీ కాలేదన్నారు. పీఎం కిసాన్ యోజనలో 18 యేండ్లు దాటిన వారిని యాజమానితో సంబంధం లేకుండా లబ్ధదారుడిగా పరిగణిస్తారని, రుణమాఫీలో అలా చేయడం లేదని అన్నారు. ఆదిలాబాద్‌లోని తాంసీ మండలంలో విమల అనే మహిళకు 59 వేల అప్పు ఉంటే 3 వేలే మాఫీ అవుతున్నట్టు మెసేజ్ వచ్చిందని వివరించారు.

కంచెలు తీసేశామని కొత్త కంచెలు తెచ్చారు

కంచెలు తీసేస్తామని కొత్త కంచెలు తెచ్చారని, అసెంబ్లీ చుట్టూ కంచెలు పెంచారని హరీశ్‌రావు విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌పై రేవంత్ ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నిస్తే నిరుద్యోగుల‌పై లాఠీలు ఝళిపిస్తున్నారని ఆరోపించారు. జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లకు అత్యవసర పనుల కోసం నెలకు 40 లక్షలు ఇచ్చేవారని, అవి ఏడు నెలలుగా బంద్ అయ్యాయని తెలిపారు. చాలా డివిజన్లు చెత్త కూపాలుగా మారాయని ఆరోపించారు. వైద్య ఆరోగ్య శాఖలో డాక్టర్ల బదిలీలు అస్తవ్యస్తంగా మారాయని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమావేశం పెట్టి సమస్యలు తీరుస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారని, అవేమీ అమలు కాలేదని అన్నారు. ఐదు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయని గుర్తు చేశారు. ఐఏఎస్ సర్వీసెస్‌లో దివ్యాంగులను తీసుకోరాదన్న స్మితా సబర్వాల్ వ్యాఖ్యలతో తాను ఏకీభవించనని హరీశ్‌రావు స్పష్టం చేశారు.