రేవంత్‌ సర్కార్‌కు తోక తెల్వది.. తొండం తెల్వది: కేసీఆర్‌

ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగాయని బీఆరెస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఆయన పాలనలో ఎవరికీ ఏమీ ఒరిగింది లేదని అన్నారు

రేవంత్‌ సర్కార్‌కు తోక తెల్వది.. తొండం తెల్వది: కేసీఆర్‌

మోదీ పాలనలో ధరల మోత
ఎగుమతులు బంద్‌.. దిగుమతులు పెరిగాయి
దేశానికి వంద లక్షల కోట్లు అప్పు పెరిగింది
రాష్ట్రానికి ఏం చేశారని బీజేపీ గెలిపించాలి?

విధాత: ప్రధాని మోదీ పదేళ్ల పాలనలో దేశంలో అడ్డగోలుగా ధరలు పెరిగాయని బీఆరెస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఆరోపించారు. ఆయన పాలనలో ఎవరికీ ఏమీ ఒరిగింది లేదని అన్నారు. ఆదివారం జగిత్యాలలో నిర్వహించిన రోడ్‌షోలో కేసీఆర్‌ మాట్లాడుతూ మోదీ చెప్పిన అచ్ఛేదిన్‌ ఎక్కడని నిలదీశారు. ‘అచ్ఛే దిన్‌ రాలేదని కానీ.. సచ్చే దిన్‌ వచ్చాయని అన్నారు. అడ్డగోలుగా ధరలు పెరిగిపోయాయని చెప్పారు. డాలర్‌ విలువ పడిపోయిందని, ఎగుమతులు బంద్‌ అయ్యాయని, దిగుమతులు పెరిగాయని అన్నారు. దేశానికి వంద లక్షల కోట్ల అప్పు పెరిగిందని చెప్పారు. ఏ ఒక్క వర్గానికీ మోదీ హయాంలో న్యాయం జరుగలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీజేపీ ఎంపీలు ఏం చేశారు..?

బీఆర్‌ఎస్‌కు ఎంపీలు ఎందుకని బీజేపీ నేతలు మాట్లాడుతున్నారన్న కేసీఆర్‌.. గతంలో గెలిచిన నలుగురు బీజేపీ ఎంపీలు నాలుగు రూపాయలన్నా తెచ్చారా? అని నిలదీశారు. ‘పసుపు బోర్డు వచ్చిందా? నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ తెరిచిండా? మరి వీళ్లకు ఎందుకు ఓటు వేయాలి ?’ అని ప్రశ్నించారు. మోదీ గవర్నమెంట్‌ మొత్తం ఝూటా వాగ్దానాలేనని మండిపడ్డారు.

జగిత్యాల జిల్లా ఉండాలా? వద్దా?

రాష్ట్ర ప్రభుత్వం జగిత్యాల జిల్లాను తీసేస్తానని అంటున్నదని విమర్శించారు. జగిత్యాల జిల్లా ఉండాలా? వద్దా? అని ప్రజలను ప్రశ్నించారు. దాంతో వారంతా జిల్లా ఉండాల్సిందేనని నినదించారు. తాను అద్భుతంగా తీర్చిదిద్దిన రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నారంటూ కాంగ్రెస్‌ ప్రభుత్వం కేసీఆర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇప్పుడున్న ప్రభుత్వానికి నా తోక తెల్వది.. తొండం తెల్వది. ఏ పని సక్కగా చేయస్తలేదు’ అని ఆయన మండిపడ్డారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం చెప్పిన హామీలు అమలయ్యాయా? అని ఆయన ప్రజలను ప్రశ్నించారు. కానీ.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.. ఏ ఊరికి పోతే ఆ ఊరి దేవుడిపై ఓట్లేసి హామీలు అమలు చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేవారు. ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఉన్నదా? అని నిలదీశారు. అరచేతిలో వైకుంఠం చూపెట్టి.. అడ్డగోలు హామీలు ఇచ్చి కాంగ్రెస్‌ ప్రజలను మోసం చేసిందని తీవ్రంగా మండిపడ్డారు.