సవతి తల్లిపై పోరాడాల్సిందే: కేటీఆర్‌

తెలంగాణకు కేంద్రం నుంచి నాలుగు ప్రాజెక్టులు రావాలంటే బీజేపీ, కాంగ్రెస్‌లతో సాధ్యం కాదని, ఎందుకంటే ఆ పార్టీల రాష్ట్ర నాయకులు ఢిల్లీ గులామ్‌లని, అదే బీఆరెస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో

సవతి తల్లిపై పోరాడాల్సిందే: కేటీఆర్‌

పార్లమెంటులో తెలంగాణ గళం బీఆరెస్ గెలుపే
హైదరాబాద్‌ను యూటీ చేయాలని చూస్తున్నారు
ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను బీఆరెస్ శాసిస్తుంది
బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌

విధాత, హైదరాబాద్ : తెలంగాణకు కేంద్రం నుంచి నాలుగు ప్రాజెక్టులు రావాలంటే బీజేపీ, కాంగ్రెస్‌లతో సాధ్యం కాదని, ఎందుకంటే ఆ పార్టీల రాష్ట్ర నాయకులు ఢిల్లీ గులామ్‌లని, అదే బీఆరెస్ ఎంపీలు గెలిస్తే పార్లమెంటులో మన తెలంగాణ గళం వినబడుతుందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. గురువారం మల్కాజిగిరి పార్లమెంటు నియోజకవర్గం బీఆరెస్ ప్రచార సభలో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని సవతి తల్లిపై పోరాడాలంటే బీఆరెస్ ఎంపీలు గెలవాలని, కేంద్ర ప్ర‌భుత్వాన్ని నిల‌దీయాలంటే కేసీఆర్ సైనికులు పార్ల‌మెంట్‌లో ఉండాలని కేటీఆర్ తేల్చిచెప్పారు.

కాంగ్రెస్ , బీజేపీ ఎంపీలు.. రాహుల్ గాంధీ, మోదీ చెప్పింది చేస్తారని.. తెలంగాణ‌ గురించి ద‌మ్మున్న నాయ‌కులే కొట్లాడుతారన్నారు. జూన్ 2వ తేదీ త‌ర్వాత కేంద్ర ప్ర‌భుత్వం హైద‌రాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతం చేసి త‌న గుప్పిట్లో పెట్టుకోవాల‌ని ఆలోచ‌న చేస్తున్న‌దని, కేంద్ర పాలిత ప్రాంతం అయితే.. హైద‌రాబాద్ అభివృద్ధి ఆగిపోతుందని, ఒక్క చిన్న ప‌ని కూడా చేసుకునేందుకు అవ‌కాశం ఉండ‌దని ఆరోపించారు. మోరీ, నాలా నిర్మించాల‌న్నా, రోడ్డు వేయాల‌న్నా ఢిల్లీకి పోయి అడ‌గాలని, కేంద్ర పాలిత ప్రాంతం ప్ర‌తిపాద‌న‌ను అడ్డుకోవాలంటే గులాంబీ జెండా పార్ల‌మెంట్‌లో ఎగ‌రాలని, రాగిడి ల‌క్ష్మారెడ్డి గెల‌వాల‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు.

ఆరు గ్యారంటీలకు కేటీఆర్ కొత్త నిర్వచనం

కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అంటే.. ఇన్వ‌ర్ట‌ర్, జ‌న‌రేట‌ర్, క్యాండిల్ లైట్, టార్చ్ లైట్, ప‌వ‌ర్ బ్యాంక్, ఛార్జింగ్ బ‌ల్బ్ అని కేటీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ ఉన్నంత‌కాలం క‌రెంట్ ఉండ‌దని, పార్ల‌మెంట్ ఎన్నిక‌లు రాగానే.. బీఆరెస్‌కు ఎందుకు ఓటేయాల‌ని అడుగుతున్నారని, 2004లో ఐదుగురు ఎంపీలు బీఆరెస్ ఎంపీలు గెలిస్తే కేసీఆర్ ఢిల్లీకి పోయి 32 పార్టీల‌కు చెందిన‌ 272 మంది ఎంపీల‌ను ఒప్పించి, 2014లో కేసీఆర్ తెలంగాణ‌ను సాధించారని కేటీఆర్ తెలిపారు.

కాంగ్రెస్ ప్రభుత్వాలను గతంలో బీజేపీ పడగొట్టిందని.. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూడా పడగొట్టాలని చూశారని మండిపడ్డారు. ఎమ్మెల్యేలను కొని ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు బీజేపీ నేతలు యత్నించారన్నారు. కానీ తెలంగాణలో బీజేపీ ఆటలు సాగలేదన్నారు. రాష్ట్రాల్లో ప్రాంతీయ శక్తులు బలంగా ఉండాలన్నారు. ఆరు నెలల్లో రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి బీఆరెస్‌కు వస్తుందన్నారు. రిజర్వేషన్లు రద్దు చేయాలని, రాజ్యాంగాన్ని మార్చాలని మోదీ ప్రభుత్వం కుట్ర చేస్తుందని, మోదీతో పోరాటం రాహుల్ గాంధీ వల్ల కాదని కేటీఆర్ తేల్చిచెప్పారు.

టెంపోలలో డబ్బులు పంపిస్తుంటే ఈడీ, ఐటీలు ఏం చేస్తున్నాయి ట్వీట్‌లో కేటీఆర్

అదానీ, అంబానీలు కాంగ్రెస్‌ పార్టీకి టెంపోల నిండా డబ్బు పంపుతుంటే ప్రధాని మోదీకి అత్యంత ఇష్టమైన ఈడీ, సీబీఐ, ఐటీ ఎందుకు మౌనంగా ఉన్నాయంటూ కేటీఆర్ ట్విటర్ వేదికగా నిలదీశారు. వేములవాడలో నిర్వహించిన బీజేపీ ఎన్నికల సభలో ప్రధాని మోదీ తన ప్రసంగంలో గడచిన ఐదేండ్లుగా అదానీ, అంబానీలపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌.. ఎన్నికల ప్రక్రియ మొదలు కాగానే ఎందుకు మౌనం దాల్చిందో స్పష్టం చేయాలని, అదానీ, అంబానీ నుంచి ఎన్ని టెంపో లోడ్ల ధనం ముట్టింది..? ఏం ఒప్పందం కుదిరింది..? రాత్రికి రాత్రే అంబానీ, అదానీలపై ఆరోపణలు ఆగిపోయాయి’ అని ప్రశ్నించారు. అదేవిధంగా నోట్ల రద్దు విఫల ప్రయత్నమని ప్రధాని మోదీ భావిస్తున్నారా అంటూ ప్రశ్నించారు.