KTR | ప్రకటనలే తప్ప.. నిధులు ఇవ్వలేదు: కిషన్ రెడ్డిపై కేటీఆర్ ఫైర్
వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 10లక్షల కోట్ల నిధులు కేటాయించిందంటూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు

విధాత: వరంగల్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 10లక్షల కోట్ల నిధులు కేటాయించిందంటూ కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు కేటీఆర్ ఆదివారం ట్విట్టర్ వేదికగా కౌంటర్ ఇచ్చారు. ఒక్క వరంగల్ జిల్లాకు రూ.10 లక్షల కోట్లు ఇచ్చారా అని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి ప్రకటన ఉత్తుత్తి 20 లక్షల కోట్లు.. ఉద్దీపన ప్యాకేజీల మాదిరిగానే ఉందని, ప్రధాని ప్రకటన తప్ప..ప్రజలకు ఒక్క పైస రాలేదని ధ్వజమెత్తారు.
శనివారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా హన్మకొండలో కిషన్‌రెడ్డి మాట్లాడుతూ వరంగల్ అభివృద్ధికి 10లక్షల కోట్లు కేటాయించి పాటుపడినట్లుగా చెప్పారు. దేశంలో 7 మెగా టెక్స్ టైల్స్ ఉంటే అందులో ఒకటి వరంగల్ కు తీసుకువచ్చామని చెప్పారు. అలాగే రైల్వే వ్యాగన్ కు శంకుస్థాపన చేసుకుని పనులను వేగవంతంగా చేసుకుంటున్నట్లు తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో మొట్టమొదటి సారిగా రామప్పకు యునెస్కో గుర్తింపు రావడానికి మోదీ కృషి చేశారని, వెయి స్తంభాల గుడి కల్యాణ మండపం పనులు పునరుద్ధరించామని చెప్పుకొచ్చారు.