KTR | గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థిని గెలిపించండి: కేటీఆర్

నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం’ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆరెస్‌ అభ్యర్థినే గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కోరారు

KTR | గ్రాడ్యుయేట్ ఉప ఎన్నికల్లో బీఆరెస్ అభ్యర్థిని గెలిపించండి: కేటీఆర్

భువనగిరిలో గ్రాడ్యుయేట్‌ల సమావేశంలో కేటీఆర్ పిలుపు

విధాత: నల్లగొండ-వరంగల్‌-ఖమ్మం’ గ్రాడ్యుయేట్‌ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆరెస్‌ అభ్యర్థినే గెలిపించాలని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ కోరారు. ఆదివారం భువనగిరిలో జరిగిన గ్రాడ్యుయేట్‌ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఎన్నికల్లో గెలుపు మనదేనని, ఓటర్లు ఆలోచించి ఓటయ్యాలని కోరారు. ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అన్నిసార్లూ గులాబీ పార్టీయే గెలుస్తూ వస్తున్నదని గుర్తు చేశారు. బీఆరెస్‌ అభ్యర్థి రాకేష్ రెడ్డి స్వయంకృషితో పైకి వచ్చాడని, ఉన్నత విద్యావంతుడని చెప్పారు. ప్రశ్నించే గొంతుక, ధిక్కార స్వరం అయిన రాకేష్ రెడ్డిని గెలిపించాలని ఈ సందర్భంగా కేటీఆర్‌ కోరారు. మా పాలనలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేశామని కేటీఆర్‌ తెలిపారు.

మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రుణమాఫీపై పూటకో మాట మారుస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్‌ పార్టీ 420 హామీలను ఇచ్చి అన్నింటిని మర్చిపోయిందని, ఇవాళ తెలంగాణ ఆగమైందన్నారు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్‌ 30 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తే.. వాటి జాయినింగ్‌ లెటర్లు పంచుతూ సీఎం రేవంత్ రెడ్డి సొంత డబ్బా కొట్టుకుంటున్నాడని ఎద్దేవా చేశారు. రేవంత్‌రెడ్డివి హామీలు, మాటలన్ని పచ్చి అబద్ధాలని మండిపడ్డారు. మన అభ్యర్థి రాకేష్ రెడ్డి విద్యావంతుడని, కాంగ్రెస్ ప్రత్యర్థి పచ్చి బ్లాక్ మెయిలర్‌ అని, సొల్లు కబుర్లు కట్టుకథలు చెప్పే మోసగాడని విమర్శించారు. ప్రధాని మోదీ అన్ని వర్గాలను మోసం చేస్తూ వస్తున్నడని, విభజన హామీలను తుంగలో తొక్కారని విమర్శించారు.

రామాలయం నిర్మాణంతో మోదీ ఓట్లు అడుగతున్నాడని, అలాగైతే మన కేటీఆర్‌ కూడా యాదాద్రి ఆలయం అద్భుతంగా కట్టారని కేటీఆర్ పేర్కోన్నారు. బీజేపీ వాళ్ళు గుడికట్టి ఓట్లడుగుతున్నారని, కాళేశ్వరం లాంటి ఆధునిక ఆలయాన్ని కూడా కేసీఆర్ కట్టారని, ఆయన పాలనలో తెలంగాణ అన్ని రంగాల్లో నంబర్ 1 స్థానంలో నిలిచిందని చెప్పారు. ఉమ్మడి నల్లగొండలో మూడు మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశామని, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మించామని గుర్తుచేశారు. చేసిన పని సరిగా చెప్పుకోలేక పోయామని, అందుకే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలయ్యామన్నారు. తిరిగి పార్లమెంటు ఎన్నికల్లో పుంజుకున్నామని, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయంతో తిరిగి తెలంగాణ ఇంటి పార్టీ బీఆరెస్ సగర్వంగా నిలబడుతుందన్నారు.