కాంగ్రెస్ పార్టీది దుర్మార్గమైన సంస్కృతి: సీఎం కేసీఆర్

ఈ రాష్ట్రంలో పదేండ్ల నుంచి బీఆర్ఎస్ పరిపాలన ఉందని కేసీఆర్ తెలిపారు. ఈ పదేండ్లలో కర్ఫ్యూ లేదు.. మతకల్లోలం లేదు. గడిబిడి లేదు. చాలా శాంతియుతంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నాం. కాంగ్రెస్ పార్టీ నాయకులు కత్తులు పట్టి దాడులు చేస్తున్నారు. మొన్న దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై కత్తితో పొడిచారు. దేవుడి దయ వల్ల ప్రాణపాయం తప్పింది. పేగు కట్ చేస్తే బతికి బయటపడ్డడు. కాంగ్రెస్ పార్టీది ఇంత దుర్మార్గమైన సంస్కృతి.
ఇవాళ కొంత మంది నాయకులు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు.. ఆ నాయకుల గురించి దళిత సమాజం ఆలోచించాలి. దళిత జాతి బాగా అణిచివేయబడింది. అణగదొక్కబడింది. అంటరానితనం అనే వివక్షకు గురైంది తరతరాలు యుగయుగాలుగా. ఆనాడే నెహ్రూ ఈ స్కీంను ప్రారంభిస్తే ఈనాడు దళితుల పరిస్థితి ఇలా ఉండేదా..? ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. దళితులకు ఏం చేయలేదు.
దేశంలోనే తొలిసారిగా.. దళితబంధు స్కీం పుట్టించిందే బీఆర్ఎస్ పార్టీ. దఫాదఫాలుగా దళిత సమాజాన్ని ఉద్ధరించాలని ముందుకు పోతున్నాం. పాత ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనులకు పోడు పట్టాలు ఇచ్చాం. గిరిజనులపై ఉన్న పాత కేసులు ఎత్తేశాం. రైతుబంధు కూడా అందించాం. రైతుబీమా ఏర్పాటు చేశాం. త్రీ ఫేజ్ కంరెట్ ఇస్తున్నాం. అదే విధంగా రాష్ట్రాన్ని సామరస్యంగా, శాంతియుతంగా ముందకు తీసుకుపోతున్నాం.
నిర్మల్ నియోజకవర్గంలో మైనర్ ఇరిగేషన్ చెరువులు, చెక్ డ్యాంలు వచ్చాయి. వరద నివారణ చర్యలు ఎలా జరుగుతున్నాయో మీ అందరికీ తెలుసు. స్వర్ణ ప్రాజెక్టు లైనింగ్ తప్పకుండా చేపట్టి రైతులకు లాభం చేస్తాం. సబ్ మర్జ్‌డ్ గ్రామాలకు లిఫ్ట్ కావాలని అడిగారు మంజూరు చేయిస్తాను. మంచి పద్ధతుల్లో సామరస్యంగా, శాంతియుతంగా, అన్ని వర్గాల ప్రజలను కాపాడుకుంటున్నాం.
కొత్త మేనిఫెస్టో మీ ముందు పెట్టాం. మూడు కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిస్తుంది ఈ తెలంగాణ. ఇంకొన్ని ప్రాజెక్టులు పూర్తయితే 4 కోట్లు దాటుతుంది. పంజాబ్‌ను దాటేసి పోతాం. ఈ తరుణంలో వాస్తవాలు, నిజాలు తేల్చి కచ్చితంగా న్యాయం, ధర్మం వైపు నడిస్తే ఎన్నికల్లో మీరు గెలుస్తరు అభ్యర్థుల కంటే ఎక్కువగా, అప్పుడే మీకు లాభం జరుగుతది.
రైతుబంధుపై ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఎన్నో రకాలుగా మాట్లాడుతుంది. రైతుబంధు పుట్టించిందే కేసీఆర్. రైతులు అంతకుముందు ఏడ్చారు. లంచాలు ఇచ్చి ట్రాన్స్‌ఫార్మర్లు రిపేర్ చేయించుకున్న పరిస్థితి. ఇప్పుడు కరెంట్‌ను ఇచ్చుకున్నాం. నిర్మల్ నియోజకవర్గంలో 15 సబ్ స్టేషన్లు నిర్మించుకున్నారు. వందలాది ట్రాన్స్‌ఫార్మర్లు తెచ్చుకున్నారు. 24 గంటల కరెంట్‌తో పంటలు పండించుకుంటున్నారు.
తెలంగాణ రాక ముందు కరువులతో, వలసలతో సాగు,తాగునీటి గోసలతో చెట్టుకు గుట్టకు ఒకరయ్యాం. గ్రామాలు పచ్చబడాలంటే ఏం చేయాలని ఆలోచించి, వ్యవసాయాన్ని స్థీరికరించాలని నిర్ణయించాం. రైతుబంధు అనేది ఎలక్షన్ల కోసం పెట్టింది కాదు. నన్నెవరూ అడగలేదు. దరఖాస్తు పెట్టలేదు. ఎవరూ ధర్నా చేయలేదు. మా అంతట మేం ఆలోచించి ఆ స్కీం తెచ్చాం.
నీటితిరువా రద్దు చేశాం. నీళ్లు, కరెంట్ ఉచితంగా ఇస్తున్నాం. రైతబంధు పెట్టుబడి కింద ఇస్తున్నాం. రైతులు పండించిన పంటను కొంటున్నాం నష్టం వచ్చినా కూడా. ఈ కార్యక్రమాల ద్వారా రైతుల ముఖాలు కళకళలాడుతున్నాయి. రైతుల రుణమాఫీ కూడా చేశాం. కొంతమందికి కావాల్సి ఉంది. కాంగ్రెసోళ్లు పిటిషన్ వేశారు. ఎన్నికలు ముగిసిన మర్నాడే ఇచ్చేస్తాం. ఎన్నికల కమిషన్ పర్మిషన్ ఇచ్చేస్తే వారం పది రోజుల్లో వచ్చేస్తది.
వ్యవసాయ స్థీరికరణ కోసం రైతుబంధు తెస్తే.. కేసీఆర్ పనిలేక దుబారా చేస్తున్నాడని కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారు. కేసీఆర్ బిచ్చమేస్తుండు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. రైతులు బిచ్చగాళ్ల లాగా కనబడుతున్నారా..? రైతులు పండించే పంట ఎంత..? అందులో ఆయన తినేది ఎంత..? మిగతాది అంతా దేశానికే కదా ఇచ్చేది. ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ బియ్యం పోతాయి కదా.
కరెంట్ 24 గంటలు అవసరం లేదు.. 3 గంటలు చాలని రేవంత్ రెడ్డి అంటున్నడు. ధరణి పోర్టల్ తెచ్చాం. ఎవరి కోసం, దేని కోసం తెచ్చాం. రైతుల భూములు క్షేమంగా బ్రహ్మాండంగా ఉన్నాయి. నిశ్చితంగా ఉన్నారు రైతులు. ధరణి రాకముందు వీఆర్వో నుంచి సీసీఎల్ఏ దాకా రైతుల మీద పెత్తనం. ధరణి పోర్టల్ ఉంది కాబట్టి రైతుబంధు డబ్బులు నేరుగా వస్తున్నాయి.
అదే విధంగా ధాన్యం అమ్మితే.. పైసలు నేరుగా మీ బ్యాంకులో పడుతున్నాయి. రైతుబీమా కూడా 10 రోజుల్లో జమ అవుతుంది. మరి ధరణి తీసేస్తే ఇవన్నీ ఎలా వస్తాయి. ఇప్పటిలాగా వస్తాయా..? మళ్లీ పహాని నఖలు, వీఆర్వోలు, ఎమ్మార్వో కార్యాలయాల చుట్టు తిరుగుడు. మళ్లీ పైరవీకారుల మందలు.. రైతుబంధు వస్తే నీ పేరు రాయాలంటే పంచ్ అజర్ లావో అంటడు. మళ్లీ పాతక కథనే రావాల్నా.. దళారీల రాజ్యమే రావాల్నా..?.
ధరణి ఉండాలని, 24 గంటల కరెంట్ కావాలని ప్రజలు అంటున్నారు. పార్టీల చరిత్ర, నడవడి గురించి మీరు ఆలోచించాలి. గిరిజన బిడ్డలు ఉన్నారు. మా తండాలో మా రాజ్యం రావాలని కొట్లాడారు. ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. పట్టించుకోలేదు. కానీ మా గవర్నమెంట్‌లో ఆదివాసీ గూడెలను, గిరిజన తండాలను గ్రామపంచాయతీలుగా మార్చాం. అభివృద్ధి చేసుకుంటున్నారు. పోడు పట్టాలు ఇచ్చాం. అలవోకగా, తమాషాగా ఓటు వేయొద్దు.. ఆలోచన చేయాలి, చర్చ చేయాలి. ఎవరు గెలిస్తే లాభమో ఆలోచించాలి.
పొరపాటు కాంగ్రెస్ గెలిస్తే.. నేను తెలంగాణ బిడ్డగా చెప్తున్నా.. మీకు చెప్పే బాధ్యత ఉంది కాబట్టి చెప్తున్నాను. వాళ్లకు రైతుబంధు మీద ఇష్టం లేదు. కరెంట్ ఇచ్చుడు ఇస్టం లేదు. రైతుల ఖాతాలో డైరెక్ట్‌గా డబ్బులు వేసుడు ఇష్టం లేదు. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తారు. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతది. జాగ్రత్తా అని మనవి చేస్తున్నా. ఈ అభివృద్ది కొనసాగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలిస్తేనే ఈ అభివృద్ది నిలకడగా ముందుకు పోతది.
ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి. తెలంగాణ వచ్చిన తర్వాత మూడోసారి రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎలక్షన్లు వస్తాయి పోతాయి.. ఎన్నికలు అన్నప్పుడు అన్ని పార్టీల అభ్యర్థులు పోటీ చేస్తారు. అందర్నీ ఒకటే ప్రార్థిస్తున్నాను. 75 ఏండ్ల స్వతంత్ర దేశంలో ఇప్పటికి ప్రజాస్వామ్య పరిణితి రాలేదు. ఏ దేశాల్లో అయితే అది వచ్చిందో ఆ దేశాలు ముందుకు దూసుకుపోతున్నాయి. ఎన్నో రెట్లు ముందు ఉన్నాయి.
నేను చెప్పే మాటలను గ్రామాల్లో, బస్తీల్లో చర్చ పెట్టాలి. కారణం ఏందంటే.. ఎలక్షన్లు వచ్చాయి. రెండో మూడో నాలుగో పార్టీలు పోటీ చేస్తాయి. ఇంద్రకరణ్ రెడ్డి లాగా ఇతర పార్టీల నుంచి కూడా ఎవరో ఒకరు పోటీలో ఉంటారు. 30న ఓట్లు వేస్తారు. 3న లెక్క తీస్తారు. ఎవరో ఒకరు గెలుస్తరు. ప్రజాస్వామ్య దేశంలో పార్లమెంటరీ డెమోక్రసీలో ప్రజలకు ఒక వజ్రాయుధం ఓటు. మీ ఓటు మీ తలరాతను లిఖిస్తది వచ్చే ఐదేండ్లు. పార్టీల అభ్యర్థలు మంచి చెడు తెలుసుకోవాలి. అభ్యర్థులు గెవడంతో ప్రభుత్వం ఏర్పడతుంది.
ఏ ప్రభుత్వం ఏర్పడితే లాభమేనేది చర్చ జరగాలి. ప్రతి పార్టీ చరిత్ర చూడాలి. ఆయా పార్టీల హాయాంలో ఏం జరిగిందో ఆలోచించాలి. ఎన్నికలు రాగానే ఆగమాగం కావొద్దు.. పార్టీ వైఖరి తెలుసుకోవాలి. ఏ పార్టీ ప్రజల గురించి ఆలోచిస్తది.. నడవడి ఎట్ల ఉన్నది అనేది గమనించాలి. అప్పుడు ఎన్నికల్లో ప్రజలు గెలుస్తరు. ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలుస్తే మీ కోరికలు నెరవేరుతాయి.
బీఆర్ఎస్ పుట్టిందే ప్రజల కోసం, హక్కుల కోసం, నీళ్లు, నిధులు, నియామకాల కోసం. తెలంగాణ ప్రజలకు ఎట్టి పరిస్థితుల్లో నష్టం రాకుండా ఉండాలని ఆలోచించే కాపాలదారే బీఆర్ఎస్. ప్రజల హక్కుల కోసం 15 ఏండ్లు నిర్విరామంగా పోరాడి, చివరకు చావు నోట్లో తలకాయపెట్టి సాధించుకున్నాం. రెండు సార్లు బీఆర్ఎస్‌ను ఆశీర్వదించారు. తెలంగాణ రాకపోతే నిర్మల్ జిల్లా అయ్యేదా..? ఇవన్నీ ఆలోచించాలి. నిర్మల్ జిల్లాను చేయించింది ఇంద్రకరణ్ రెడ్డినే. ఆదిలాబాద్ జిల్లాలో ఏం చేద్దాం ఎన్ని జిల్లాలు చేద్దామని ఆలోచించాం.
ఆదిలాబాద్‌తో పాటు మంచిర్యాల చేయాలని నిర్ణయించాం. ఇంద్రకరణ్ రెడ్డి మళ్లీ గంట తర్వాత వచ్చారు. బాసర నుంచి ఆదిలాబాద్, బెజ్జూరు నుంచి ఆదిలాబాద్ రావాలంటే చాలా సమయం పడుతది. కాబట్టి నాలుగు జిల్లాలు చేయాలని అడిగారు. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లాలు కావాలని గంటసేపు వాదించారు. ఈ నాలుగు జిల్లాలు చేసిందే ఇంద్రకరణ్ రెడ్డినే. ఆసిఫాబాద్, మంచిర్యాల జిల్లా ప్రజలు చేయెత్తి దండం పెడుతున్నారు.
నాలుగు మెడికల్ కాలేజీలు వచ్చాయి. ఇవాళ ఇంజినీరింగ్ కాలేజీ కావాలని అడిగారు. తను పుట్టిన ప్రాంతం మీద ప్రేమ ఉంది కాబట్టి.. ఒకదాని తర్వాత ఒకటి అడుగుతున్నాడు ఇంద్రకరణ్ రెడ్డి. ఈ సభతో ఇంద్రకరణ్ రెడ్డి గెలిచిండని తెలిసిపోయింది. ప్రజల కోసం తండ్లాడే వ్యక్తి. నిర్మల్ చాలా అభివృద్ధి జరిగింది. ఇంజినీరింగ్ కాలేజీ పెద్ద విషయం కాదు.. ఇంద్రకరణ్ రెడ్డి మెజార్టీ 70 వేలు దాటాలి.. కచ్చితంగా జేఎన్టీయూ నుంచి ఇంజినీరింగ్ కాలేజీ ఇప్పించే బాధ్యత నాది.