మన తరఫున యుద్ధం చేసేవాళ్లకే కత్తి ఇవ్వాలి: సీఎం కేసీఆర్
కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే నడుస్తదా? మనపరంగా ఎవరైతే ఉండి యుద్ధం చేస్తరో వాళ్ల చేతిలోనే కత్తిపెడితే కథ నడుస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు

- ఓటొకరికి వేసి యుద్ధమొకర్ని చేయమంటే ఎలా?
- ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
విధాత, ఉమ్మడి ఆదిలాబాద్ ప్రతినిధి: కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే నడుస్తదా? మనపరంగా ఎవరైతే ఉండి యుద్ధం చేస్తరో వాళ్ల చేతిలోనే కత్తిపెడితే కథ నడుస్తుంది’ అని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. గురువారం ఆదిలాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే..
‘ఇది ఆదిలాబాద్ పట్టణం. గ్రామాలు కలిసిన నియోజకవర్గం. చైతన్యం ఎక్కువ ఉండే నియోజకవర్గం. దేశంలో ఇంకా ప్రజాస్వామ్యంలో రావాల్సిన పరిణితి రాలేదు. ఏ దేశంలో అయితే వచ్చిందో ఆ దేశాలన్నీ ముందుకుపోతున్నయ్. ఎలక్షన్లు చాలాసార్లు వస్తయ్ పోతయ్. ప్రజాస్వామ్యంలో ప్రజల దగ్గరుండే ఒకే ఒక ఆయుధం ఓటు. ఆ ఓటును జాగ్రత్తగా వినియోగించాలి.’
‘ఓటు సంవత్సరాల తలరాతను మారుస్తుంది. ఎన్నికల్లో అభ్యర్థుల గురించి ఆలోచన చేయాలి. దానికంటే ముఖ్యంగా అభ్యర్థి వెనుక ఉన్న పార్టీల చరిత్ర, వైఖరి, ఎలా ఆలోచిస్తరు ? ఎవరికి మేలు చేస్తరు ? ప్రజలు, రైతుల గురించి ఏం ఆలోచన ఉంటది? ఆ పార్టీల చరిత్రను కూడా చూడాలని కోరుతున్నా. అలా ఆలోచించి ఓటు వేస్తే ప్రజలు గెలుస్తరు. ప్రజల గెలుపే నిజమైన ప్రజాస్వామ్యం. బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ ప్రజల కోసం. తెలంగాణ రాష్ట్రం కోసం. చావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ సాధించుకున్నాం. మీరు ఇచ్చిన ఆశీర్వాదంతో గత పది సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రభుత్వం నడుస్తున్నది. తెలంగాణ ఏర్పడిన సమయంలో చాలా సమస్యలున్నయ్. కరెంటు లేదు. నీళ్లు లేవు. వలసలు, రైతులు, చేనేత కార్మికుల ఆత్మహత్యలు ఉండే. వాటన్నింటిపై మధనం చేసి ఆలోచన చేసుకొని ఓ పంథాతో ముందుకెళ్లాం’ .
‘తెలంగాణ వచ్చాక మొదట పేదల సంక్షేమాన్ని చాలా ముఖ్యంగా తీసుకున్నాం. ఓ పాలసీ ప్రకారం అనేక కార్యక్రమాలు తీసుకున్నాం. రైతులు బాగుపడాలని, వ్యవసాయ స్థిరీకరణ తీసుకొని చాలా మంచి పాలసీలు పెట్టుకున్నాం. ఇందులో భాగంగానే నీటి తీరువా రద్దు చేశాం. 24గంటలు నాణ్యమైన ఉచిత కరెంటు ఇస్తున్నాం. పెట్టుబడి సమకూరుస్తున్నాం. రైతులు పండించిన పంటలను కొంటున్నాం. అదేవిధంగా రైతుచనిపోతే వాళ్ల ఇంటికి రైతుబీమా వచ్చే విధంగా చేశాం. తెలంగాణ గురించి తెలుసు కాబట్టి.. నేను కూడా ఒక రైతును కాబట్టి.. రైతు బాధ తెలుసుకాబట్టి.. ఎలాగైతే తెలంగాణ వ్యవసాయం లేతస్తో ఆలోచించి నిర్ణయం చేశాం’ .
‘ఈ రోజు మాజీ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతున్నడు. కేసీఆర్‌కు ఏం పని లేదు. ప్రజలు కట్టిన పన్నులన్నీ దుబారా చేస్తున్నడని మాట్లాడుతున్నడు. రైతుబంధు వేస్టా? రైతుబంధు ఉండాలంటే ఆదిలాబాద్‌లో జోగు రామన్న గెలవాలి. ఎకరానికి రూ.10వేలు వచ్చే రైతుబంధు రూ.16వేలు అవుతుంది.
‘పీసీసీ అధ్యక్షుడు 24గంటల కరెంటు కూడా వేస్ట్ అంటున్నడు. మూడు గంటలు ఇస్తే సరిపోతుంది అంటున్నడు. మరి మూడు గంటల కరెంటు సరిపోతుందా? 24 గంటల కరెంటు కావాలంటే జోగురామన్ననే గెలవాలి. ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలుస్తడో హైదరాబాద్‌లో ఆ ప్రభుత్వం వస్తుంది. మరి ఓటు ఇంకొకలకు వేసి పని ఇంకొగొలను చేయమంటే చేయరు. ఓటు వేరేవారికి వేసి జోగురామన్నను పని చేయమంటే ఎట్ల చేస్తడు? కత్తి ఒకరికి ఇచ్చి యుద్ధం ఇంకొకరిని చేయమంటే నడుస్తది. మనపరంగా ఎవరైతే ఉండి యుద్ధం చేస్తరో వాళ్ల చేతిలోనే కత్తిపెడితే కథ నడుస్తుంది’.
‘మేం రైతుల భూములు కిందిమీద కావొద్దని.. ఒకరిపై మీదున్న భూమి ఇంకొకరి పేరుమీదకు మారొద్దని.. పైరవీకారులు, దళారీలు, లంచగొండి ఆఫీసర్లు మార్చొద్దని ధరణిని తీసుకువచ్చాం. ధరణితో మీకు చాలా అధికారం వచ్చింది. ఇంతకుముందు బతుకువీఆర్వో, గిర్దావర్, ఎమ్మార్వో, ఆర్డీవో, జాయింట్ కలెక్టర్ ఎంతో మంది చేతిలో ఉండేది. ప్రభుత్వం తన దగ్గర ఉన్న అధికారాన్ని మీకు అప్పగించింది. మీ బొటనవేలు పెడితే మీ భూ యాజమాన్యం మారుతుంది. లేకపోతే మీ భూమిని మార్చే శక్తి ముఖ్యమంత్రికి కూడా లేదు. మరి ఆ అధికారాన్ని ఉంచుకుంటరా ? పోగొట్టుకుంటరా ? ఆలోచించాలి. ధరణిని తీసివేస్తే రైతుబంధు ఎలా వస్తుంది. ఇది చాలా ప్రమాదం. ఈ దుర్మార్గులు వచ్చి ధరణిని తీసివేస్తే మళ్లీ మొదటికిపోది. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్లయితది. మంది మాట పట్టుకొని మార్మానం పోతే.. మళ్లచ్చే వరకు ఇల్లు గాలిపోయిందని పెద్దలు చెప్పారు’.
పీసీసీ అధ్యక్షుడు ఇంకోటి చెబుతున్నడు. మూడు గంటల కరెంటు సరిపోతుందట. మరి మూడుగంటల కరెంటు సరిపోతదా? 24 గంటల కరెంటు కావాలంటే బీఆర్ఎస్ రావాలి. మూడు గంటలకే పొలం పారుతుంది.. 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోవాలట? మరి టెన్ హెచ్‌పీ ఎవడు కొనివ్వాలే. మరి వీని అయ్యకొనిస్తడా? రైతుల దాకా టెన్ హెచ్‌పీ ఉంటదా? తెలంగాణలో ఒకటి కాదు రెండు కాదు 30లక్షల పంపుసెట్లు ఉన్నయ్. ఏందీ ఈ మాటలు. పెద్ద ప్రమాదం ఉన్నది. మేం బాజాప్త చెప్పినం. అయినా మాకే ఓటు వేశారు.. తీసి అవతల పడేస్తమ్ అంటరు అప్పుడు నేను కూడా ఏం చేయలేను. అందుకే ఆలోచించాలి. 15 ఏళ్లు కాంగ్రెస్ తిప్పలు పెడితే చచ్చుడో బతుకుడో అని దీక్షపట్టి సావునోట్లో తలకాయపెట్టి తెలంగాణ తీసుకువచ్చాను. తెచ్చిన తెలంగాణను పేదనుసాదను.. చిన్నాపెద్ద అందరినీ కలుపుకొని కుల, మతాలు లేకుండా మంచిగా తెలంగానను ఒక దరికి తెస్తున్నాం’ .
50 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ లోయర్ పెన్‌గంగా అని ఊరించారు. ప్రతి ఎలక్షన్లో ప్రామిస్ చేసుడే. ఒకే ఒక్కడు జోగురామన్న తన మాట నెలబెట్టుకొని చనకా కొరటా బ్యారేజీని పూర్తి చేయించాడు. ఆదిలాబాద్ చరిత్రలో ఎవరూ చేయలేదు. జోగు రామన్న ఒక్కడే నా వెంబడి పడి.. నన్ను కూడా పెన్‌గంగ కాడికి తీసుకువచ్చి చనకా కొరటా చేయిస్తున్నడు. దాదాపు పంపుహౌస్‌లు, కాలువలు పూర్తయ్యాయి. డిస్ట్రిబ్యూటరీ కాలువలు తవ్వుకుంటున్నాం. మంచిగా 50-51వేల ఎకరాలకు నీళ్లు వస్తయ్. చనకా కొరటా కాలువ నుంచే పిప్పల్‌కోట్ రిజర్వాయర్‌కు లింక్ ఇచ్చుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది’ .
‘కాంగ్రెస్ జమానలో 8వేల ఎకరాలు పారలే. జోగు రామన్న వచ్చి కాలువలను రిపేర్ చేయిస్తే చివరిదాకా నీళ్లు అందుతున్నయ్. కాంగ్రెస్ పట్టించుకోని వాటిన్నంటిని బీఆర్ఎస్ చక్కదిద్దింది. చెడగొట్టినవన్నీ మంచిగ చేస్తున్నది. కాంగ్రెస్ జమానలో కరెంటు లేదు. తెల్లందాక కొద్దిగా.. పొద్దందాక కొద్దిగా.. లోవోల్టేజీ.. మోటలు కాలడం అనేక బాధలు ఉండేది. జోగు రామన్న ఉత్తమమైన వ్యక్తి. సామాన్యమైన వ్యక్తి. ఎమ్మెల్యే అంటే పకర్ లేదు. పొద్దంతా ఆయన ఇంటినిండా జనం జాతరలే ఉంటది. అద్భుతంగా ప్రజల్లో కలిసుండే వ్యక్తి. జోగురామన్నను మెజారిటీతో గెలిపించాలి. ఆయన ఆదిలాబాద్‌కు చాలా తీసుకువచ్చాడు. సార్ మా జిల్లాలో ఇంజినీరింగ్ కాలేదని నాతో కొట్లాడి ఇంజినీరింగ్ కాలేజీ తెచ్చాడు. అగ్రికల్ కాలేజీ, పాలిటెక్నికల్ కాలేజీ తెచ్చిండు. ఆదిలాబాద్ అభివృద్ధి కావాలంటే జోగు రామన్నతో అయితది ఇంకెవడితో కాదు’.
‘బీజేపీ భారతదేశంలో 150 మెడికల్ కాలేజీలు పెడితే తెలంగాణకు ఒక్కటీ ఇవ్వలేదు. నవోదయ విద్యాలయాలు జిల్లాకోటి ఇవ్వాలని చట్టం ఉన్నా ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కాలేజీ, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటుకూడా బీజేపీకి ఎందుకు వేయాలి? ఇవాళ బీజేపీకి ఓటువేస్తే మోరీలపరేసినట్లే అవుతుంది. వేస్ట్ తప్పా మనకు పనికివచ్చే గవర్నమెంట్ కాదు. ఈ రోజు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అన్నదమ్ముళ్ల కలిసి ప్రేమతో ముందుకెళ్లే రాష్ట్రం ఇది. సదర్మాట్ను నిజాం రాజు కట్టాడు. ఎన్నో చెరువులు కట్టించారు.
అందరం ఆనాటి నుంచి ఈనాటి దాకా కలిసున్నాం. ఇప్పుడు కలిసే ఉండాలి. మతపిచ్చిలేపే బీజేపీని చెత్తకుప్ప మీద పారేయాలి. బీజేపీకి ఒక్కవోటు వేసిన వేస్టే. కాంగ్రెస్‌కు వస్తే ఇంకా వేస్టే. రాబోయే రోజు ప్రాంతీయ పార్టీలదే. గ్యారంటీగా రాసిపెట్టుకోండి. వచ్చేతాప మోదీకి మెజారిటీ రాదు. సంకీర్ణ ప్రభుత్వమే వస్తది. అసెంబ్లీలోనే కాదు.. పార్లమెంట్ సీటు కూడా ప్రతీ ఒక్కటీ గెలవాలి. అప్పుడు మన తడాఖా ఢిల్లీలో చూపించే అవకాశం వస్తది. మన హక్కులన్నీ పరిరక్షించబడుతయ్. ఇవన్నీ గమనంలో పెట్టుకొని మంచి మనసుతో పెద్ద మెజారిటీ ఇచ్చి జోగు రామన్నను గెలిపించాలని కోరుతున్న’.