ఏడో అంతస్తులోకి సీఎం పేషీ? మార్పు ఇందుకేనా?

ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న కార్యాల‌యాన్ని ఇప్పుడున్న ఆరో అంత‌స్తు నుంచి 7వ అంత‌స్తులోకి మార్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు

ఏడో అంతస్తులోకి సీఎం పేషీ? మార్పు ఇందుకేనా?
  • ప్రస్తుతం ఆరో అంతస్తులో సీఎం ఆఫీస్‌
  • అక్కడే పలు ఇతర శాఖల కార్యాలయాలు
  • సందర్శకులకు ఎదురవుతున్న ఇబ్బందులు
  • ఆ నేపథ్యంలో సీఎం తాజా నిర్ణయం?

విధాత‌, హైద‌రాబాద్‌: ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి త‌న కార్యాల‌యాన్ని ఇప్పుడున్న ఆరో అంత‌స్తు నుంచి 7వ అంత‌స్తులోకి మార్చాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు తెలిసింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్టు స‌చివాల‌య వ‌ర్గాల‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. గత బీఆరెస్‌ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ విశాలంగా, ఐకానిక్‌ తరహాలో నిర్మించిన స‌చివాల‌యం నిజానికి ఇరుకుగా ఉంద‌ని రేవంత్ రెడ్డి భావిస్తున్న‌ట్లు తెలిసింది. ఆరో అంత‌స్తులో సీఎం కార్యాల‌యంతోపాటు ఇత‌ర కార్యాల‌యాలు కూడా ఉన్నాయి.


దీంతో ఆరో అంత‌స్తులో సంద‌ర్శ‌కుల‌కు ఇబ్బంది క‌లుగుతోంది. ఈ క్రమంలో ఆరో అంత‌స్తును ఇత‌ర శాఖ‌ల అధికారుల‌తో పాటు సీఎంవో అధికారుల‌కు కేటాయిస్తే మంచిద‌న్న నిర్ణ‌యానికి ముఖ్యమంత్రి వచ్చినట్టు తెలిసింది. సీఎం కార్యాల‌యం ఆరో అంత‌స్తులో ఉండ‌డంతోపాటు మంత్రివ‌ర్గ స‌మావేశ మందిరం, సీఎస్ ఆఫీస్‌ కూడా ఇక్క‌డే ఉంది. దీంతో సీఎం పేషీ అధికారుల‌కు చాంబ‌ర్ల కేటాయింపులో ఇబ్బంది ఎదుర‌వుతున్న‌ది. దీనిని గుర్తించిన సీఎం తన కార్యాల‌యాన్ని ఇటీవ‌ల క‌లెక్ట‌ర్ల కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించిన ఏడ‌వ అంత‌స్తులో ఏర్పాటు చేసుకుంటే మంచిద‌న్న నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లు తెలిసింది.

మాజీ సీఎం కేసీఆర్ పాత స‌చివాల‌యానికి వాస్తు దోషం ఉంద‌ని, గ‌జిబిజిగా ఉంద‌ని ప్ర‌చారం చేయించారనే అభిప్రాయాలు ఉన్నాయి. పాత స‌చివాల‌యానికి రాకుండా సీఎం బంగ‌ళాగా నిర్మించుకున్న ప్ర‌గ‌తి భ‌వ‌న్ నుంచే ప‌రిపాల‌న సాగించారు. పాత స‌చివాల‌యంలోని సమ‌తా బ్లాక్‌లో కూర్చున్న సీఎంలకు ప‌ద‌వీ గండం వ‌చ్చింద‌ని, తనకూ అలా రాకుండా ఉండాలంటే నూత‌న స‌చివాల‌యం నిర్మించాల‌ని భావించి ఆ మేర‌కు కేసీఆర్ పాత స‌చివాల‌యాన్ని కూల‌గొట్టి కొత్తది నిర్మించారనే చర్చ కూడా అప్పట్లో గట్టిగానే సాగింది. కొత్త స‌చివాల‌యంలో కేసీఆర్ ఏరికోరి, ఎలాంటి వాస్తు దోషం లేకుండా ఆరో ఫోర్ల్‌లో సీఎం చాంబ‌ర్ ఏర్పాటు చేయించుకున్నారు. ఎలాంటి వాస్తు దోషం లేకుండా కార్యాలయం ఏర్పాటు చేసుకున్నా.. ప్ర‌జ‌లు మాత్రం కేసీఆర్‌ను ఇంటికి పంపించారు. కాంగ్రెస్ పార్టీ గెలుపుతో సీఎంగా రేవంత్ రెడ్డి బాధ్య‌త‌లు తీసుకున్న నెల రోజుల్లోనే త‌న కార్యాల‌యాన్ని 7వ అంత‌స్థులోకి మార్చోకోవాల‌ని నిర్ణ‌యించుకోవ‌డం చ‌ర్చ‌నీయాంశమైంది.