మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందని సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీటర్‌ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు

  • అందుకే మేడిగడ్డ పర్యటన
  • సీఎం రేవంత్‌రెడ్డి ట్వీట్‌

విధాత, హైదరాబాద్‌ : మేడిగడ్డ పర్యటనతో తెలంగాణ సమాజం తొమ్మిదిన్నరేళ్లు కేసీఆర్ పాలనలో విధ్వసమైన జలదృశ్యాన్ని కళ్లారా చూడబోతోందని సీఎం రేవంత్‌ రెడ్డి ట్వీటర్‌ ఎక్స్‌ వేదికగా ఆసక్తికర ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైందన్నారు. రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి…97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయని పేర్కోన్నారు.

ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్, మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా నోరు విప్పడం లేదన్నారు. మేడిగడ్డ మరమ్మతులకు పనికి రాదని, పూర్తిగా పునర్ నిర్మాణం చేయాల్సిందేనని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ అభిప్రాయపడిందని ట్వీట్‌లో ప్రస్తావించారు. ఈ నేపథ్యంలో వాస్తవాలు తెలంగాణ సమాజానికి తెలిపే ప్రయత్నం ప్రజా ప్రతినిధుల నేటి మేడిగడ్డ పర్యటన అన్నారు.

కేసీఆర్ తో పాటు బీఆరెస్‌ ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించామని, అయిత బీఆరెస్‌తో పాటు వారి చీకటి మిత్రులు బీజేపీ శాసన సభ్యులు మేడిగడ్డకు రావడం లేదన్నారు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావుకు ఎటీఎంలా మారిందని ప్రధాని మొదలు గల్లీ లీడర్ వరకు లొల్లి చేసే బీజేపీ నాయకులు వాస్తవాలు చూడడానికి క్షేత్రస్థాయికి రావడం లేదన్నారు. అన్నీ పార్టీల శాసన సభ్యులు ఒకవైపు ఉంటే బీజేపీ, బీఆరెస్‌ మాత్రం ఒక్కటిగా ఒకవైపు ఉన్నాయన్న సంగతిని ప్రజలు గమనించాలన్నారు.

Somu

Somu

Next Story