Telangana Assembly | సభలో హరీశ్ వర్సెస్ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రుల ఫైట్
రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు మధ్య వాడివేది వాదప్రతివాదలనతో సభ అట్టుడికింది. బడ్జెట్‌లో ఆదాయం, వ్యయం, కేంద్రం గ్రాంట్లపై అబద్ధపు లెక్కలు పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు

విద్యుత్తు ఒప్పందంపై కేసీఆర్ ప్రభుత్వం అగ్రిమెంట్‌ను బయపెట్టిన సీఎం
బతుకమ్మ చీరలు..కేసీఆర్ కిట్లు, గొర్రెల స్కీమ్‌పై విచారణకు సిద్ధమా అని సవాల్
అప్పులు..అమ్మకాలే కాదు..ఆస్తుల కల్పన కూడా చూడాలన్న హరీశ్‌రావు
విధాత, హైదరాబాద్ : రాష్ట్ర బడ్జెట్‌పై అసెంబ్లీలో చర్చ సందర్భంగా ప్రతిపక్ష బీఆరెస్ మాజీ మంత్రి టి.హరీశ్‌రావు, సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రులకు మధ్య వాడివేది వాదప్రతివాదలనతో సభ అట్టుడికింది. బడ్జెట్‌లో ఆదాయం, వ్యయం, కేంద్రం గ్రాంట్లపై అబద్ధపు లెక్కలు పెట్టారని హరీశ్‌రావు ఆరోపించారు. బీఆరెస్ ప్రభుత్వ పాలన బాగాలేదని మాటలు చెబితే సరిపోతుందా? ప్రశ్నించారు. రూ.4.5 లక్షలు లేని జీఎస్‌డీపీని రూ.14 లక్షలకు తీసుకెళ్లింది బీఆరెస్ ప్రభుత్వమేనన్నారు. గత ప్రభుత్వ పాలన బాగాలేదని ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. పదేండ్ల పాలనలో ఉన్న సమాచారాన్ని తొలగించారని, కంప్యూటర్ నుంచి తొలగిస్తారేమో కానీ, ప్రజల మెదడు నుంచి తొలగించలేరని పేర్కొన్నారు.
అక్షరాలను తొలగిస్తారేమో కానీ, అనుభవాల్ని తొలగించలేరన్నారు. బీఆరెస్ శ్రమను, కాంగ్రెస్ ఎనిమిది నెలల డ్రామాలను ప్రజలు చూస్తున్నారని చెప్పారు. రాష్ట్ర బడ్జెట్ మొత్తం అవాస్తవాలతో నిండి ఉందని, రాష్ట్రంలో దశా దిశా లేని పాలన సాగుతుందన్నారు. ట్యాక్స్ రెవెన్యూ ఎక్కువ వస్తుందని బడ్జెట్‌లో పెట్టారని, పన్నేతర ఆదాయంలో రూ.35 వేల కోట్లు వస్తుందని బడ్జెట్‌లో చూపించారని, ఎలా వస్తుందో చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆరెస్ పాలనలో కేంద్ర గ్రాంట్లను సాధించలేదని చెప్పిన ఆర్థిక మంత్రి కేంద్ర బడ్జెట్‌లో నిధులు ఇవ్వలేదన్న అసెంబ్లీ తీర్మానాన్ని మరిచి రెట్టింపు గ్రాంట్లు సాధిస్తామని పేర్కోన్నారని నిలదీశారు.
విధానాల రూపకల్పన కంటే బీఆరెస్‌ను తిట్టడంపైనే బడ్జెట్‌లో ఎక్కువ దృష్టిపెట్టారన్నారు. గతంలో రుణమాఫీ కోసం భూములు అమ్మితే భట్టివిక్రమార్క, శ్రీధర్‌బాబు విమర్శించారని, ఇప్పుడు రూ.10 వేల కోట్ల విలువ చేసే భూములు అమ్మి నిధులు సమీకరిస్తామని బడ్జెట్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. మీ మాటపై గౌరవం ఉంటే భూములు అమ్ముకునే ప్రతిపాదన ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఏకకాలంలో 30వేలకోట్ల రుణమాఫీ అని చెప్పి బడ్జెట్‌లో రూ.26 వేల కోట్లు మాత్రమే చూపించారని, ఆలస్యం అయిందని రైతుల నుంచి వడ్డీ వసూలు చేస్తున్నారని వివరించారు. ఎక్సైజ్ శాఖలో 7వేల కోట్ల పై చిలుకు అదనపు ఆదాయం ఎలా సాధిస్తారంటూ, తెలంగాణ ప్రజలను తాగుబోతులను చేస్తారా, ధరలు పెంచుతారా అని హరీశ్‌రావు ప్రశ్నించారు.
దీనిపై ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క స్పందిస్తూ మీలాగా మేం టానిక్ సంస్థల వంటి వాటికి అనుమతులిచ్చి కుటుంబాల జేబుల్లోకి ఆదాయాన్ని వెళ్లకుండా ఖజనాకు చేర్చేలా ప్రయత్నించి ఆదాయం పెంచుకుంటామన్నారు. మా ప్రభుత్వ హయంలో జరుగాల్సిన లిక్కర్ లైసెన్స్‌ల జారీని మీరు మీ ప్రభుత్వ హయంలో ముందుగానే నిర్వహించి చేసిన అక్రమాలను మేం చేయబోమని హరీశ్‌రావు విమర్శలను తిప్పికొట్టారు. ప్రభుత్వంలో మీరే ఉన్నందునా విచారణ చేసుకోవచ్చంటూ ఆరు గ్యారంటీలకు కేటాయింపులు లేవని, చట్టబద్దత ఏమైందని, నమ్మక ద్రోహం చేసిందని, కాంగ్రెస్ బడ్జెట్ మోసపూరితంగా ఉందని హరీశ్‌రావు విమర్శలు చేశారు. అప్పులు, ఆస్తులే కాదు..మెడికల్ కళాశాలలు, రైతు వేదికలు, కలెక్టరేట్లు, గురుకులాలు, సచివాలయం వంటి ఆస్తులు సృష్టించామన్న సంగతి ప్రభుత్వం గుర్తెరుగాలన్నారు.
హరీశ్‌రావు కోమటిరెడ్డిల వాగ్వివాదం
మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ మీరు దళితుడిని సీఎం చేస్తామని చెప్పి, 24గంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పి గ్యారంటీల్లో పెద్ద మోసం చేశారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దుయ్యబట్టారు. మీ నాయకుడు కేసీఆర్ బడ్జెట్ మీద చీల్చి చెండాడుతామని ఎక్కడ పోయాడని ఎద్దేవా చేశారు. హరీశ్‌రావు స్పందిస్తూ మీరు హాఫ్ నాలేడ్జ్‌తో మాట్లాడుతున్నారని మండిపడగా, నీకు ఆకారం తప్ప అసలు నాలెడ్జ్‌నే లేదని, మీ మామా కేసీఆర్ దళిత సీఎం హామీ ఇవ్వలేదా అంటూ వెంకట్‌రెడ్డి నిలదీశారు. నీవు డమ్మీ మంత్రివి, డమ్మీ అల్లుడవంటూ ఫైర్ అయ్యారు. హరీశ్‌రావు తిరిగి మాట్లాడుతూ వ్యవసాయానికి 72వేల కోట్లు పెట్టారని వెంకట్‌రెడ్డి అంటున్నారని, ఇరిగేషన్‌కు 22వేల కోట్లు సపరేటు అనుకుంటున్నారని, వ్యవసాయ కేటాయింపుల్లోనే కరెంటు, ఇరిగేషన్‌లు ఉన్నాయని చెప్పానన్నారు.
ఇందులో భట్టి చేసిన మాయను వెంకట్‌రెడ్డి అర్ధం చేసుకోనందునే హాఫ్ నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నారని అన్నానన్నారు. హాఫ్ నాలెడ్జ్ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగిస్తున్నట్లుగా స్పీకర్ ప్రసాద్ ప్రకటించారు. గతంలో పీసీసీచీఫ్ పదవిని సీఎం రేవంత్‌రెడ్డి కొనుక్కున్నారని, కేసీఆర్ కలెక్టరేట్లు, సచివాలయం మంచిగా కట్టించారని వెంకట్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను హరీశ్‌రావు ప్రస్తావించి ఆయనను మరింత కవ్వించారు. సీఎం రేవంత్‌రెడ్డి భాష జూగుప్సాకరంగా, బెదిరించేలా ఉందని, ఇక సామాన్యులు ఆయన వద్దకు తమ సమస్యలపై ఎలా వస్తారని హరీశ్‌రావు ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి ప్రజాపాలన ప్రచారానికే పరిమితమైందని, ఆయన ఒక్కసారే ప్రజాభవన్‌లో వినతులు స్వీకరించారని హరీశ్‌రావు విమర్శించారు.
మాతాశిశు మరణాల నివారణలో విజయవంతమైన కేసీఆర్ కిట్‌ను కొనసాగించాలని, మహాలక్ష్మి పథకంలో మహిళలకు ఇస్తామన్న 2,500ఇవ్వాలని హరీశ్‌రావు కోరారు. రాష్ట్రంలో విద్యుత్తు సరపరా సక్రమంగా సాగడం లేదని, పది నిమిషాలు బ్రేక్ ఇస్తే భట్టి, నేను గన్‌పార్కు వద్ద నిలబడి విద్యుత్తుపై ప్రజలను అడుగుదామని, పదేళ్లలో విద్యుత్తు సక్రంగామ వచ్చిందా, 8నెలల కాంగ్రెస్ పాలనలో విద్య్త్తుత్తు వస్తుందా ప్రజలే చెబుతారన్నారు. పాలమూరు వెనుకబాటుకు కాంగ్రెస్సే కారణమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు 94వేలకోట్లు వెచ్చించామని గతంలో ఇప్పుడు అదే చెబుతున్నానన్నారు. ఎంతసేపు మీరు ఏం చేస్తారో ఎట్లా చేస్తారో చెప్పకుండా బీఆరెస్ పాలనపై దుమ్మెత్తడం ఎందుకని మేం తప్పులు చేసినందునే మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టారని, మీరు మాలాగే చేసి ఇక్కడ కూర్చుంటే మేం అక్కడ కూర్చుంటామని హరీశ్‌రావు అన్నారు.
సూచనలు..సలహాలు మాని విమర్శలా: సీఎం రేవంత్‌రెడ్డి
బడ్జెట్‌పై మాజీ మంత్రి హరీశ్‌రావు చేసిన విమర్శలకు సీఎం రేవంత్‌రెడ్డి ఘాటుగా కౌంటర్ వేశారు. పాలమూరులో ఎంపీగా పోటీ చేసిన కేసీఆర్‌ను ఆ జిల్లా ప్రజలు గెలిపిస్తే సీఎం అయ్యాక ఆయన పాలమూరు జిల్లాకు చేసిందేమి లేదని దుయ్యబట్టారు. అప్పుల, ఆస్తుల లెక్కలు చెప్పిన హరీష్ రావు అమ్మకాల లెక్కలు చెప్పలేదన్నారు. బీఆరెస్ హాయంలో అమ్ముకున్న వాటి లెక్కలు చెప్పాలని, బీఆరెస్ పాలన నిజాయితీగా సాగి ఉంటే మీరు గొప్ప పథకాలని చెబుతున్న బతుకమ్మ చీరలు, గొర్రెల స్కీమ్, కేసీఆర్ కిట్లలో దోపిడికి పాల్పడ్డారని, వీటిపై మీరు విచారణకు సిద్ధమా అని సవాల్ చేశారు. చేనేతకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పి సూరత్‌కు వెళ్లి కిలోల లెక్కన తెచ్చి,ఆడబిడ్డలను మభ్యపెట్టారని, బతుకమ్మ చీరలను మహిళలు కట్టుకోలేదని, పొలాల్లో పిట్టలను తరిమేందుకు వాడారని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారు. గొర్రెల పథకంలో 700కోట్లు స్వాహా చేశారని ఆరోపించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగిందన్నారు.
గతంలో రంగారెడ్డి జిల్లాలో వేల కోట్ల రూపాయల భూములు అమ్మేసి ఈ జిల్లాకు అవసరమైన నిధులు ఇవ్వలేదన్నారు. కాంగ్రెస్ నిర్మించిన లక్షల కోట్ల విలువైన ఔటర్ రింగ్ రోడ్డును పల్లి బఠానీ మాదిరిగా 7వేల కోట్లకు తెగనమ్మారని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టులో పెట్టిందే 80వేల కోట్లయితే లక్ష కోట్ల అవినీతి ఎలా జరిగిందన్నారని, ఇప్పుడేమో 94వేల కోట్లు ఖర్చు చేశామంటున్నారని నిలదీశారు. మేడిగడ్డ ఎలా కూలింది..ఇంకేమైనా మిగిలిందా అని చూసేందుకే బీఆరెస్ బృందం మేడిగడ్డకు వెళ్లిందని సెటైర్ వేశారు. పాలమూరు జిల్లా ప్రాజెక్టులను పదేళ్లలో పూర్తి చేయకుండా అన్యాయం చేశారన్నారు. .గత బీఆరెస్ సర్కారు తీరువల్లే కేంద్ర బడ్జెట్‌లో ఒక్క పైసా రాలేదని ఆరోపించారు. మొన్న అసెంబ్లీలో బీఆరెస్ కాళ్లు చేతులు విరిచేసినా..ఎంపీ ఎన్నికల్లో ఉరి తీసి గుండుసున్నా ఇచ్చినా బీఆరెస్ బుద్ధి మారడం లేదని విమర్శించారు. మంత్రి వెంకట్‌రెడ్డికి హాఫ్ నాలెడ్జ్ అన్ిన హరీశ్‌రావుకే హాఫ్ నాలెడ్జ్ అని, వారి పెద్దాయనకేమో ఫుల్ నాలెడ్జ్ ఇక మేమేం చేస్తామంటూ కౌంటర్ వేశారు.
విద్యుత్తు సంస్కరణలపై సభను తప్పుదోవ పట్టిస్తున్న బీఆరెస్ : సీఎం
సభలో పదేపదే బీఆరెస్ మాజీ మంత్రి హరీశ్‌రావు తాము కేంద్రం చెప్పిన విద్యుత్తు సంస్కరణలను అమలు చేయలేదని, మోటార్లకు మీటర్లు పెట్టలేదని, అందుకోసం తాము 30వేల కోట్ల రుణ అవకాశం వదులుకున్నామని సభను తప్పుదోవపట్టిస్తున్నారంటూ సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రానికి చెందిన మూడు విద్యుత్తు సంస్థలు కేంద్రంతో 2017 జనవరి 4న విద్యుత్తు సంస్కరణలపై అగ్రిమెంట్ చేసుకున్నాయని, ఆ ఏదాడి జూన్ 30లోపల వ్యవసాయ ట్రాన్స్‌ఫార్మర్లు, ఫీడర్ల వద్ధ మీటర్లు పెడుతామని, దఫాల వారిగా ఆరు నెలల్లో గృహ విద్యుత్తులో 500యూనిట్లు, 200యూనిట్ల వారికి 2018డిసెంబర్ లోపల మీటర్లు పెట్టిస్తామని ఒప్పందం చేసుకున్నారని వెల్లడించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలను సభ ముందుంచారు.
వాస్తవం ఇలా ఉంటే బీఆరెస్ సభు్యలు సభు తప్పుదోవ పట్టిస్తున్నాడని మండిపడ్డారు. ఆజయ్ మిశ్రా ఐఏఎస్, రఘుమారెడ్డి, ఏ. గోపాల్‌రావులు కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం తరుపున సంతకాలు చేశారని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. దీనిపై స్పందించిన హరీశ్‌రావు ఆ ఒప్పంద వివరాలు తన దృష్టికి రాలేదని, వాటిని అధ్యయనం చేశాక రేపు స్పందిస్తానన్నారు. ప్రజలకైతే వాస్తవాలు తెలుసని, ఎక్కడా మేం మీటర్లు పెట్టలేదని, 30వేల కోట్ల రూపాయల రుణాలు తీసుకోలేదని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు దారుణంగా క్షిణించాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకా 1లక్షకు పైగా కేసులు నమోదయ్యాయని, రేప్‌లు, మర్డర్లు పెరిగిపోయాయని హరీశ్‌రావు ఆరోపించారు. మంత్రి డి.శ్రీధర్‌బాబు స్పందిస్తూ మీ హయంలో పట్టపగలు ఇద్దరు న్యాయవాదులను హత్య చేస్తే చర్యలు లేవని మీరా శాంతిభద్రతలపై మాట్లాడేదంటూ మండిపడ్డారు.