Amit Shah | రిజర్వేషన్లపై సీఎం రేవంత్ అబద్ధాల ప్రచారం : అమిత్ షా
బీజేపీకి 400సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్ధు చేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు.

సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ముందా
కాంగ్రెస్, బీఆరెస్‌లకు తెలంగాణ ఏటీఎం
వికారాబాద్ బీజేపీ సభలో అమిత్ షా
విధాత : బీజేపీకి 400సీట్లు వస్తే రిజర్వేషన్లను రద్ధు చేస్తామని, రాజ్యాంగాన్ని మారుస్తామంటూ సీఎం రేవంత్‌రెడ్డి, రాహుల్‌గాంధీలు అబద్ధాలను ప్రచారం చేస్తూ ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మండిపడ్డారు. వికారాబాద్‌లో చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వం పదేళ్లుగా సంపూర్ణ మెజార్టీతో కొనసాగిందని, ఎక్కడా రిజర్వేషన్లను కదిలించలేదని, కాంగ్రెస్ పార్టీనే మైనార్టీ ఓట్ల కోసం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్లకు గండికొట్టి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించిందని అమిత్ షా విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే ముస్లిం రిజర్వేషన్లను రద్ధు చేస్తామని స్పష్టం చేశారు.
పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల ముందు ఒక్క అవినీతి మరక లేని, ఒక్క సెలవు తీసుకోని చివరకు దీపావళి రోజున కూడా సెలవు పెట్టని ప్రధాని మోదీ ఒకవైపు ఉన్నారని, కొంచం ఊష్ణోగ్రతలు పెరిగితే విదేశాలకు వెళ్లిపోయే రాహుల్‌గాంధీ మరోవైపు ఉన్నారని మీకు ఎవరు ప్రధాని కావాలో ఎంచుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాలనలో దేశ భద్రత సురక్షితంగా ఉందని, సుపరిపాలన సాగిందన్నారు. ఇండియా కూటమి ప్రధాని ఎవరో వారికే తెలియదని, రాహుల్‌గాంధీని అడిగితే ఏడాదికొకరు ప్రధానిగా ఉంటారని చెబుతూ దేశాన్ని ఏం చేయదలుచుకున్నారో వారికే తెలియడం లేదన్నారు.
ఉగ్రవాద దాడుల నిర్మూలనకు సర్జికల్ స్ట్రైక్స్ చేసి పాకిస్తాన్‌లో దాక్కున్న ఉగ్రవాదులను తుదముట్టించామని, దేశంలో తీవ్రవాదాన్ని సైతం అంతం చేస్తున్నామన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి సర్జికల్ స్ట్రైక్స్ పై తమాషాగా మాట్లాడుతున్నాడని, తెలంగాణ ప్రజలకు కాశ్మీర్‌తో ఏం సంబంధమంటున్నాడని, కాంగ్రెస్ ప్రభుత్వానికి సర్జికల్ స్ట్రైక్స్ చేసే దమ్ము లేదని, కాశ్మీర్ కోసం తెలంగాణ ప్రజలు ప్రాణాలిస్తారన్నారు. కాంగెస్ నేత మణిశంకర్ అయ్యర్ పాకిస్తాన్ వద్ధ అణుబాంబు ఉందంటూ మనల్ని భయపెడుతున్నాడని, వారి వద్ద అణుబాంబు ఉందని భయపడి వారికి పీవోకే అప్పగించాలా అని, బీజేపీ ఉన్నంతవరకు అది జరగని పని అని స్పష్టం చేశారు. కాశ్మీర్ ఎప్పటికి భారత్‌లో అంతర్భాగమేనన్నారు.
ఉగ్రవాదులను కాంగ్రెస్ కాపాడుతూ వస్తే మోదీ ప్రభుత్వం వారిని వారిని ఏరివేసిందన్నారు. రామమందిర నిర్మాణానికి కాంగ్రెస్ అడ్డుపడితే నరేంద్ర మోదీ మందిరం పూర్తి చేసి ప్రాణ ఫ్రతిష్ట చేశారన్నారు. ముస్లిం ఓటు బ్యాంకుకు భయపడి రామమందిరం ప్రారంభోత్సవానికి రాహుల్, ఖర్గే, ప్రియాంకలు రాలేదని, మాకు ఆ భయం లేదన్నారు. మేము కాశీ విశ్వనాథ్ మందిర్ పునర్ నిర్మించామని, సోమనాథ్ మందిర్‌ను కూడా పునర్ నిర్మిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ దేశ ఆర్ధిక వ్యవస్థను అగ్రగామి దేశాల సరసన నిలిపారని, చంద్రయాన్‌తో దేశ గౌరవాన్ని పెంచారన్నారు.
బీఆరెస్, బీజేపీలకు ఏటీఎంగా తెలంగాణ
మిగులు బడ్జెట్‌తో ఏర్పడిన తెలంగాణను బీఆరెస్ తన అవినీతి పాలనలో 60లక్షల కోట్ల అప్పుల పాలు చేసింది, కాంగ్రెస్ సైతం అదే దారిలో వెలుతుందని, చేసిన అప్పు డబ్బులన్ని ప్రజలకు అందకుండా ఎక్కడ పోయాయని అమిత్ షా ప్రశ్నించారు. పాలమూరు రంగారెడ్డిని కాళేశ్వరంగా మార్చి ప్రజాధనం లూటీ చేశారని ఆరోపించారు. తెలంగాణ బీఆరెస్, కాంగ్రెస్‌లకు ఏటీఎంగా మారిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి డబుల్ ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారని, తెలంగాణ ప్రజల సొమ్ము ఢిల్లీకి వెలుతుందన్నారు. ఏబీసీ పార్టీలుగా మారిన అసదుద్ధిన్ ఎంఐఎం, బీఆరెస్, కాంగ్రెస్‌లు రాష్ట్రంలో రామనవమి ర్యాలీలను అనుమతించడం లేదని, హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదని, త్రిఫుల్ తలాక్‌ను మళ్లీ తేవాలనుకుంటున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలో మజ్లీస్‌ను, బీఆరెస్, కాంగ్రెస్‌లను తరమికొట్టే శక్తి బీజేపీకే ఉందన్నారు. మాదిగ రిజర్వేషన్ వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధికి పదేళ్లలో ప్రధాని మోదీ ప్రభుత్వం 9లక్షల కోట్లు వెచ్చించిందని, రేవంత్‌రెడ్డి మాకు ఏం ఇవ్వలేదంటూ అబద్ధాలతో దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణలో మోదీ ప్రభుత్వం జాతీయ రహదారులు, ఆర్‌ఆర్‌ఆర్, రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, బీబీనగర్ నిమ్స్, ములుగు గిరిజన యూనివర్సిటీ, పసుపు బోర్డు ఏర్పాటు చేశామన్నారు. వందే భారత్ రైళ్లు మంజూరీ చేశామని, తొలి బుల్లెట్ రైలు వికారాబాద్‌కు రాబోతుందన్నారు. బీజేపీని గెలిపించడం ద్వారా రాష్ట్ర అభివృద్ధితో పాటు దేశాభివృద్దికి తెలంగాణ ప్రజలు బాటలు వేయాలని కోరారు.