మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజాస్వామిక పాలన సాగిస్తాం

తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజాస్వామిక పాలన సాగిస్తామని, పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు

మాది ప్రజా ప్రభుత్వం.. ప్రజాస్వామిక పాలన సాగిస్తాం
  • చెప్పిన ఆరు గ్యారంటీలు అమలు చేస్తాం
  • ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం

విధాత : తమది ప్రజా ప్రభుత్వమని, ప్రజాస్వామిక పాలన సాగిస్తామని, పాలకులుగా కాకుండా ప్రజా సేవకులుగా పనిచేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. శనివారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం ధన్యవాద చర్చకు సమాధామిస్తూ బీఆరెస్ గత పాలనపైన విమర్శలు సంధిస్తూ ఆయన మాట్లాడారు. ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి ఉన్నామంటూ ప్రకటించారు. మొన్నటి దాకా సాగిన కుటుంబ, నియంతృత్వ పాలనకు వ్యతిరేకంగా ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించే సంస్కృతి బీఆరెస్ పక్షంలో కనబడటం లేదని విమర్శించారు. అప్పట్లో మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్‌కు, ఇతర మంత్రులకు, ప్రజాయుద్ధనౌక గద్దర్ వంటి వారికి, సామాన్య ప్రజలకు ప్రగతి భవన్‌లో ప్రవేశం లేకుండా పోయిందని చెప్పారు. గడీలను, నిషేధిత ప్రాంతాన్ని తలపించిన ప్రగతి భవన్ ఇనుప కంచెలను బద్దలు కొట్టామని, నాలుగు కోట్ల ప్రజలను ప్రజాభవన్‌లోకి అనుమతించడం ద్వారా ప్రజాపాలనకు ద్వారాలు తెరిచామని తెలిపారు.


తమ ప్రభుత్వం నియంతృత్వ పోకడలకు పోవాలనుకుంటే, నియంత పాలన సాగించాలనుకుంటే ఇంతసేపు శాసన సభలో ఇక్కడ ఉండరని రేవంత్ వ్యాఖ్యానించారు. 2014నుంచి మొదలుకుని ప్రతిపక్షాలను బయట, సభలో అణిచివేసిన గత పాలకులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ వంటి వారి సభ్యత్వాలను అన్యాయంగా రద్దు చేసిన చీకటి రోజులను మరిచిపోలేదని చెప్పారు. మేనేజ్‌మెంట్ కోటాలో వచ్చిన వారికి ప్రజా సమస్యలు, స్వేచ్ఛాయుత ప్రజాస్వామిక పాలన అర్థం కావడం లేదంటూ కేటీఆర్ లక్ష్యంగా రేవంత్ విమర్శలు గుప్పించారు. ఆరు గ్యారంటీలకు ప్రతిపక్షాల సూచనల మధ్య ప్రజాస్వామిక చర్చ ద్వారా శాసన సభలో తప్పకుండా చట్టబధ్ధత కల్పిస్తామన్నారు. ఉద్యమ పార్టీగా చెప్పుకొని అధికారంలోకి వచ్చి ధర్నా చౌక్‌ను ఎత్తివేసిన దుర్నీతి పాలనను తాము అనుసరించబోమని స్పష్టం చేశారు.


‘శాసనసభలో మీకు న్యాయం జరుగపోయినా, మేం హామీలను అమలు చేయకపోయినా మేం తెరిపించిన ధర్నాచౌక్‌లో స్వేచ్ఛగా ధర్నా చేసుకోవచ్చు’ అని రేవంత్‌రెడ్డి చురకలేశారు. అమరుల త్యాగాలతో గద్దెనెక్కిన నాటీ సీఎం కేసీఆర్ ఏనాడూ ఉద్యమకారుల సంక్షేమాన్ని పట్టించుకోలేదని విమర్శించారు. కుటుంబంలో అందరికీ పదవులు ఇచ్చుకుని, శంకరమ్మ వంటి వారికి పదవులు ఇవ్వలేదని, కృష్ణయ్య, యాదయ్య, యాదిరెడ్డి వంటి అమరుల కుటుంబాలను పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యమ కేసులను సమీక్షించి ఎత్తివేయలేదని, తమ ప్రభుత్వం అటువంటి తప్పులు చేయకుండా కేసులు ఎత్తివేసి, ఉద్యమకారులను ఆదుకునేందుకు పథకాలు అమలు చేస్తుందన్నారు.