సమిష్టిగా పరిపాలన.. ఆశలు రేకెత్తిస్తున్న అడుగులు
ప్రజలు కోరుకున్న మేరకు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గతకాలపు విధానాలను సమూలంగా మార్చివేస్తున్నది

- వ్యక్తికేంద్ర పాలనకు స్వస్తి.. అధికారుల సూచనలకూ విలువ
- మార్పును చాటుతున్న కాంగ్రెస్ సర్కార్
- ప్రజాస్వామిక పాలన దిశగా తొలి అడుగులు
- పాలనా తీరులో ఏకపక్ష ధోరణలు మాయం
- పనిచేసే కార్యాలయంలా మారిన సచివాలయం
- గతంలో సంబంధిత మంత్రి లేకుండానూ సమీక్ష!
- ఇప్పుడు అధికారులతో చర్చిస్తూ సమావేశాలు
- ప్రజలు కలిసేందుకే అవకాశం లేని వాతావరణం
- ప్రజాభవన్‌లో నేడు ప్రజాదర్బార్ నిర్వహణ
(తిప్పన కోటిరెడ్డి)
ప్రజలు కోరుకున్న మేరకు కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. గతకాలపు విధానాలను సమూలంగా మార్చివేస్తున్నది. ఒకప్పుడు ఏకవ్యక్తి కేంద్రంగా సాగిన పరిపాలన స్థానంలో ఇప్పుడు సమిష్టి పరిపాలన దిశగా అడుగులు పడుతున్నాయి. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ప్రజలు ఏ విధంగా భావోద్వేగానికి గురయ్యారో.. ఇప్పుడు మళ్లీ అలాంటి భావన వ్యక్తమవుతున్నది. 10 ఏళ్ల తరువాత ఏర్పడిన ఈ కొత్త ప్రభుత్వంలో ప్రజలు తమకు స్వేచ్ఛ వచ్చిందని మొదటిసారి అనుకుంటున్నారని ఒక సీనియర్ జర్నలిస్ట్ వ్యాఖ్యానించారు.
నాడు ప్రజలకు ప్రవేశం లేని ప్రగతి భవన్.. నేడు ప్రజాభవన్‌గా…
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడిగా సారథ్యం వహించిన రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూనే తన మార్క్ చూపించారన్న చర్చ జరుగుతోంది. ఒకప్పుడు కన్నెత్తి చూడటానికి కూడా అవకాశం లేని ప్రగతి భవన్ కంచెను బద్దలు కొట్టించడం ద్వారా మంచి సంకేతాలు పంపారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అంతటితో ఆగకుండా ప్రగతి భవన్‌ను జ్యోతీరావు ఫూలే ప్రజా భవన్‌గా మార్చి, నిరంతర ప్రజాదర్బార్‌కు వేదికగా ప్రకటించారు. మరోవైపు సామాన్య ప్రజలకు గతంలో అనుమతి దొరకని సచివాలయాన్ని వారికి అందుబాటులోకి తెచ్చారు. మొదటి రోజునే ప్రజలకు సచివాలయంలో రాయల్ రైట్‌గా రావడానికి అనుమతిచ్చిన సీఎం రేవంత్ రెడ్డి, తన పనిని అక్కడి నుంచే ప్రారంభించారు.
పనిచేసే సచివాలయంగా
10 ఏళ్ల బీఆరెస్ పాలనలో సచివాలయం అనేది నామమాత్రపు భవనంగానే కునారిల్లింది. కొత్త సచివాలయాన్ని నిర్మించినా.. అక్కడకు ముఖ్యమంత్రి రాక, మంత్రులు లేక అనామకంగా మారిపోయిందనే అభిప్రాయాలు ఉన్నాయి. కానీ.. తొలి రోజు నుంచే సచివాలయాన్ని ‘పనిచేసే సచివాలయం’గా మార్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కిందనే అభిప్రాయాలను పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి సహా ప్రమాణం చేసిన మంత్రివర్గం.. తమ తొలి క్యాబినెట్ భేటీని సచివాలయంలోనే నిర్వహించడం, అక్కడే మీడియా సమావేశం ఏర్పాటు చేసి సమావేశ వివరాలను వెల్లడించడం అనే సంప్రదాయాన్ని పునఃప్రారంభించారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజలకు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, వాటిని నెరవేర్చే అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. కాంగ్రెస్ ప్రకటించిన ఆరు గ్యారెంటీలలో రెండింటి అమలుకు అదే సమావేశంలో నిర్ణయం తీసుకుని, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఆరోగ్యశ్రీ పరిమితి రూ.10 లక్షలకు పెంపును అందుబాటులోకి తెచ్చారు. మరుసటి రోజు నుంచి క్రమం తప్పకుండా ఉదయమే సచివాలయానికి చేరుకొని వరుసగా శాఖలవారీగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సచివాలయానికి రాకుండా తన అధికార నివాసమైన ప్రగతి భవన్ నుంచే కార్యకలాపాలు నిర్వహించేవారు.
దానికి భిన్నంగా రేవంత్‌రెడ్డి సీఎంగా సచివాలయం నుంచే తన విధులు నిర్వహిస్తున్నారు. దీంతో అధికారులు అంతా సచివాలయంలోనే ఉంటూ పాలనలో భాగస్వాములవుతున్నారు. సందర్శకులు వచ్చి కలుస్తున్నారు. ఫలితంగా 10 ఏళ్ల తరువాత తెలంగాణ సచివాలయం పనిచేసే సచివాలయంగా కళకళలాడుతున్నదనే చర్చ సర్వత్రా వినిపిస్తున్నది.
స్వేచ్ఛ వచ్చిందంటున్న ఉద్యోగులు, సిబ్బంది
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆరెస్ ఓడిపోయిందనే వార్త వినగానే అక్కడి ఉద్యోగ, అధికార వర్గాలు తమకు స్వేచ్ఛ వచ్చిందంటూ సంబురాలు చేసుకున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల అధ్యాపక సంఘం అధ్యక్షుడు మధుసూధన్‌రెడ్డి ఏకంగా మీడియా సమావేశం నిర్వహించి తమకు స్వేచ్ఛ వచ్చిందని, ఇక నుంచి ఉద్యోగులు వాట్సాప్ కాల్స్ చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ముఖ్యంగా భావ ప్రకటన స్వేచ్ఛ లభించిందన్న ఆనందం ఉద్యోగవర్గాల్లో వ్యక్తమవుతున్నది.
అధికారుల అభిప్రాయాలకు సమీక్షల్లో విలువ
సీఎం రేవంత్‌తో పాటు, డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, సీతక్క తదితరులు నిర్వహించిన సమావేశాల్లో తమ అభిప్రాయాలూ తెలియజేసే స్వేచ్ఛ లభించిందని ఒక సీనియర్ అధికారి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు సమీక్ష సమావేశాలలో అధికారులు చెప్పే వివరాలు తీసుకోవడంతో పాటు వారి అభిప్రాయాలను కూడా వింటున్నారని మరో అధికారి చెప్పారు. పైగా ఏవిధంగా ముందుకు వెళితే బాగుంటుందో సూచనలు చేయాలని కూడా తమను అడుగుతున్నారని ఆయన తెలిపారు. ఇది మంచి సంప్రదాయమన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు. అంతిమంగా నిర్ణయాధికారం సీఎం, మంత్రుల చేతిలోనే ఉంటుందని, కానీ.. అధికారుల అభిప్రాయాలను కూడా స్వీకరించడం శుభపరిణామమని అంటున్నారు. సమీక్షల్లో ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పింది రాసుకోవడం కంటే.. సమీక్షల్లో అధికారులనూ భాగస్వాములను చేసి తీసుకునే నిర్ణయాలు కలెక్టివ్‌గా ఉంటాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
తీరు మారిపోయింది
గత ప్రభుత్వంలో ఇలాంటి వాతావరణం లేదని పలువురు సీనియర్ అధికారులు చెబుతున్నారు. గత పదేళ్లలో ముఖ్యమంత్రి, లేదా మంత్రులు ఒక అభిప్రాయానికి వచ్చి, నిర్ణయాలు వెలువరించేవారని గుర్తు చేస్తున్నారు. భిన్నాభిప్రాయం వ్యక్తం చేసే అవకాశం కూడా ఉండేది కాదని ఒక అధికారి చెప్పారు. ఆ ప్రభుత్వంలో ఐఏఎస్ అధికారులు కూడా ఎల్‌డీసీ లాగా చెప్పింది చేయాల్సి వచ్చేదని, భిన్నాభిప్రాయం చెప్పడానికి అవకాశమే ఉండేది కాదని తెలిపారు. సీఎం సమీక్షా సమావేశాలపై అధికారుల్లో ఒక సరదా చర్చసాగేదని, ముఖ్యమంత్రి నలుగురితో ఏదైనా విషయంపై మాట్లాడితే అదే సమీక్ష అయి, ప్రెస్‌నోట్ విడుదలయ్యేదని సీనియర్ అధికారి ఒకరు చెప్పారు. సంబంధిత శాఖ మంత్రి లేకపోయినా సమీక్ష జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయని తెలిపారు. ఇప్పుడు మంత్రులు, అధికారుల మధ్య చర్చలతో సమీక్షలు సాగుతున్నాయని తెలిపారు.
బీఆరెస్ ప్రభుత్వంలో అలా
– ప్రగతి భవన్‌లో ప్రజలకు అనుమతి నిరాకరణ
– సచివాలయానికి రాని ముఖ్యమంత్రి
– అనామకంగా మిగిలిన సచివాలయం
– అధికారిక నివాసం ప్రగతి భవన్ నుంచే పాలన
– మంత్రివర్గ సమావేశాలు అక్కడే
– అధికారులతో సమీక్షలు కూడా అందులోనే
– మంత్రులు, ఎమ్మెల్యేలకు సైతం సీఎం గ్రీన్ సిగ్నల్ ఉంటేనే ఎంట్రీ
– ప్రగతి భవన్ ముందు గడీని తలపించే విధంగా భారీ ఇనుప కంచె
– ప్రజలు సీఎంను కలిసేందుకు దొరకని అవకాశం
కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు ఇలా
– ప్రగతి భవన్ ముందు భారీ ఇనుప కంచె తొలగింపు
– ప్రజలకు అందుబాటులో ప్రగతి భవన్
– మహాత్మా జ్యోతీరావ్ ఫూలే ప్రజాభవన్‌గా మార్పు
– ప్రజా భవన్‌లో సీఎం, మంత్రులతో ప్రజాదర్బార్
– నిత్యం సందర్శకులతో కళకళలాడుతున్న సచివాలయం
– పనిచేసే కార్యాలయంగా అవతరించిన సెక్రటేరియట్
– సీఎం రేవంత్ వరుస సమీక్షలు సచివాలయం నుంచే