టార్గెట్ కేసీఆర్
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును అష్టదిగ్బంధం చేసే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైనట్లు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి

– గ్రామ సభల్లో గులాబీ బండారం బట్టబయలు
– రాష్ట్ర ఆర్థిక దుస్థితిపై వివరణ
– రైతులు, ప్రజలకు నీళ్లు అమ్ముతామన్నది నిజం
– కాళేశ్వరం ప్రాజెక్టు బాగోతం రట్టు
– విద్యుత్ సంస్థల అప్పుల కుప్ప వెల్లడి
– ధరణి పోర్టల్ లో అర్ధరాత్రి లావాదేవీలపై ఆరా..
ఫోరెన్సిక్ ఆడిట్ కూ ఆదేశం
విధాత, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావును అష్టదిగ్బంధం చేసే పనిలో కాంగ్రెస్ సర్కార్ నిమగ్నమైనట్లు పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మొన్న జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, నీటి పారుదల ప్రాజెక్టులు, విద్యుత్ సంస్థల అప్పుల కుప్పపై శ్వేతపత్రాలను చర్చకు పెట్టిన విషయం తెలిసిందే. ఇవేకాకుండా ధరణి లావాదేవీలపై ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉన్నతాధికారులతో సుధీర్ఘంగా సమావేశం నిర్వహించి చర్చించారు. ధరణి పోర్టల్ లో అర్ధరాత్రి లావాదేవీలు, వివాదాస్పద భూములు పాత ప్రభుత్వ పెద్దలపరం, లావాదేవీలు జరిగిన సమయంలో ఏ అధికారి సంతకం చేశారనే వివరాలు అందించాలని రేవంత్ రెడ్డి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ ను ఆదేశించారు.
రూ.6,71,757 కోట్లకు పెరిగిన అప్పు
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యే నాటికి తెలంగాణ అప్పులు రూ.72,658 కోట్లు కాగా బీఆరెస్ పాలనలో రూ.6,71,757 కోట్లకు పెరిగి ప్రజలకు గుదిబండగా మారిందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అసెంబ్లీలో శ్వేతపత్రం విడుదల చేస్తున్న సందర్భంలో అన్నారు. మిగులు రాష్ట్రం బడ్జెట్ ను.. రోజూ అప్పులు తెచ్చుకుంటే తప్ప గడవలేని దుస్థితికి మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు తీసుకువచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఏ శాఖను సమీక్షించినా అప్పులు, ఆస్తుల తనఖా, బాధ్యతారాహిత్యం కన్పిస్తోందన్నారు.
విద్యుత్ రంగంలో అరాచకమే..
ఆర్థిక దుస్థితి ఇలా ఉంటే, విద్యుత్ రంగం కూడా ఏమంత ఘనంగా లేదు. విద్యుత్ రంగంలో అరాచకం సృష్టించారని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ శాఖ మొత్తం అప్పులు రూ.81,516 కోట్లు కాగా, ప్రభుత్వ శాఖల నుంచే రూ.28 వేల కోట్లు బిల్లుల రూపంలో చెల్లించాల్సి ఉందన్నారు. సాగునీటి ప్రాజెక్టులు రూ.14,193 కోట్లు బకాయి పడినట్లు వివరించారు. మిషన్ భగీరథ రూ.3,558 కోట్లు, విద్యుత్ పంపిణీ సంస్థలు రూ.35,227 కోట్లు అన్నారు. టీఎస్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ అప్పులు రాష్ట్రం ఏర్పడే నాటికి రూ.7,662 కోట్లు కాగా, పదేళ్ల బీఆరెస్ పాలనలో రూ.32,797 కోట్లకు పెరిగిందన్నారు. రైతులకు 24 గంటల త్రీ ఫేజ్ కరెంట్ ఇస్తున్నామని బీఆరెస్ గొప్పలు చెప్పుకున్నప్పటికీ, వాస్తవంగా రోజుకు 12 గంటల నుంచి 14 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. ప్రభుత్వ సంస్థలు సకాలంలో బిల్లులు విద్యుత్ పంపిణీ సంస్థల (డిస్కం)కు చెల్లించకుండా నిర్లక్ష్యం చేశాయన్నారు. విద్యుత్ పై శ్వేతపత్రం విడుదల చేసిన సందర్భంలో సభలో మాజీ విద్యుత్ శాఖ మంత్రి జీ జగదీశ్ రెడ్డి సభ్యులను తప్పుదోవ పట్టించే విధంగా మాట్లాడుతున్నారని ఉప ముఖ్యమంత్రి విక్రమార్క మండిపడ్డారు.
ప్రాజెక్టుల గతిమార్చిన మామ, మేనల్లుడు
గత బీఆరెస్ ప్రభుత్వంలో తొలి ఐదేళ్లలో టీ హరీశ్ రావు, రెండోసారి అధికారంలోకి వచ్చిన తరువాత కే చంద్రశేఖర్ రావు నీటి పారుదల శాఖను పర్యవేక్షించారని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి వివరించారు. ఈ శాఖను మేనల్లుడు, మామ తప్ప మరొకరు చూడలేదన్నారు. ఒక్క కాళేశ్వరం ప్రాజెక్టుకే రూ.97,449 కోట్లు మంజూరు చేయగా, రూ.79,287 కోట్లు మంజూరు చేశారన్నారు. కాళేశ్వరం నీళ్లను రైతులు, ప్రజలకు విక్రయించడం ద్వారా నిధులు సమకూర్చుకుంటామని బ్యాంకులను సైతం బురిడీకొట్టించారన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నష్టం జరిగింది తప్ప, నయాపైసా లాభం కూడా జరగలేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. పూర్తి వివరాలు త్వరలో బయటపెడ్తామని ఆయన వివరించారు. శ్వేతపత్రాలు విడుదల చేసేది ఎవరినో విమర్శించడానికో, అవమానించడానికో కాదని, వాస్తవ పరిస్థితులను ప్రజలకు తెలియచేసేందుకేనని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. పేదోళ్ల పెద్దకొడుకునని చెప్పిన మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో దివాలా తీయించారన్నారు.
అప్పులు, ఆస్తుల తనఖాపై నిఘా
శ్వేతపత్రాలు విడుదల చేసిన తరువాత సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్ ఉత్తమ్ రెడ్డి, ముఖ్యమంత్రి బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో సంబంధిత ఉన్నతాధికారులతో సుధీర్ఘ సమావేశాలు నిర్వహించారు. అప్పులు ఎలా తీసుకున్నారు? ఆస్తులు ఎలా తనఖా పెట్టారు? కార్పొరేషన్ల ద్వారా ఎంత అప్పులు తీసుకున్నారు? అనే వివరాలను అధికారులతో చర్చించారు. కాళేశ్వరం బాగోతం వివరించేందుకు ఈనెల 29వ తేదీన ఐటీ మంత్రి డీ శ్రీధర్ బాబుతో కలిసి ఉత్తమ్ రెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నారు. ఈ మేరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు వెళ్లాయి. ప్రాజెక్టు ప్రాంతంలో మీడియా ప్రతినిధులకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చి అక్రమ, నిరర్ధక వ్యయంపై వివరాలు వెల్లడించనున్నారు. అదేవిధంగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు కుంగిన మేడిగడ్డ పియర్స్ ను కూడా తనిఖీ చేయనున్నారు. ఆ తరువాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీని సందర్శిస్తారని తెలిసింది.
గ్రామసభల్లో బండారం బయటకు..
రాష్ట్ర ఆర్థిక దుస్థితి, నిధుల సమస్యపై ఈనెల 28వ తేదీ నుంచి జరిగే గ్రామ సభలలో ప్రజలకు ఎమ్మెల్యేలు, మంత్రులు విడమర్చి చెప్పనున్నారు. వారం రోజుల పాటు రాష్ట్రంలో గ్రామ సభలు నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. గ్రామ సభలలో 6 గ్యారెంటీలపై దరఖాస్తులు స్వీకరించనున్నారు. గత పదేళ్ల పాలనలో సాగునీటి రంగం, విద్యుత్, ఆర్థిక దుస్థితిపై ప్రజలకు వివరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులకు సందేశం పంపించారు. పదేళ్ల విధ్వంసాన్ని విడమర్చి చెప్పడం ద్వారా ఎంత నష్టం జరిగిందనేది ప్రజలకు తెలుస్తుందన్నారు. ఇందుకోసం ప్రతిఒక్కరు సన్నద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి సూచించారు.
ధరణి గోల్ మాల్ పై సంపూర్ణ ఆడిట్
కిరికిరి ఉన్న భూములు, ప్రభుత్వ భూములు కొల్లగొట్టేందుకే ధరణి పోర్టల్ ను ప్రారంభించారనే విమర్శలపై రేవంత్ రెడ్డి.. రెవెన్యూ అధికారులతో సమీక్ష నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఎన్ఐసీకి పోర్టల్ రూపకలప్పన, నిర్వహణ బాధ్యతలు అప్పగించకుండా, తమ చెప్పుచేతల్లో ఉండే ప్రైవేటు కంపెనీకి గత ప్రభుత్వం అప్పగించిన విషయం తెలిసిందే. ప్రజలు, ప్రజా ఉద్యమకారులు గొంతెత్తి అరిచినా పట్టించుకోలేదు. రంగారెడ్డి జిల్లాలో వేలాది ఎకరాల భూములను తమ పేరున మార్చుకునేందుకు రాత్రిపూట రెవెన్యూ, రిజిస్ట్రేషన్ అధికారులతో పనిచేయించుకున్నారు. ధరణి గోల్ మాల్ పై ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఫోరెన్సిక్ ఆడిట్ వల్ల ఏ సమయంలో ఏం జరిగింది? ఏ అధికారి తప్పిదానికి పాల్పడ్డారు? అనేది ఆధారాలతో సహా వెలుగుచూస్తుంది. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావుకు ఏమాత్రం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ముందుకు సాగాలని కాంగ్రెస్ ప్రభుత్వం ధృడ సంకల్పంతో ఉందనేది స్పష్టమవుతున్నది.