నారాయణ పేటలో దూసుకుపోతున్న కాంగ్రెస్
నారాయణ పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ పుంజుకుంటోంది. ఆపార్టీ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డికే ఇక్కడి జనం జై కొడుతున్నారు.

- పర్ణికకే జై కొడుతున్న జనం
- ఊరూరా హస్తం శ్రేణుల్లో పండుగ వాతావరణం
- బీఆర్ఎస్ అభ్యర్థిపై పెరుగుతున్న వ్యతిరేకత
- ప్రచారాల్లో తిరగబడుతున్న జనం
- సంకటంలో గులాబీ శ్రేణులు
విధాత, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రతినిధి: నారాయణ పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ గ్రాఫ్ పుంజుకుంటోంది. ఆపార్టీ అభ్యర్థి చిట్టెం పర్ణిక రెడ్డికే ఇక్కడి జనం జై కొడుతున్నారు. ఊరూరా బ్రహ్మరథం పడుతున్నారు. జన స్వాగతంతో ప్రచారంలో దూసుకుపోతున్నారు. తాత దివంగత చిట్టెం నర్సి రెడ్డి, తండ్రి దివంగత చిట్టెం వెంకటేశ్వర్ రెడ్డి రాజకీయ వారసురాలిగా అరంగేట్రం చేసిన డాక్టర్ పర్ణిక రెడ్డికి ప్రజలు జేజేలు పలుకుతున్నారు.
రాజకీయ అనుభవం లేకున్నా కొద్దిరోజుల్లోనే ప్రజల మన్ననలు చూరగొన్నారు. తన మేనమామ కుంభం శివకుమార్ రెడ్డి అండతో ప్రచారంలో గెలుపు దిశగా దూసుకెళుతున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో ఒక పర్యాయం ప్రచారం చేశారు. ప్రజల నుంచి భారీఎత్తున మద్దతు లభిస్తోందని ఆపార్టీ శ్రేణులు ఉత్సాహంతో సాగుతున్నారు.
పర్ణిక గెలుపు సునాయాసమేనని అంటున్నారు. నియోజకవర్గంలోని ధన్వాడ, కోయిలకొండ, దామరగిద్ద, మరికల్ మండలాలతో పాటు నారాయణ పేట పట్టణంలో కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే ప్రజల్లో మంచి పట్టు సాధించిందని చెబుతున్నారు. అఖండ మెజారిటీ వస్తుందని కాంగ్రెస్ సీనియర్ నాయకులు పేర్కొంటున్నారు.

చిట్టెం వారసురాలిగా ప్రజాబలం
గతంలో నారాయణ పేట నియోజకవర్గంలోని మండలాల్లో చిట్టెం నర్సిరెడ్డికి మంచి పట్టు ఉండేది. ఆయనది సొంత మండలం ధన్వాడ కావడంతో కాంగ్రెస్ కు అక్కడ తిరుగులేదు. నర్సిరెడ్డి మక్తల్ కు అంకితం కావడంతో నారాయణపేట నియోజకవర్గంలో ఇంతవరకు చిట్టెం వారసులు రాజకీయంగా దూరమయ్యారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో బీఆర్ఎస్ కు అవకాశం వచ్చినట్లయ్యిందని స్థానికంగా చర్చ జరుగుతోంది.
చిట్టెం వారసులు ఉంటే ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి గట్టి పునాది ఉండేదని చెబుతున్నారు. వేరే పార్టీలకు అవకాశం వచ్చేది కాదని అంటున్నారు. ఇన్ని రోజులకు చిట్టెం వారసురాలు పర్ణికకు కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఎంతో వ్వూహాత్మకంగా టీపీసీసీ నిర్ణయం తీసుకుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇక్కడి అభ్యర్థిగా పర్ణికకు అవకాశం కల్పించి చిట్టెం వారసత్వాన్ని నిలబెట్టారు. టీపీసీసీ వ్యూహాలకు అనుగుణంగానే ఈ నియోజకవర్గంలో పర్ణికకు ఊహించని విధంగా ప్రజాబలం దక్కింది.
రాజకీయానికి కొత్తయినా, ప్రత్యర్థులపై మాటల తూటాలు వదులుతున్న పర్ణిక ను చూసి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చమటలు పడుతున్నాయని కాంగ్రెస్ శ్రేణులు అంటున్నాయి. కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో ఉన్న ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలపై ప్రజలకు వివరించడంలో పర్ణిక సఫళీకృతులయ్యారని చెప్పవచ్చు. నారాయణ పేట నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని సీనియర్ కాంగ్రెస్ నేతలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
బీఆర్ఎస్ అభ్యర్థికి తప్పని నిరసన సెగలు
నారాయణ పేట బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డికి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయన్న ప్రచారం జరగుతోంది. ప్రచారంలో గ్రామస్తులు ఎక్కడిక్కడ అడ్డుకుంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ప్రచారం ఆద్యంతం నిరసనల మధ్య ప్రసంగించి మమా అనిపించి వెళ్లిపోతున్నారు. పలు గ్రామాల్లో ప్రజలకు శాపాలు పెడుతుండడంతో వారు తిరగబడుతున్నారు.
‘మా పథకాలు అనుభవిస్తూ మాకే ఎదురు చెప్తారా’ అంటూ గ్రామస్థులపై రాజేందర్ రెడ్డి ఆగ్రహం చెందుతున్నారు. కోపిష్టి తనతో ప్రజలందరూ మండిపడుతూ కొద్దిరోజుల్లో నారాయణ పేటకు శని వదులుతుందని బహిరంగoగా అంటున్నారు. ఏదిఏమైనా ఈ ఎన్నికల్లో నారాయణ పేటలో కాంగ్రెస్ పార్టీకే జనం జై కొడుతున్నారని రాజకీయ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇక్కడి ప్రజలు మార్పును కోరుకుంటున్నారని కాంగ్రెస్ ఊపును బట్టి అర్థమవుతోంది.