బిల్లులపై చేతులెత్తేశారా?…బకాయిలు 30వేల కోట్లు
మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. గడిచిన 11 ఏళ్లలో బకాయిలు సకాలంలో చెల్లించలేని దుస్థితికి చేరింది. మా బిల్లులు మాకు చెల్లించి ఆదుకోవాలంటూ చిన్న చిన్న కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నాకు దిగారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు

- సర్కారు బకాయిలు 30వేల కోట్లు!
- గత సర్కారు బకాయిలు 40,154 కోట్లు
- చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించలేని స్థితి
- సచివాలయంలో కాంట్రాక్టర్ల ఆందోళన
- మొన్న భట్టి విక్రమార్క చాంబర్ ముందు
- నేడు సుల్తానియా చాంబర్ వద్ద
- అంతా చిన్నాచితకా కాంట్రాక్టర్లే
- వాళ్లకు చెల్లించాల్సిందీ 369 కోట్లే!
- ఇంత చిన్నామొత్తాలే చెల్లించలేరా?
- మింగ, కక్కలేని స్థితిలో రేవంత్ సర్కార్
హైదరాబాద్, ఆగస్టు 18 (విధాత): మిగులు రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ.. గడిచిన 11 ఏళ్లలో బకాయిలు సకాలంలో చెల్లించలేని దుస్థితికి చేరింది. మా బిల్లులు మాకు చెల్లించి ఆదుకోవాలంటూ చిన్న చిన్న కాంట్రాక్టర్లు సచివాలయంలో ధర్నాకు దిగారంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఒక మారు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క చాంబర్ ముందు కాంట్రాక్టర్లు ధర్నా చేయడం సంచలనం రేపిన విషయం అందరికీ తెలిసిందే. బీఆరెస్ హయాంలో ఉన్న పెండింగ్ బిల్లులన్నీ చెల్లించాలని పదవీ కాలం ముగిసిన సర్పంచ్‌లు ఆందోళన నిర్వహించిన విషమూ గమనంలో ఉన్నదే. గతంలో చేసిన పనులకు బిల్లులు ఇవ్వాలని ఇద్దరు జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లు ఆత్మహ్యత్యకు ప్రయత్నించారు. పరిస్థితి ఎంతదాకా వెళ్లిందంటే.. అదిలాబాద్ జిల్లాలో కాంట్రాక్టర్ ప్రవీణ్.. తాను చేసిన పనులకు బిల్లులు రాక తీవ్ర ఆందోళనకు గురై గుండెపోటుతో చనిపోయాడు.
గత సర్కారు హయాం నుంచి బకాయిలు
బీఆరెస్ ప్రభుత్వ హయాం నుంచి కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, ఇతర వర్గాల వారికి చెల్లించాల్సిన బిల్లులు భారీ ఎత్తున పెండింగ్ పడ్డాయి. ఆగస్టు 15వ తేదీ స్వాతంత్య్ర దినోత్సవం నాడు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తమ ప్రభుత్వం కొలువు దీరే నాటికి బీఆరెస్ ప్రభుత్వం రూ.40,154 కోట్లు బిల్లులు పెండింగ్‌లో పెట్టిందని చెప్పారు. ప్రస్తుతం రేవంత్ రెడ్డి సర్కారు వద్ద రూ.30 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయని తెలుస్తున్నది. ఇందులో తమకు చెల్లించాల్సిన బిల్లులే రూ.10 వేల కోట్లు ఉన్నాయని కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఇక ఉద్యోగులకు, పదవీవిరమణ చేసిన వారికి చెల్లించాల్సిన బకాయిలు మరో రూ.8 వేల కోట్ల వరకు ఉన్నాయి. ఇవి కాకుండా ఇతర అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు చెల్లించాల్సిన బకాయిలు రూ.12 వేల కోట్ల వరకు ఉన్నాయి.
పొంతలేని ఆదాయం, ఖర్చు
వస్తున్న ఆదాయానికి, చేస్తున్న ఖర్చులకు ఎలాంటి పొంతన కుదరకపోవడంతో రోజువారీ ఖర్చులకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి తెలంగాణ ప్రభుత్వానికి ఏర్పడింది. ఎవరి పాలనలో ఏమి అప్పులయ్యీయి అనే దానికంటే రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందన్నది వాస్తవమని రాజకీయ పరిశీలకుడొకరు అన్నారు. తెలంగాణ అంటే మార్కెట్‌లో అప్పులు పుట్టే పరిస్థితి కూడా లేదని, తనను చీల్చినా తన దగ్గర నయాపైస లేదని ఒక సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి అన్న మాటలు గుర్తుకు వస్తున్నాయి. ఆర్థిక లేమి ఒక వైపు, అరకొర ఆదాయం మరో వైపు.. దీంతో చిన్న చిన్న కాంట్రాక్టర్లకు కూడా చెల్లింపులు చేయడానికి తెలంగాణ సర్కారు వెనుకాడుతున్నది.
ధర్నా చేసినది చిన్న కాంట్రాక్టర్లు
సచివాలయంలో ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా చాంబర్ ముందు ధర్నాచేసిన కాంట్రాక్టర్లు చాలా చిన్నవాళ్లు. మన ఊరు- మన బడి కార్యక్రమం కింద ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం పనులు చేసిన వాళ్లు. ఈ పనులు చేసిన కాంట్రాక్టర్లలో చాలా మంది స్కూల్ అభివృద్ధి కమిటీ సభ్యులే ఉన్నారు. వీళ్లంతా గ్రామాల్లో చిన్న చిన్న పనులు చేసుకొని బతికే వాళ్లు. ప్రభుత్వం అప్పగించిన పనులు కావడంతో సకాలంలో డబ్బులు వస్తాయన్న ఆశతో దొరికిన కాడల్లా అప్పులు చేసి పనులుచేసిన వాళ్లు. వీరు చేసిన పనులకు బిల్లులు రాక చేసిన అప్పులకు వడ్డీలు కూడా కట్టలేక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తెలంగాణ అంతటా పని చేసిన ఈ కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు కేవలం రూ.369 కోట్లు కావడం గమనార్హం. ఇంత చిన్న చెల్లింపులు కూడా సర్కారు చేయలేక ముఖం చాటేస్తున్నందంటే ప్రభుత్వం చేతులెత్తేస్తున్నదా? అన్న సందేహాలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.