దసరా సెలవుల్లో మార్పు.. 23, 24తేదీలలో సెలవులు

విధాత : తెలంగాణ ప్రభుత్వం దసరా సెలవుల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ప్రభుత్వ క్యాలెండర్‌లో ఈనెల 24వ తేదీన ఉన్న దసరా సెలవును 23వ తేదీకి మార్చుతూ ఉత్తర్వులిచ్చింది. దసరా సెలవును ఒక రోజు ముందుకు మార్చిన ప్రభుత్వం 24వ తేదీని కూడా సెలవు రోజుగానే ప్రకటించడం గమనార్హం.
గతంలో 24,25తేదీల్లో ఉన్న సెలవుల స్థానంలో 23,24తేదీల్లో సెలవులను ప్రకటించింది. పాఠశాల విద్యార్థులకు సెలవులతో పాటు, మిగతా వారికి అక్టోబర్ 23, 24 తేదీల్లో దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది. బతుకమ్మ ప్రారంభ రోజును అక్టోబర్ 14న సాధారణ సెలవు ఇవ్వగా.. దుర్గాష్టమి అక్టోబర్ 22న ఐచ్ఛిక సెలవు ఇచ్చింది.
పండుగ నేపథ్యంలో పాఠశాలలకు దాదాపు 13 రోజులు పాటు సెలవులు ఇవ్వగా.. జూనియర్ కళాశాలలకు కళాశాలలకు ఏడు రోజులు సెలవులు ఉండనున్నాయి. తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ప్రకారం జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19 నుంచి 25 వరకు సెలవులు కొనసాగనుండగా 26న తెరచుకోనున్నాయి. జూనియర్ కాలేజీలకు దసరా సెలవుల్లో ఎలాంటి ప్రత్యేక తరగతులు నిర్వహించరాదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది.