TS Digital Health Card: ప్రజలందరికీ డిజిటల్ హెల్త్‌కార్డులు
తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం(Telangana Government) డిజిటల్ హెల్త్‌కార్డు (Digital Health Card) విధానం అమల్లోకి తెస్తోంది

తెలంగాణ సర్కారు వినూత్న నిర్ణయం..
హైదరాబాద్ విధాత ప్రతినిధి: తెలంగాణ ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం(Telangana Government) డిజిటల్ హెల్త్‌కార్డు (Digital Health Card) విధానం అమల్లోకి తెస్తోంది. ఈ కార్డును ఆధార్‌తో అనుసంధానం చేయడం వల్ల రాష్ట్రంలో ఏ ఆసుపత్రికి వెళ్లినా కార్డు ఆధారంగా నిర్ధారణ పరీక్షలు చేయించుకునే వెసులుబాటు ఉంటుంది. ఇప్పటికే ములుగు (Mulugu), సిరిసిల్ల (Rajanna Siricilla) జిల్లాలో పైలట్‌ప్రాజెక్ట్ (Pilot Project) విజయవంతమైంది. దీంతో ఈ డిజిటల్ హెల్త్ కార్డు విధానాన్ని తెలంగాణలోని అన్ని జిల్లాలకు వర్తింపజేయాలని సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) వైద్య శాఖను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఈ మేరకు దిశా నిర్దేశం చేశారు.
డిజిటల్ హెల్త్ కార్డు అంటే..
ఒక వ్యక్తి హెల్త్ ప్రొఫైల్ డిజిటలైజ్ చేయడం వల్ల అనారోగ్యం పాలైన వ్యక్తికి రోగనిర్థారణ పరీక్షలు చేసే సమయంలో అనవసర పరీక్షలు చేయాల్సిన అవసరం ఉండదు. అతనికి గతంలో ఎలాంటి ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, దానికి ఏ చికిత్స తీసుకున్నారు, అతని బ్లడ్ గ్రూప్, ఏ మందులు పడతాయి, ఏ మందులు పడవు వంటి వివరాలు అందుబాటులో ఉంటాయి. దీంతో వెంటనే చికిత్స మొదలు పెట్టడానికి వీలవుతుంది. దీనివల్ల అనవసరపు ఖర్చు కూడా తగ్గుతుంది. డాక్టర్లకు వైద్య సేవలు అందించడం కూడా సులువుగా ఉంటుంది. ఇలా చేయడం ద్వారా ప్రతి ఒక్కరి డేటా ప్రభుత్వం వద్ద ఉంటుంది. దీని ఆధారంగా వైద్యసేవలు మెరుగు పరచడానికి వీలవుతుంది. ఈ అంశాలన్నింటిని పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్రంలో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ (Digital Health Profile) రూపొందించి కార్డులు జారీ చేయాలని నిర్ణయించింది. ఈకార్డుకు ఒక యూనిక్ నెంబర్‌ను ఇవ్వనున్నది.
పైలట్ ప్రాజెక్టు సక్సెస్..
హెల్త్ ప్రొఫైల్ రూపకల్పన కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ములుగు, సిరిసిల్ల జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ అమలు చేసింది. ఇందు కోసం సిబ్బందికి ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చింది. శిక్షణ తీసుకున్న సిబ్బంది ఇంటింటికి తిరిగి ప్రజల ఆరోగ్య వివరాలను సేకరించి డిజిటలీకరించారు (Digitalisation). ఆరోగ్య వివరాలకు తోడు ఆ వ్యక్తి ఆధార్ కార్డును కూడా అనుసంధానం చేశారు. ఇలా ప్రజల ఆరోగ్యవివరాలను డిజిటలీకరించిన ఆరోగ్య శాఖ అధికారులు ప్రత్యేక డిజిటల్ కార్డును రూపొందించారు. ఇలా ఈ రెండు జిల్లాల్లో చేపట్టిన పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా మూడున్నర కోట్ల ప్రజానీకం ఆరోగ్య వివరాలను ఇంటింటికి తిరిగి సేకరించి ఆ వివరాలను డిజిటలీకరించి, ప్రత్యేక కార్డులను రూపొందించాలని నిర్ణయించింది. ఇలా రూపొందించే ప్రొఫైల్‌కు ఆధార్ కార్డును అను సంధానం చేసి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులను రూపొందించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఈ హెల్త్ ప్రొఫైల్ కార్డుకు ఆరోగ్యశ్రీ (Aarogya Sree) ని అనుసంధానం చేయాలని రేవంత్ సూచించారు. ఈ మేరకు అధికారులు ప్రజల ఆరోగ్య వివరాల సేకరణకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.