Former DSP Nalini : నవమిలోపు తేల్చకపోతే మరణమే శరణ్యం
మాజీ డీఎస్పీ నళిని తన సమస్యలు నవమిలోపున తీర్చకపోతే మరణమే శరణ్యం అని హెచ్చరించారు. ఫేస్‌బుక్‌లో వంగ్మూలం పోస్ట్‌లతో ఆవేదన వ్యక్తం.

విధాత : తన సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఈ నవమిలోపున తేల్చకపోతే మరణమే శరణ్యమని, జీవసమాధి అవుతానని మాజీ డీఎస్సీ నళిని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో డీఎస్పీ పదవికి రాజీనామా చేసిన నళిని కొన్ని రోజులుగా మరణ వాంగ్మూలం పేరిట ఫేస్‌బుక్‌లో పలు పోస్టులను పెడుతూ వస్తున్నారు. శుక్రవారం ఆమె చేసిన పోస్టులో తన సమస్యలను మరోసారి ఏకరువు పెట్టారు. తన విషయం సీఎం రేవంత్ రెడ్డి పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తన మరణ వాంగ్మూలాన్ని ఆర్డీవోతో రికార్డ్ చేయించడం మినహా ఇప్పటి వరకు ఇంకేమీ చేయలేదన్నారు.
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవడానికి వారికి వారం కూడా పట్టలేదు. కానీ నా విషయంలో సంవత్సరాల తరబడి కావాలని తాత్సారం చేస్తున్నారని నళిని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ అధికారినైనా సస్పెండ్ చేస్తే 6 నెలల్లోపు విచారణ పూర్తి చేయాలి. విచారణ సమయంలో 1/3 లేదా 1/2 జీతాన్ని జీవన భృతి కింద ఇవ్వాల్సి ఉంటుంది. అలా ఇవ్వకపోవడం నేరం కిందికి వస్తుంది. సీఎం రేవంత్ రెడ్డికి 21 నెలల క్రితం నేనిచ్చిన రిపోర్టుపై ఇంకా చర్యలు తీసుకోకుండా నిర్లిప్తంగా ఉన్నారు అని నళిని ఆరోపించారు